calender_icon.png 4 February, 2025 | 4:18 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇంకా ఎన్నాళ్లీ వాయిదాలు ?

04-02-2025 02:03:45 AM

  • డీఎస్పీ 2008 పోస్టుల భర్తీపై కాలయాపన ఎందుకు?
  • పాత నోటిఫికేషన్‌కు ఎన్నికల కోడ్ ఎలా వర్తిస్తుంది?
  • రాష్ట్రప్రభుత్వ తీరుపై హైకోర్టు ఆగ్రహం
  • 1,382 పోస్టులను భర్తీ చేయాల్సిందేనని ఆదేశాలు

హైదరాబాద్, ఫిబ్రవరి 3 (విజయక్రాంతి): ‘ఒకటి కాదు.. రెండు కాదు.. సుమా రు 17 ఏళ్లయింది. డీఎస్పీ 2008 పోస్టుల భర్తీపై కాలయాపనపై ఎందుకు ? అభ్యర్థులు ఏళ్ల తరబడి నియామకాల కోసం ఎ దురుచూపులు చూడాల్సిందేనా? ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ పేరుతో నియామకాలను మళ్లీ వాయిదా వేయాలని చూస్తున్నారా ? ఇంకా ఎన్నాళ్లీ వాయిదాలు ?’ అంటూ హైకోర్టు రాష్ట్రప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిం ది. పాత నోటిఫికేషన్ అమలుకు ఎన్నికల కోడ్ ఎలా అమలు అవుతుందని ప్రశ్నించింది.

గతేడాది ఫిబ్రవరిలో న్యాయస్థానం ఇచ్చిన ఉత్తర్వులను అమలు చేయాల్సిందేనని తేల్చిచెప్పింది. ఇకపై ఏదో ఒక సాకు చెప్పి వాయిదా వేయడానికి వీల్లేదని స్పష్టం చేసింది. మరోసారి గడువు పొడిగించే ప్రసక్తే లేదని వెల్లడించింది. ఎస్జీటీ నియామకాల్లో మిగిలిన 1,382 పోస్టులను అర్హులకు కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీ చేయాల్సిందేని సూచించింది.

ఈసారి కూడా ప్రభుత్వం నియామకాలు చేపట్టకపోతే తదుపరి విచారణకు ఉన్నతాధికారులు హాజరుకావాల్సి ఉంటుందని హెచ్చరించింది. తదుపరి విచారణను ఈనెల 10వ తేదీకి వాయిదా వేసింది. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ నేపథ్యంలో డీఎస్సీ పోస్టుల భర్తీ ప్రక్రియకు మరింత గడువు కావాలని రాష్ట్రప్రభుత్వం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. పిటిషన్‌పై సోమవారం జస్టిస్ అభినందకుమార్ షావిలి, జస్టిస్ ఈ తిరుమలాదేవితో కూడిన డివిజన్ బెంచ్ విచారణ చేపట్టింది.

ప్రభుత్వం తరఫు అడ్వొకేట్ జనరల్ వాదనలు..

ప్రభుత్వం తరఫు అడ్వొకేట్ జనరల్ ఎ.సుదర్శన్‌రెడ్డి తన వాదనలు వినిపిస్తూ.. ‘డీఎస్సీ 2008 పోస్టుల భర్తీపై గతేడాది హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల మేరకు రాష్ట్రప్రభుత్వం మంత్రివర్గ ఉప సంఘాన్ని ఏర్పాటు చేసింది. ఈ సిఫారసుల మేరకు 2008 డీఎస్సీలో అర్హత పొందిన అభ్యర్థులు 2,367 మందిలో 1,382 మంది కాంట్రాక్ట్ పద్ధతిన పోస్టు తీసుకునేందుకు అంగీకరించారు. ప్రభుత్వం కూడా భర్తీ ప్రక్రియ పూర్తి చేయాలని నిర్ణయించింది.

కానీ.. జనవరి 29న ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చింది. కోడ్ ముగిసిన వెంటనే ప్రభుత్వం నియామక ప్రక్రియ చేపట్టేందుకు అవకాశం ఇవ్వాలి’ అని కోరారు. అందుకు ధర్మాసనం నిరాకరిస్తూ 2008 నుంచి అభ్యర్థులు ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నారని, గతేడాది హైకోర్టు ఉత్తర్వుల ప్రకారం నియామకాలు చేపట్టాల్సిందేనని స్పష్టం చేసింది. ఉత్తర్వులపై ఏం కదలిక తీసుకొచ్చారో 10వ తేదీన చెప్పాలని సూచించింది. ఈ మేరకు ఆ తేదీకి వాయిదా వేసింది.