28-03-2025 12:00:00 AM
ఎక్కడ చూసినా ఉరుకులు- పరుగులు. కుటుంబ పోషణ కోసం పడరాని పాట్లు, ఆరోగ్య సంరక్షణ కోసం ఉదయాన్నే వ్యాయామాలు...పిల్లల చదువుల కోసం తంటాలు పడుతూ, లక్షల్లో ఫీజులు కడుతూ, హైరానా పడుతూ, నిద్రలేని రాత్రులు గడుపుతూ,మానసిక రుగ్మ తలకు గురవుతున్న మధ్యతరగతి జీవుల ఆర్థిక స్థితిగతులు మారకుండా సాంకేతిక పరిజ్ఞానం పేరుతో ఏదో సాధించేశామని చెప్పుకోవడం అతిశయోక్తి మాత్రమే కాగలదు. విజ్ఞానం పెరిగినా ఆర్థిక బాధలు ఆయుష్షును మింగేస్తున్నాయి.
మానవ విజ్ఞానం గగనాన్ని తాకింది. పెరిగిన సాంకేతిక పరిజ్ఞానం ప్రపంచాన్ని దగ్గర చేసింది. అయినా ఎక్కడో ఏదో వెలి తి, అసంతృప్తి కనిపిస్తున్నాయి. ఒకప్పటికీ, ఇప్పటికీ మానవ జీవితంలో ఎన్నో మా ర్పులు సంభవించాయి. మానవ జీవిత గమనంలోని మలుపులను, మార్పులను ఒక్కసారి అవలోకనం చేసుకోవడానికి చరిత్ర పుటలను వెనక్కి తిప్పి చూస్తే మనకే ఆశ్చర్యం కలుగక మానదు. మానవ పరిణామ క్రమం ఒక ఎత్తయితే, నాగరికత పెరిగిన తర్వాత మనిషి జీవన విధానంలో సంభవించిన పెను మార్పులు మరొక ఎత్తు. దీనికి కారణం మనిషి ఆలోచనలు, ఆ ఆలోచనలకు కార్యరూపమిచ్చి, ప్రయోగాత్మక పద్ధతిలో విశ్లేషించడం, అనుకున్న లక్ష్యాన్ని సాధించాలనే పట్టుదల ప్రదర్శించడం. తాము ఊహించిన విషయాలు, ఆలోచనలు నిజమా? కాదా? అనే అంశం పై ప్రయోగాల ద్వారా నిర్ధారణకు రావ డం విజ్ఞాన తృష్ణకు దారితీసింది. దీనినే క్లుప్తంగా సైన్స్ అని చెప్పవచ్చు. ప్రపంచ గమనాన్ని మార్చిన సైన్స్ ప్రజా జీవితాలను ఎంతో సౌకర్యవంతంగా మలచింది.
ఈ ప్రపంచంలో ప్రతీ జీవికి తెలివితేటలున్నాయి. అయితే మానవజాతికున్న మేధస్సు మిగిలిన జీవరాశులకు లేకపోవడం వల్ల సమస్త ప్రాణులను, సకల సృష్టిని శాసించగల స్థితికి మానవుడు చేరుకున్నాడు. మానవ సామర్థ్యానికి ఆసక్తి, పట్టుదల తోడు కావడం వల్ల ఏదైనా సాధించగల మహోన్నత స్థితిని సాధించాడు. పూర్వకాలంలో కొన్ని ప్రపంచ దేశాలు పలు రకాల మహమ్మారులకు తుడిచిపెట్టుకుపోయాయి. ఇలాంటి సం ఘటనలు వైద్యశాస్త్రం అభివృద్ధి చెందడానికి దోహదం చేసాయి. ఇటీవలి కాలంలో కోవిడ్ మహమ్మారికి ప్రపంచం సుమారు రెండు సంవత్సరాలు స్తంభించిపోయింది. మానవ విజ్ఞానం వల్ల ఈ మహమ్మారికి త్వరితగతిన వ్యాక్సిన్ కనిపెట్టడం జరిగింది.
మశూచి, ప్లేగు, కలరా వంటి మహమ్మారుల వల్ల కోట్లాది మంది ప్రజలు మృ త్యువాత పడ్డారు. అప్పట్లో వైద్యశాస్త్రం అంతగా అభివృద్ధి చెందలేదు. ఈ కారణంగానే ఇంతటి విధ్వంసం జరిగింది. ఎడ్వర్డ్ జెన్నర్ ప్రపంచంలో మొట్టమొదటి సారిగా వ్యాక్సిన్‌ను కనిపెట్టి మశూచికి అడ్డుకట్ట వేసాడు. తర్వాత కాలంలో అనేక వ్యాధులకు అనేక వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చి, మరణాల సంఖ్యను తగ్గించాయి.
