09-02-2025 12:23:47 AM
సోలో ట్రావెల్
‘సోలో బతుకే సో బెటర్’ అన్నట్లుగా ‘సోలో వెకేషన్ సో బెటర్’ అంటున్నారు ఈతరం అమ్మాయిలు, మహిళలు. ఒంటరి ప్రయాణంలో ఉండే మజాయే అందుకు కారణం. సహజంగా ఎవరైనా ఎక్కడికైనా పర్యాటక ప్రదేశాలకువెళ్లాలనుకున్నప్పుడు కుటుంబ సభ్యులతోనో, స్నేహితులతోనో వెళ్తారు. అలాంటప్పుడు ఒక్కొక్కరి ఆలోచనలు ఒక్కోలా ఉంటాయి.
దీంతో కొందరికి నచ్చే విషయాలు మరికొందరికి నచ్చకపోవచ్చు. తప్పనిసరి పరిస్థితుల్లో సర్దుకుపోతారు. దాంతో తమకు నచ్చినట్లు ఎంజాయ్ చేయలేక బాధపడుతుంటారు. అందుకే చాలామంది సోలో వెకేషన్‌కే జై కొడుతూ.. ఎగిరిపోతే ఎంత బాగుంటుంది అంటూ దూర తీరాలకు పయనమవుతున్నారు.
సోలో వెకేషన్ ప్లాన్ చేసుకుంటే ఎవరి కోసమూ వేచి చూడాల్సిన అవసరం ఉండదు. ఎక్కడికంటే అక్కడికి, ఎప్పుడు పడితే అప్పుడు, ఎలాగంటే అలా వెళ్లే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. దీంతో సోలో ట్రావెల్ చేయాలనుకునేవారు తమకు ఇష్టమొచ్చినట్లుగా తిరిగేసి రావచ్చు.
ఇటీవల కాలంలో చాలా మంది పర్యాటకులు సైతం ఇలాంటి ఒంటరి ప్రయాణాలకే మొగ్గుచూపుతున్నారు. ముఖ్యంగా చదువులు పూర్తి చేసిన అమ్మాయిలు, లేదా ఉన్నత విద్యనభ్యసిస్తున్న యువతులు, ఉద్యోగాలు చేస్తున్న మహిళలు ఇలా సోలో ట్రిప్స్‌నే బాగా ఆస్వాదిస్తున్నారు. దీంతో అలాంటి ప్రయాణాలకు ఈ మధ్య మంచి డిమాండ్ ఏర్పడింది.
ప్రయాణం ఎందుకంటే..
కుటుంబ బాధ్యతలన్నీ పక్కన పెట్టి మహిళలు ఒంటరిగా వెకేషన్‌కు వెళ్లడం వల్ల వారికి బోలెడన్ని ప్రయోజనాలు చేకూరతాయని నిపుణులు చెబుతున్నారు.
* వెకేషన్‌లో భాగంగా ఇంటి బాధ్యతలు, ఆఫీస్ పనుల నుంచి కాస్త విరామం దొరకడంతో.. ఇటు శరీరానికి, అటు మనసుకు సాంత్వన లభిస్తుంది. ఇది మహిళలు తిరిగి పునరుత్తేజితమయ్యేందుకు దోహదం చేస్తుంది. తద్వారా వెకేషన్ నుంచి తిరిగొచ్చాక రెట్టింపు ఉత్సాహంతో తిరిగి బాధ్యతల్లో నిమగ్నమవ్వచ్చు. ఒంటరిగా ప్రయాణాలు చేయడం వల్ల ఏ నిర్ణయమైనా స్వయం గా తీసుకోవచ్చు.. తద్వారా నిర్ణయాత్మక సామర్థ్యం పెరుగుతుంది. ఇది ఇంటా, బయటా మిమ్మల్ని ప్రోత్సహిస్తుంది.
* కొంతమందిలో కొన్ని రకాల భయాలుంటాయి. ఒంటరిగా వెళ్తే ఏమవుతుం దో? కొత్త ప్రదేశం/కొత్త వ్యక్తులు సురక్షితమో? కాదో?.. అని! ఒక్కసారి ధైర్యం గా అడుగు ముందుకేస్తేనే కదా వీటన్నింటినీ అధిగమించచ్చు. కాబట్టి సోలో ట్రావెలింగ్‌తో ధైర్యసాహసాలూ అలవడతాయి.
* వెళ్లిన చోట కొత్త వ్యక్తులు పరిచయమవుతారు.. వాళ్ల నుంచి బోలెడన్ని విషయా లు తెలుసుకునే అవకాశం దొరుకుతుం ది.. అలాగే అక్కడి సంస్కృతీ సంప్రదాయాల్ని తెలుసుకోవడంతోపాటు కెరీర్‌కు సంబంధించిన విషయాలు, పేరెంటింగ్ పాఠాలు.. వంటివీ నేర్చుకొని మీ జీవితం లో పాటించేయొచ్చు. వ్యక్తిగత, కెరీర్ అభివృద్ధిలో సోలో ట్రావెలింగ్ ఇలా కూడా మేలు చేస్తుందంటున్నారు నిపుణులు.
