- గుంతలమయంగా అల్గోల్-బీదర్ రోడ్డు
- తీవ్ర ఇబ్బందులు పడుతున్న వాహనదారులు
సంగారెడ్డి, అక్టోబర్ 24 (విజయక్రాంతి)/జహీరాబాద్: అది నిత్యం వందలాది వాహనాలు తిరిగే రోడ్డు. కానీ పలువురు వ్యాపారులు రోడ్డు పక్కన కాల్వలను ఆక్రమించి షెడ్లు ఏర్పాటు చేశారు. రియల్ వ్యాపారులు వరద నీటి కాల్వలను ఆక్రమించి ప్లాట్లు వేసి అమ్మకాలు జరిపారు.
ప్లాట్లు కొనుగోలు చేసిన వారు వరద నీరు రాకుండా అడ్డంగా నిర్మాణాలు చేయడంతో వరద నీరు రోడ్డుపై నిల్వ ఉండి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీనికితోడు రోడ్డు పక్కనే కరెంట్ స్తంభాలు ఉండడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జహీరాబాద్ పట్టణ సమీపంలోని బైపాస్ రోడ్డు నుంచి అల్గోల్-బీదర్ వైపు వెళ్లే రోడ్డు పరిస్థితి ఇది.
ఆర్‌ఆండ్‌బీ అధికారులు రోడ్డుకు మరమ్మతులు చేయకపోవడంతో వాహనదారులు నిత్యం నరకయాతన పడుతున్నారు. లక్షలు ఖర్చు చేసి కల్వర్ట్ నిర్మాణం చేపట్టినప్పటికీ వరద నీరు బయటకు వెళ్లే కాల్వలను మూసేయడంతో నీరు నిల్వ ఉండి రోడ్డు గుంతలమయంగా మారిపోయింది. రోడ్డును ఆక్రమించి అక్రమంగా చేపట్టిన నిర్మాణాలను తొలగించాని వాహనదారులు కోరుతున్నారు.