ప్రపంచ గమనాన్ని మార్చిన మేధస్సు
ఈ విశాలమైన భూభాగంపై మానవాళి భాగస్వామ్యం ఒకశాతం మాత్రమే. భూతలంపై ఇంత స్వల్ప శాతం గల మానవుడు 99 శాతం జీవరాశులను శాసించ డం, కేవలం మానవ దయాదాక్షిణ్యాల మీద పలు జీవరాశుల మనుగడ ఆధారపడి ఉండడం పెరిగిన మానవాధిక్యతకు పరాకాష్ఠ గా చెప్పవచ్చు.మానవ విజ్ఞానం పెరగడం, టెక్నాలజీ శరవేగంగా మానవ జీవితాల్లో ప్రవేశించడం వల్ల అనేక సౌకర్యాలు అందుబాటులోకి వచ్చిన మాట వాస్తవం. అనేక రంగాల్లో మానవ మేధ స్సు ప్రపంచ గమనాన్ని సమూలంగా మార్చడం జరిగింది. పంచ భూతాలను సైతం తమ అధీనంలోకి తెచ్చుకోవాలని ఆశిస్తున్న శాస్త్ర విజ్ఞానం మరణాన్ని జ యించడంలో మాత్రం వైఫల్యం చెందింది. వార్థక్యాన్ని నిలువరించి, వయసును తగ్గించడానికి ఏజ్ రివర్సింగ్ పేరిట పరిశోధ నలు జరుగుతున్నాయి. శాస్త్ర పరిశోధనల విషయంలో కూడా ఇకపై సంయమనం పాటించాలి.
పెరుగుతున్న అనర్థాలు
ఒకవైపు సైన్స్ ఎంతగా అభివృద్ధి చెందినా, మరోవైపు ప్రజాజీవితం సాఫీగా సాగడం లేదు. చాలా దేశాలు పేదరికంతో అలమటిస్తున్నాయి. తినడానికి తిండి, ఉం డడానికి గూడు, తాగడానికి సరైన నీరు దొరక్క అత్యంత దుర్భర జీవితం గడుపుతున్న అభాగ్యుల ఆర్తనాదాలు శూన్యంలో కలిసి పోతున్నాయి. విద్య,వైద్య సదుపాయాలు లేక ప్రపంచంలో చాలామంది ప్రజలు మిగిలిన ప్రపంచంతో పోటీ పడలేక దైన్యంగా,భారంగా జీవితాలను నెట్టు కొస్తున్నారు. పేదరికంలో మగ్గిపోతున్న దేశాల సంగతి ఈ విధంగా ఉంటే, అభివృద్ధి చెందిన,అభివృద్ధి సాధించిన దేశాల పరిస్థితి మరో విధంగా ఉంది. పెరిగిన కాలుష్యం మనం పీల్చే గాలిని విషతుల్యం చేస్తున్నది.
మనం భుజించే ఆహారం రసాయనాలతో నిండి ఉంటున్నది. ఒకవైపు భూ ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయి. శీతల దేశాలు కూడా రాబోయే కాలంలో అధిక ఉష్ణోగ్రతల వల్ల అనేక మార్పులు సంతరించుకునే అవకాశాలున్నాయి. నీటి లభ్యత లేక పంటలు పండక, పలు దేశాల్లో ఆహార భద్రతకు పెను ప్రమాదం ఏర్పడే అవకాశముంది. పెరుగుతున్న ఉష్ణోగ్రతలను అదుపు చేయకపోతే సమస్త భూగోళం గందరగోళంలో పడే అవకాశముంది.