* ఎంతసేపూ కంఫర్ట్ జోన్‌లో ఉండడం వల్ల మన బలాలు, బలహీనతలేంటో గుర్తించలేం. అదే ఒక్కసారి ధైర్యం చేసి కంఫర్ట్ జోన్ నుంచి బయటికొచ్చామంటే.. ఇవన్నీ మనకు అవగతమవు తాయి. దాన్ని బట్టి మన జీవితంలో ఎలాంటి మార్పులు చేసుకోవాలో తెలుస్తుంది. ఇదీ మన జీవితంలో ఎదిగేందు కు సహాయపడుతుంది.
వీటిని మరిచిపోవద్దు
అదనపు వస్తువుల్లో తప్పనిసరి అనుకునేవి సన్‌గ్లాసెస్, వాచెస్, టోపీలు, చిన్న బ్యాగులు, చెప్పులు, హెడ్‌సెట్ లేదా వైర్‌లెస్ ఇయర్ బడ్స్ వంటివి పెట్టుకోవచ్చు. అలాగే ఇప్పుడు అందరి వద్దా స్మార్ట్ ఫోన్ కూడా ఉంటుంది కాబట్టి మీరు వెళ్లాలనుకునే ప్రదేశాల్లో అవసరమైన యాప్స్ డౌన్‌లోడ్ చేసుకోండి. అలాగే భద్రతకు సంబంధించిన అలారమ్ కీలు, పెప్పర్ స్ప్రేలు ఉండటం మంచిదే.
ఎప్పుడైనా.. ఎక్కడైనా
వెంట డెబిట్ లేదా క్రెడిట్ కార్డులతో పాటు కాస్త డబ్బు కూడా తీసుకెళ్లాలి. ఒక వేళ అంతర్జాతీయ పర్యటనకు వెళితే ఆయా స్థానిక కరెన్సీని ముందే ఎక్స్ఛేంజ్ చేసుకోవడం ఉత్తమం. అలాగే ఉపయోగించే ల్యాప్‌టాప్ కేబుల్స్, ఫోన్ల ఛార్జర్లు, బ్యాకప్ బ్యాటరీలు, పోర్టబుల్ ఛార్జర్, వంటివి కూడా ఉండాలి. ఇవి ఎప్పుడైనా ఎక్కడైనా ఉపయోగపడొచ్చు.
ఇవి ఉండాల్సిందే
ఫస్ట్ ఎయిడ్ కిట్
ఫస్ట్ ఎయిడ్ కిట్ అనేది ఎవరికైనా ఉపయోగమే. సుదూర ప్రాంతాలకు వెళ్లే ఎవరైనా చిన్నపాటి ఫస్ట్ ఎయిడ్ కిట్‌ను కలిగి ఉండటం మంచిది. అది అమ్మాయిలకైనా అబ్బాయిలకైనా ఉపయోగమే. తెలియని ప్రదేశాలకు వెళ్లినప్పుడు ఎక్కడైనా ప్రమాదవశాత్తూ గాయపడితే ఈ ఫస్ట్ ఎయిడ్ కిట్ ఉపయోగపడుతుంది.
తేలికైన లగేజీ
ఒంటరి ప్రయా ణం చేసేవారు ఎవరైనా తేలికైన లగేజీ తో వెళ్లడం మంచి ది. బరువైన బ్యాగ్ కాకుండా తక్కువ బరువు ఉన్నదైతే ప్రయాణాలు చేసేటప్పుడు మోసుకెళ్లడం కాస్త తేలిగ్గా ఉంటుంది. అలాగే దుస్తులు, లేదా ఇతర వస్తువులు సైతం తక్కువ బరువు ఉండేవి చూసుకోవాలి.
అవసరమైన పత్రాలు
ప్రపంచంలో ఎక్కడికెళ్లినా సరైన ధ్రువపత్రాలు కలిగి ఉండటం మంచిది. పాస్‌పోర్టులు, గు ర్తింపు కార్డులు, ఫొటో కాపీలు, టికెట్ బుకింగ్స్, ట్రావెల్ ఇన్సూరెన్స్ వంటి వి స్మార్ట్ కాపీలతో పాటు జిరాక్స్ తీసుకెళ్లడం మంచిది. ఎవైనా పోగొట్టుకుంటే ఇవి ఇబ్బంది పడకుండా కాపాడతాయి.
వ్యక్తిగతమైనవి
ఆడవారికి కొన్ని పర్సనల్ ప్రొడక్ట్స్ కూడా తప్పనిసరి. అందులో జట్టుకు పెట్టుకునే షాంపూ, కండీషనర్ నుంచి కాళ్లకు వేసుకునే సాక్సుల వరకూ ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకోవడం బెటర్. బాడీ లోషన్లు, సానిటరీ నాప్కిన్లు, టవెల్స్, మేకప్ కిట్, అద్దం, టూత్ బ్రష్ వంటివన్నీ ఈ జాబితాలో వస్తాయి. మీకు ఏమేం కావాలో అవన్నీ ఉండేటట్లు చూసుకోండి.