calender_icon.png 17 October, 2024 | 6:00 AM

పైసలు ఎట్లా?

17-10-2024 03:15:22 AM

పెరుగుతున్న వ్యయం.. తగ్గుతున్న ఆదాయం

  1. నిధుల కోసం సర్కారు తర్జనభర్జన
  2. సన్న వడ్ల బోనస్‌కు 2,300కోట్లు
  3. ఇంటిగ్రేటెడ్ స్కూళ్లకు 5000 కోట్లు
  4. రుణమాఫీ చేయాల్సిన రైతులు 4లక్షలు
  5. వరద నష్టం బాధితులకు 11వేల కోట్లు 
  6. ఇందిరమ్మ ఇళ్లకు 22వేల కోట్లు 
  7. రైతు భరోసాకు సుమారు 10వేల కోట్లు 
  8. సంక్షేమ కార్యక్రమాల అమలుకు నిధులెలా?
  9. బడ్జెట్ అంచనాలను అందుకోలేకపోతున్న వాణిజ్య పన్నుల శాఖ
  10. తెచ్చిన అప్పుల్లో 35 శాతానికిపైగా వడ్డీలకే
  11.  ఆదాయం తెచ్చే శాఖలపై సీఎం, డిప్యూటీ సీఎం అలర్ట్ 

హైదరాబాద్, అక్టోబర్ 16(విజయక్రాంతి): ఒకవైపు పెరుగుతున్న వ్యయం.. మరోవైపు తగ్గుతున్న ఆదాయం.. వెరసి నిధుల కొరత తెలంగాణ ప్రభుత్వాన్ని ఆందోళనకు గురి చేస్తోంది. గత పదేళ్లలో బీఆర్‌ఎస్ చేసిన అప్పులను కడుతూ అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలు చేయడంపై  రేవంత్ సర్కారుకు కత్తిమీద సాములా మారింది.

ప్రభుత్వం ప్రతినెలా చేసే ఖర్చుల జాబితాలో కొత్త పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు అదనంగా వచ్చి చేరుతున్నాయి. ఈ క్రమంలో వాటికి నిధులను ఎలా సమకూర్చాలన్న ఆలోచనలో సర్కారు పడింది. సర్కారు ప్రస్తుతం అమలు చేస్తున్న స్కీమ్స్‌తో పాటు తాజాగా ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేస్తామని ప్రకటించింది.

ఈ నేపథ్యంలో కొత్త వాటికి, పాత వాటికి నిధులను సమకూర్చడం ఎలా అన్నదానిపై మల్లగుల్లాలు పడుతోంది. సన్న వడ్లకు బోనస్, రైతు భరోసా, ఇంటిగ్రేటెడ్ స్కూళ్లు, ఇందిరమ్మ ఇళ్లు, వరద నష్టం బాధితులకు నష్టపరిహారం, రీయింబర్స్‌మెంట్, అద్దె భవనాలు బకాయిలు వంటి అంశాలు సర్కారు తక్షణం చెల్లించాల్సిన జాబితాలో ఉన్నాయి. 

కేంద్రం సహకరిస్తుందా?

ప్రభుత్వం ప్రతిష్ఠాత్మంగా ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని అమలు చేసేందుకు సిద్ధమైంది. ఇప్పటికే ఇందిరమ్మ కమిటీల ఎంపిక కూడా పూర్తయ్యింది. ఈ పథకం కింద మొదటి దశలో 4.16 లక్షల ఇళ్లను నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకుంది. వీటి నిర్మాణానికి రూ.22 వేల కోట్లు అవసరం అవుతాయి. ఈ క్రమంలో వీటిలో కొన్నింటిని ప్రధానమంత్రి ఆవాస్ యోజన(పీఎంఏవై) కింద చేపట్టే యోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది.

