calender_icon.png 13 February, 2025 | 12:12 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎలా చేద్దాం.. ఏం చేద్దాం?

13-02-2025 12:25:37 AM

  • విద్యాకమిషన్ నివేదికలపై ప్రభుత్వం కసరత్తు
  • అమలు సాధ్యాసాధ్యాలపై యోచన
  • మిడ్ డే మీల్స్, ఫీజు నియంత్రణపై ఇప్పటికే  కమిషన్ నివేదిక అందజేత
  • జూన్‌కు ముందే ఫీజుల నియంత్రణ చట్టం 
  • తేవాలని విద్యార్థి సంఘాల డిమాండ్

హైదరాబాద్, ఫిబ్రవరి 12 (విజయక్రాంతి): ప్రభుత్వ స్కూళ్లు, గురుకులాలు, హాస్టళ్లలో మధ్యాహ్న భోజన పథకం అమలు తీరు, ప్రైవేట్ పాఠశాలల్లో ఫీజుల నియంత్రణలపై తెలంగాణ విద్యాకమిషన్ ఇప్పటికే ప్రభుత్వానికి వేర్వేరుగా నివేదికలు అందజేసింది. కమిషన్ సిఫార్సుల అమలు సాధ్యసాధ్యాలపై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఎలా చేస్తే బాగుంటుందనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టు విద్యాశాఖలోని ఓ ఉన్నతాధికారి తెలిపారు.

పిల్లలకందించే మధ్యాహ్న భోజనంలో చేపట్టాల్సిన సంస్కరణలను ప్రభుత్వం 2025 విద్యాసంవత్సరం నుంచి లేదా వీలైతే ఈ విద్యా సంవత్సరం నుంచే అమలు చేసే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఫీజుల నియంత్రణ చట్టం అమలుకు మాత్రం శాసనసభ ఆమోదం తప్పనిసరి. త్వరలో జరిగే బడ్జెట్ సమావేశాల్లో ఇందుకు సంబంధించిన బిల్లును ప్రవేశపెడతారా? లేదా మరోసారి ప్రత్యేకంగా సభను ఏర్పాటు చేస్తారా అనే విషయమై స్పష్టత రావాల్సి ఉంది.

ఇంతకంటే ముందు క్యాబినెట్ ఆమోదం పొందాల్సి ఉంటుంది. విద్యా కమిషన్ అందజేసిన ఈ రెండు నివేదికలపై కసరత్తు ప్రారంభించిన ప్రభుత్వం అటు ప్రైవేట్ స్కూళ్లు నష్టపోకుండా, ఇటు తల్లిదండ్రులపై భారం పడకుండా చట్టాన్ని రూపొందించాలని సమాలోచనలు చేస్తోం ది. ఇదిలా ఉండగా ప్రభుత్వ స్కూళ్లపై మరో సమగ్ర నివేదిక అందజేయాలని తెలంగాణ విద్యాకమిషన్ ప్రభుత్వానికి అందించనున్నట్టు సమాచారం.

మధ్యాహ్న భోజనంపై కమిషన్ సిఫార్సులు

* టాయిలెట్స్ సహా కిచెన్, డైనింగ్‌హాల్స్ శుభ్రంగా ఉంచాలి. 

* సరుకుల స్టోరేజీ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. వెంటిలేషన్‌తో పాటు ఫ్యాన్లు ఏర్పాటు చేయాలి. 

* సన్నబియ్యం, తాజా కూరగాయలు, పండ్లు, చికెన్, మటన్ పోషకాలతో కూడిన ఆహారం అందించాలి

* 1 6- 9, 10 తరగతుల్లోని విద్యార్థులకు వేర్వేరు పరిమాణంలో భోజనాల అందజేత.

* సెంట్రలైజ్డ్ టెండర్ల సరకుల సరఫరా. 

* రవ్వ, బియ్యం, పప్పులు, నూనె, వంట సామాగ్రిని తెలంగాణ ఎడ్యుకేషన్ వెల్ఫేర్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (టీజీఈఐబ్యూడీసీ) ద్వారా సరఫరా చేయాలి.

* పాములు, విష పురుగులు తిరగకుండా ప్రహరీగోడల నిర్మాణం.

* 500 మంది విద్యార్థులకు వెయ్యి చదరపు ఫీట్ల విస్తీర్ణంలో డైనింగ్ హాల్ నిర్మాణం. విద్యార్థులకు సరిపడా ఫర్నీచర్ అందుబాటులో ఉంచాలి.

* నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ (ఎన్‌ఐఎన్)తో ఫుడ్ శాంపిల్ పరీక్షలు, నీటి నాణ్యత పరీక్షల నిర్వహణ.

ఫీజుల -చట్టం కార్యరూపం దాల్చేనా?

