calender_icon.png 20 September, 2024 | 5:25 AM

ఔట్ సోర్సింగ్ ఏజెన్సీలు ఎన్ని?

20-09-2024 02:42:34 AM

బీఆర్‌ఎస్ హయాంలో పుట్టగొడుగుల్లా!

రెన్యూవల్ టైం రావడంతో అంతుబట్టని లెక్క 

ఐఎఫ్‌ఎంఐఎస్‌లో వివరాలు తెలపాలె

నేటిలోగా చెప్పాలని ఆర్థికశాఖ ఆదేశం

 హైదరాబాద్, సెప్టెంబర్ 1౯ (విజయక్రాంతి): ఔట్ సోర్సింగ్ ఏజెన్సీల రెన్యూ వల్ వ్యవహారం ప్రభుత్వానికి తలనొప్పిగా మారింది. బీఆర్‌ఎస్ హయాం లో ఏజెన్సీలు పుట్టగొడుల్లా పుట్టుకొచ్చినట్లు తెలుస్తోంది. నాటి ప్రభుత్వంలో మంత్రు లు, ఎమ్మెల్యేలతో పైరవీలతో ఇష్టానుసారంగా అనుమతులు ఇచ్చినట్లు తెలిసింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని ఏజెన్సీలు ఉన్నాయో ప్రస్తుతం సర్కారుకు అంతుబట్టడం లేదు. ఏజెన్సీలకు సంబంధించిన లెక్కా, పత్రం లేకపోవడంతో మొత్తం ఎన్ని ఉన్నాయో తెలుసుకునే పనిలో ఆర్థిక శాఖ నిమగ్నమైంది.

వాటి వివరాలను ఈ నెల 19వ తేదీలో చెప్పాలని విభాగాధిపతులకు ఈనెల 13వ తేదీన ఆర్థికశాఖ సర్క్యూలర్ జారీ చేసింది. గురువారం ఆ గడువు ముగిసింది. చాలా సంస్థలు వివరాలు అప్‌లోడ్ చేశాయి. కార్పొరేషన్లు, సొసైటీలు, యూనివర్సిటీలు, జీఐఏ సంస్థలు, పీఎస్‌యూలు, స్థానిక సంస్థల్లోని ఔట్ సోర్సింగ్ ఏజెన్సీలు, వాటి పరిధిలో పనిచేస్తున్న ఉద్యో గుల సంఖ్య ఎంతో చెప్పాలని దానిలో పేర్కొంది. నిర్ణీత గడువులోగా ఏజెన్సీల వివరాలను ఐఎఫ్‌ఎంఐఎస్ పోర్టల్‌లో అప్లోడ్ చేయాలని ఆదేశాలు జారీచేసింది. వివరాలను లిఖితపూర్వకంగా రాసే ప్రొఫార్మాను కూడా జతచేసింది.

రెండు నెలలుగా రెన్యూవల్ కోసం

రాష్ట్రంలో ఉన్న ఔట్ సోర్సింగ్ ఏజెన్సీల గడువు ప్రతిఏటా మార్చి 31వ తేదీతో ముగుస్తుంది. ఆ తర్వాత వారు మళ్లీ రెన్యూవల్ చేయించుకోవాల్సి ఉంటుంది. ఈ ఏడాది మార్చి 31 తర్వాత ఔట్ సోర్సింగ్ ఏజెన్సీ గడువును జులై 31వరకు పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఏజెన్సీలు 2024 ఆర్థిక సంవత్సరంలో రెన్యూవల్ కోసం ఆగస్టు నుంచి దరఖాస్తులు చేసుకుంటున్నాయి. ఈ క్రమంలో రాష్ట్రంలో అసలు ఎన్ని ఏజెన్సీలు ఉన్నాయి? వేటికి అనుమతి ఇవ్వాలో అధికారులు పరిశీలించేందుకు ప్రయత్నించగా వాటికి సంబంధించిన లెక్కా, పత్రం లేదని తెలిసింది. రెండు నెలలుగా రెన్యూవల్ ప్రక్రియను నిలిపివేసి.. అసలు ఏజెన్సీలు ఎన్ని ఉన్నాయో చెప్పాలని ఆయా డిపార్ట్‌మెంట్ల ఉన్నతాధికారులకు ఆర్థిక శాఖ ఉత్తర్వులు  జారీ చేసింది.