ఇళ్ల పథకం కింద కేంద్రం నుంచి రూ.4,500 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం ఆశిస్తోంది. అలాగే ఖరీఫ్ సీజన్‌లో రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని స్వయంగా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రకటించారు. రూ.2 లక్షలకుపైగా రుణం ఉన్న రైతులు దాదాపు 4 లక్షల వరకు ఉన్నారు. దీంతో వీరికి చెల్లించేవి ఇంకో రూ.13 వేల కోట్ల వరకు ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

అలాగే రైతు భరోసాను కూడా రబీ నుంచి అమలు చేస్తామని మంత్రి తుమ్మల వెల్లడించారు. ఈ లెక్కన నవంబర్ నుంచే రైతు భరోసాను ఎకరాకు రూ.7,500ను ప్రభుత్వం చెల్లించాల్సి ఉంటుంది. అంటే ఎకరానికి రూ.5 వేల ఇచ్చినప్పుడు ప్రభుత్వం రైతుబంధు కింద రూ.7,860 కోట్లను చెల్లించింది. కాంగ్రెస్ ప్రభుత్వం అదనంగా రూ.2,500ను కలిపి ఇస్తుంది కాబట్టి.. ఒక సీజన్‌కు రూ.10 వేల కోట్లు అవసరం అవుతాయి. 

ఇటీవలే ప్రభుత్వం ఇంటిగ్రేటెడ్ స్కూళ్లకు శంకుస్థాపన చేసింది. వాటికి దాదాపు రూ.5,000 కోట్లు అవసరం అవుతాయి. ఇవి కొత్తగా అమలు చేయబోతున్న సంక్షేమ కార్యక్రమాలు. ఇదిలా ఉండగా.. ప్రస్తుతం అమలు చేస్తున్న రూ.500 గ్యాస్, ఉచిత బస్సు ప్రయాణం, ఉచిత కరెంట్ లాంటి పథకాలకు నిధుల కోసం ఇబ్బందులు పడుతున్న సర్కారుకు కొత్తగా చేపట్టబోయే కార్యక్రమాలను అమలు చేయడం సవాల్‌గా మారింది.

లీకేజీలను అరికట్టడమే పరిష్కారమా?

2024 ఆర్థిక సంవత్సరంలో ఆరు నెలలు పూర్తయ్యాయి. ఈ ఆరు నెలల్లో బడ్జెట్ అంచనాలను ఏ నెలలో కూడా ప్రభు త్వం అందుకోలేకపోయింది. ముఖ్యం గా వాణిజ్య పన్నుల శాఖలో ఈ ఆర్థిక సంవత్స రం రూ.85,126 కోట్ల రాబడిని ప్రభుత్వం అంచనా వేసింది. 18 శాతం వృద్ధి రేటుతో కమర్షియల్ ట్యాక్స్ విభాగానికి ప్రభుత్వం లక్ష్యాన్ని నిర్దేశించింది.

కానీ ఆ శాఖ సగటున 8 శాతం నుంచి 9 శాతం ఆదాయానికే పరిమితం అవుతోంది. ఇదే సమయంలో స్టాం ప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ రాబడి కూడా భారీగా తగ్గింది. సెప్టెంబర్‌లో ఏకంగా 20 శాతం రిజిస్ట్రేషన్లు తగ్గినట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఎక్సైజ్ శాఖలో మద్యం అమ్మకాలు భారీగా ఉన్నాయి. కానీ ఎక్సైజ్ సుంకం మా త్రం ఆశించిన స్థాయిలో రావడం లేదు. కాగ్ నివేదిక ప్రకారం ఆగస్టులో ఎక్సైజ్ సుంకం 20 శాతం తగ్గింది.

ఆదాయం తెచ్చే శాఖల ద్వారా రాబడి ఆశాజనకంగా లేకపోడవంతో ఇటీవల జరిగిన సమావేశంలో సీఎం రేవం త్, డిప్యూటీ సీఎం భట్టి ఆయా విభాగాలపై  అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ క్ర మంలో బడ్జెట్ నిర్దేశించిన లక్ష్యాలను చేరుకోవడం కోసం ఆయా శాఖల అధికారులు లీకేజీలపై దృష్టి పెడుతున్నారు. ఇందులో ముఖ్యంగా జీఎస్టీ, ఇసుక, మద్యం విభాగాల్లో అక్రమార్కులపై దృష్టిపెడుతున్నారు. 

 సవాళ్లను అధిగమించేనా?

