పొట్లపల్లి రామారావు :
ఎన్నాళ్ళు మోయమీ బరువు
ఎన్ని యుగాలింక గడువు
మోసి మోసి బరువు
వేసారి పోయితిమి
పేరు పెంపులేక
వెనుకబడి పోయితిమి
కూలబడి పోయితిమి
నేలబడిపోయితిమి... ఎన్నాళ్ళు?
బాధ చెపుదామన్న
మాట నోటికి రాదు
ఎంత నలిగిన గాని
ఎవడు కన్నులగనడు
ఎవని పాటేవాడు
ఎవని మాటేవాడు........ ఎన్నాళ్ళు?
ఎన్ని బాధలు పడ్డ
ఎవడు దయ చూడడే
ఎంత అరచిన గాని
ఎవడు మార్పల్కడే
ఏటి నిద్దుర యిద్ది
ఏమి మత్తుర యిది....... ఎన్నాళ్ళు?
ఉదయమే లేనట్టి
ఈ రాతి రెన్నాళ్ళు?
ఇంత కదలిక లేని
ఈ జీవ మెన్నాళ్ళు?
ఈ బ్రతుకు ఎన్నాళ్ళు?
ఈ చావు ఎన్నాళ్ళు.......... ఎన్నాళ్ళు?
బాధలనడం తోనె
మాటలనుకోకండి
ఆకలాకలి అంటె
కేకలను కోకండి
ఉఱుము లేని పిడుగు
ఏమౌనొ ఎవడెరుగు.... ఎన్నాళ్ళు?
‘పొట్లపల్లి రామారావు సాహిత్యం కవిత్వం, ఆత్మ నివేదన’ నుంచి..