2లక్షల మంది ఉద్యోగులు..

రాష్ట్రంలో అన్ని శాఖల్లో కలిపి 2లక్షల మంది ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు ఉన్నారు. వీరందరూ 15, 20, 25ఏళ్లుగా అత్తెసరు జీతాలతో పనిచేస్తున్నారు. గత సర్కారు ఏజెన్సీలకు అనుకూలమైన నిర్ణయాలను తీసుకొని తమకు అన్యాయం చేసిందని ఆరోపిస్తున్నారు. ఏజెన్సీలకు ఇష్టానుసారంగా అనుమతులు ఇచ్చిన బీఆర్‌ఎస్ సర్కారు.. తమ వేతనాలు, సంక్షేమాన్ని ఏ మాత్రం పట్టించుకోలేదని మండిపడుతున్నారు. గత సర్కారు ప్రజాప్రతినిధుల పైరవీలతో ప్రభుత్వం ఏజెన్సీలకు అనుమతులు ఇచ్చినట్లు తెలిసింది. ఈ క్రమంలో కొన్ని సంస్థలు అనుమతులు పొందిన తర్వాత ఉద్యోగాలు ఇస్తామని నిరుద్యోగుల దగ్గర రూ.లక్షలు స్వాహా చేసిన సందర్భాలు ఉన్నాయి. ఇలాంటి ఉదంతాలు బీఆర్‌ఎస్ హయాంలో భూపాలపల్లి, సూర్యాపేటలో జరిగిన సందర్భాలు ఉన్నాయి.

ఈ సర్కారు పైనే ఆశలు..

ఔట్ సోర్సింగ్ ఏజెన్సీల వ్యవహారాన్ని కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలోనే గమనించినట్లు సమాచారం. అందుకే మార్చి 31తో గడువు ముగిసినా.. ఉద్యోగులకు నష్టం వాటిళ్లకూడదని జులై 31వరకు పొడిగించింది. ఇదే క్రమంలో గత మూడు నెలలుగా ఏజెన్సీలను స్ట్రీమ్‌లైన్ ఎలా చేయాలన్న దానిపై ఉన్నతాధికారులతో సమాచాలోచనలు జరిపినట్లు తెలిసింది. అసలు వాటి లెక్క ఎంతో తెలిస్తే.. ఏం చేయాలన్నదానిపై ఒక నిర్ణయానికి రావొచ్చని అధికారులు వచ్చినట్లు సమాచారం. అందులో భాగంగానే తాజా సర్క్యూలర్‌ను జారీ చేసినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో గత సర్కారు తమ గురించి ఎలాగూ పట్టించుకోలేదని, తమ ఆశలన్నీ ఈ ప్రభుత్వంపైనే ఉన్నాయని ఉద్యోగులు అంటున్నారు.

ఏజెన్సీలను రద్దు చేయాలి

ఔట్ సోర్సింగ్ ఏజెన్సీలను రద్దు చేయాలి. గత ప్రభుత్వం ఏజెన్సీలకు అనుకూ లంగా వ్యవహరించింది. మా ఉద్యోగులు చాలీచాలని జీతాలతో ఇబ్బందులు పడుతున్నా రు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయా లి. మాకు కూడా పే స్కేల్ అమలు చేయాలి. విద్యుత్ ఉద్యోగులను ఆర్టిజన్లుగా ఎలా గుర్తించారో మాకు ఒక వ్యవస్థను తీసుకురావాలి. లేకుంటే 2లక్షల కుటుంబాలు రోడ్డున పడుతాయి. గత ప్రభుత్వం చేసిన తప్పు లను ఈ సర్కారు చేయదని నమ్ముతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి న తర్వాత ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల గురించి ఆలోచిస్తోంది. ఈ ప్రభుత్వమైన మా సమస్యలను పరిష్కరించా లని కోరుతున్నాం. 

 పులి లక్ష్మయ్య,  ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల రాష్ట్ర అధ్యక్షుడు