రేవంత్ రెడ్డి సర్కారు ప్రస్తుతం తక్షణమే అమలు చేయాల్సిన కార్యక్రమం సన్న వడ్లకు రూ.500 బోనస్. ఖరీఫ్‌లో దాదాపు 47లక్షల మెట్రిక్ టన్నుల సన్న వడ్ల ఉత్పత్తి అవుతుందని ప్రభుత్వం అంచనా వేసింది. ఈ లెక్కన టన్నుకు రూ.500 చొప్పున ఇస్తే ఈ సీజన్‌లో రైతులకు రూ.2,300 కోట్లను చెల్లించాల్సి ఉంటుంది. అలాగే గురుకులాల అద్దె భవనాల సమస్య రాష్ట్రంలోనే హాట్ టాపిక్‌గా మారింది.

దాదాపు రూ.500 కోట్ల బకాయిలను చెల్లించాలని అద్దె భవనాలకు యజమానులు తాళం వేశారు. ఇదే సమయంలో రీయింబర్స్‌మెంట్ చెల్లించనిదే ప్రైవేటు కాలేజీలు తెరిచేలేదని యాజమాన్యాలు తాళాలు వేసి ఆందోళనకు దిగాయి. రీయింబర్స్‌మెంట్ బకాయిలను ప్రభుత్వం రూ.5,900 కోట్లను చెల్లించాల్సి ఉంది.

సెప్టెంబర్ మొదటి వారంలో వచ్చిన వరదలకు ఉమ్మడి ఖమ్మం, వరంగల్  జిల్లాలతో పాటు మరి కొన్ని ప్రాంతాల్లో భారీ నష్టం వాటిల్లింది. ఈ నష్టం రూ.11,713 కోట్ల వరకు జరిగినట్లు కేంద్రానికి రాష్ట్రం ప్రభుత్వం నివేదిక పంపింది. ఈ క్రమంలో రాష్ట్రంలో రోడ్ల మరమ్మతులతో పాటు ఇతరత్రా మౌలిక సదుపాయల కల్పన కోసం తక్షణమే రూ.5 వేల కోట్లు విడుదల చేయాలని అభ్యర్థించగా.. కేంద్రం రూ.416 కోట్లను మాత్రమే విడుదల చేసింది. 

అప్పుల్లో 35శాతం వడ్డీలకే..  

ఆదాయం తెచ్చే శాఖల ద్వారా రాబడి ఆశించిన మేరకు రాకపోవడంతో  సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల అమలు కోసం ప్రభుత్వానికి అప్పులు తేవాల్సిన అవివార్యత ఏర్పడింది. అయితే ఆ అప్పుల్లో కూడా బీఆర్‌ఎస్ చేసిన హయాంలోనే రుణాలను చెల్లించడానికే భారీ మొత్తాన్ని వెచ్చిస్తోంది. కాగ్ నివేదిక ప్రకారం 2024 ఆర్థిక సం వత్సరంలో ఆగస్టు నాటికి ప్రభుత్వం రూ.29,449 కోట్లు అప్పులు చేసింది.

ఇదే సయమంలో వడ్డీల కింద రూ.10,497కోట్లు కట్టింది. అంటే తెచ్చిన అప్పుల్లో దాదాపు 35 శాతం వడ్డీలకే చెల్లించడం గమనార్హం. వడ్డీలతో పాటు కొంత ప్రిన్సిపల్ అమౌంట్ కూడా సర్కారు చెల్లిస్తుంది. ఈ లెక్కన దాదాపు 45 నుచి 50 శాతం బీఆర్‌ఎస్ చేసిన రుణాలకే సరిపోతోంది. దీంతో సర్కారు రుణాలు తెచ్చినా వాటిని పూర్తిస్థాయిలో అభివృద్ధి కార్యక్రమాలకు వినియోగించలేని దుస్థితిలో ఉంది.

ఇన్ని ఆర్థిక అవాంతరాల నడుమ రాష్ట్ర ప్రభుత్వం పాత పథకాలకు తోడుగా కొన్ని కొత్త స్కీమ్స్‌ను అమలు చేసేందుకు సన్నద్ధమవుతోంది. కొత్తగా చేపట్టబోతున్న అభివృద్ధి కార్యక్రమాల అమలు కోసం ప్రభుత్వం మరింత భారీగా అప్పులు చేస్తుందా? లేక బడ్జెట్ అంచనాలకు అనుగుణంగా రాబడిని పెంచుకునేందుకు ప్రత్యేక ప్రణాళికతో ముందుకుపోతుందా అనేది వేచి చూడాలి.