ప్రైవేట్ స్కూళ్ల అడ్డగోలు ఫీజుల దోపిడీకి అడ్డుకట్ట వేయాలనే డిమాండ్ ఎప్పటి నుం చో ఉంది. గత ప్రభుత్వం దీనిపై క్యాబినెట్ సబ్‌కమిటీలు వేసి, నివేదికలు కూడా తెప్పించుకుంది. అయినా చట్టరూపం దాల్చలేదు. కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం దీనిపై ఫోకస్ పెట్టడంతో విద్యాకమిషన్ ఓ నివేదికను రూపొందించి ప్రభు త్వానికి అందజేసింది. ఇప్పటికే 2025 26కు సంబంధించి కొన్ని కార్పొరేట్ స్కూళ్లు అడ్మిషన్లు ప్రారంభించాయి. ఈక్రమంలో త్వరగా చట్టాన్ని తీసుకురావాలని విద్యాసంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

అమలు సాధ్యమయ్యేనా!

తెలంగాణ విద్యాకమిషన్ మధ్యా హ్న భోజన పథకం అమలు విషయం లో ప్రభుత్వానికి కీలక సూచనలు చేసింది. మధ్యాహ్న భోజనాన్ని కట్టెల పొయ్యిల మీద వండొద్దని, గ్యాస్ పొయ్యిలే వాడాలని పేర్కొంది. ఇప్పటికీ చాలా స్కూళ్లలో వంట చేసేందుకు తగి న వసతులు లేవు. విద్యార్థులు తాగేందుకు మిషన్ భగీరథ నల్లా నీటినే వాడాలని సూచించింది.

కానీ రాష్ట్రంలోని 26 వేలకుపైగా స్కూళ్లుంటే, అందులో దాదాపు 6 వేల వరకు స్కూళ్లకు మిషన్ భగీరథ నీళ్లు అందడం లేదని గణాంకాలు చెబుతున్నాయి. ప్రభుత్వ విద్యాసంస్థలు, గురుకులాలు, హాస్టళ్లలన్నింటికీ కామన్ మెనూ అమ లు చేయాలని ప్రతిపాదించింది. కానీ కామన్ మెనూ విధానం కొన్ని స్కూళ్ల లో ఇప్పటికే అమలవుతోందని టీచర్లు చెబుతున్నారు. వీటితోపాటు మధ్యా హ్న భోజన కార్మికులకు మెస్ చార్జీలు పెంచాల్సి ఉంటుంది.

ఫీజుల నియంత్రణపై కమిషన్ సిఫార్సులు

* ఐదు కేటగిరీలుగా ప్రైవేట్ స్కూళ్ల విభజన.

* ఫీజుల నియంత్రణకు రెండు కమిషన్ల ఏర్పాటు

* వినియోగదారుల ధరల సూచీ, పాఠశాలలో కల్పిస్తున్న వసతులు పరిగణనలోకి తీసుకుని ఫీజుల ఖరారు.

* కమిషన్ ఖరారు చేసిన ఫీజులనే స్కూళ్లు వసూలు చేయాలి. ఫీజులను పాఠశాల వెబ్‌సైట్‌లో పొందుపరచాలి.

* ఫీజు రెగ్యులేటరీ కమిషన్‌లో సభ్యులుగా పాఠశాల యాజమాన్యాల ప్రతినిధులు, రిటైర్డ్ ప్రొఫెసర్లు, విద్యావేత్తలకు చోటు.

* హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ -మల్కాజిగిరి జిల్లాల్లో పాఠశాలల ఫీజులను స్టేట్ ఫీజు రెగ్యులేటరీ కమిషన్ ఖరారు చేస్తుంది. మిగతా జిల్లాల్లో కలెక్టర్ నేతృత్వంలోని కమిషన్ ఖరారు చేస్తుంది.

* ప్రతీ మూడేండ్లకోసారి పాఠశాలల నుంచి ప్రతిపాదనలు స్వీకరించి, ఆర్థిక నివేదికను ఆడిట్ చేయించి.. ఆ తర్వాత ఫీజులను కమిషన్ సవరిస్తుంది. కనీస ఫీజును సైతం ఖరారు చేస్తారు.

* పాఠశాలల్లో పుస్తకాలు, బ్యాగులు, షూస్ వంటి వాటిని విక్రయించొద్దు. ఫలానా బుక్‌స్టాళ్లో మాత్రమే కొనాలని షరతులు విధించొద్దు.

* రవాణాకు స్కూల్ బస్సులనే వాడాలని ఒత్తిడి తీసుకురావొద్దు. తల్లిదండ్రులకే స్వేచ్ఛనివ్వాలి.

* ఫీజులపై ఫిర్యాదుల స్వీకరణకు గ్రివెన్స్ సెల్ ఏర్పాటు.