ఏది ఏమైనప్పటికీ పెరుగుతున్న విజ్ఞానం వలన కొత్తగా సమస్యలు ఉత్పన్నం కారాదు. మన పరిశోధనల గమ్యం మారాలి. ప్రజలందరూ ఆరోగ్యవంతంగా జీవించే విధంగా మార్గాలు చూపాలి. పరిశుభ్రమైన నీరు అందరికీ అందాలి. అంతరిస్తున్న నీటి వనరులపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. రసాయనాలకు ప్రత్యామ్నాయంగా కాలుష్యానికి తావులేని ఆవిష్కరణలు జరగాలి. ప్రజలకు ఆరోగ్య వంతమైన జీవన విధానం అందించడంలో శాస్త్ర వేత్తలు కృషిచేయాలి. నూతన పరిశోధనల వల్ల ఏర్పడే విపత్కర పరిణామాలకు పరిష్కారం కనుగొనాలి. మానవాళికి ఇబ్బంది లేని పరిశోధనలకు ప్రాధాన్యత నివ్వాలి.
అయితే కాలక్రమంలో జరిగిన అనేక మార్పుల వల్ల మానవుడు నేడు ఆధునిక యుగానికి ఆవిష్కర్తగా మారాడు. ఎన్నో సంఘటనలు, ఎన్నో ఆలోచనలు,ఎన్నో పరిశోధనల ఫలితంగా మనిషి ఎంతగా ఎదిగినా ఏదో సాధించాలనే తపనతో నిరంతరం తపించడం అతని నైజం. అయితే మానవ ఎదుగుదలకు సంస్కారాన్ని, వివేకాన్ని,విలువలను జోడించాలి. అలాగే అవినీతి, విపరీతమైన ఆర్థిక అంతరాలు ప్రజల జీవన ప్రమాణాలను దిగజార్చుతున్నాయి. ఈ ప్రపంచంలో కొందరు అత్యంత విలాసవంతమైన జీవితం గడుపుతుంటే, మరికొంతమంది జీవితాలు నిరంతరం ఆవేదనాభరితంగా ఉంటున్నాయి.
సాంకేతిక విప్లవం తెచ్చిన మార్పులతో వీరి జీవితాలు మారతాయా? ఇలాంటి సమస్యలకు పరిష్కారం ఆలోచించాలి. ప్రజల జీవన ప్రమా ణాలు మెరుగుపడాలంటే వారి ఆర్థిక స్థితిగతులను మార్చాలి. ఆర్థిక పరిపుష్టితో విజ్ఞాన శాస్త్ర ఫలితాలను సులభంగా అందుకోవచ్చు. జనజీవితాలకు ఆరోగ్య భద్రత, ఆహార భద్రత లేకుండా ప్రపంచంలో ఎంత గా శాస్త్ర విజ్ఞానం పెరిగినా, ఎన్ని ఆవిష్కరణలు జనబాహుళ్యాన్ని ముంచెత్తినా ప్ర యోజనం శూన్యం. ప్రపంచ దేశాలన్నీ ఆహారభద్రతకు అత్యధిక ప్రాధాన్యత నివ్వాలి.
శాస్త్ర విజ్ఞానం అందరికీ అందాలి
సాంకేతిక పరిజ్ఞానం పెరుగుతున్నా, దానిని అందుకునే అవకాశం అందరికీ లేకపోవడం, సైన్స్ ప్రయోజనాలు అందుబాటులోకి వచ్చినా, సైన్స్ ఆవిష్కరణల ను అందుకోలేని ప్రజల ఆర్ధిక పరిస్థితులపై దృష్టిసారించాలి. గగనాన్ని తాకిన విజ్ఞానం ఆర్థ్ధిక అంతరాలను అధిగమించాలి. కొందరు ఆకలితో, కొందరు అజీ ర్తితో... కొందరు ఆకాశహర్మ్యాల్లో, మరికొందరు పూరిపాకల్లో నివసిస్తున్నారు. పూట గడవక కొందరు, తరతరాలకు తరగని సంపదతో ఇంకొందరు ఈ ప్రపంచం లో అంతులేని ఆర్థిక అంతరాలతో జీవిస్తున్నంత కాలం మన ఆలోచనలు గగన సీమలో ఉన్నా, వాస్తవం మాత్రం పూరిగుడిసెలో, పేదరికంలో,కటికనేలపై నిద్రించక తప్పదు.సాంకేతిక ఫలాలు అందరికీ అం దాలంటే ప్రజల జీవన ప్రమాణాలు పెరగాలి. సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుకునే స్థాయిలో ప్రజల ఆర్ధిక స్థితిగతులు మెరుగుపడాలి. భూతలంపై మానవాళి ప్రశాం తంగా జీవించే పరిస్థితులు ఏర్పడాలి.
వ్యాసకర్త : సుంకవల్లి సత్తిరాజు , సెల్: 9704903463