మేజరు పంచాయతీలు మున్సిపాలిటీలుగా మారితే సౌకర్యాలు పెరుగుతాయని జనం భావిస్తుంటారు. సౌకర్యాల సంగతేమో కానీ పన్నులు, ఇంటి అద్దెలు లాంటివి మాత్రం అమాంతం పెరిగి పోతుంటాయి. పన్నుల వసూళ్ల పట్ల చూపించే శ్రద్ధ.. సదుపాయాల కల్పనలో అధికారులు కానీ, ప్రజాప్రతినిధులు కానీ చూపించడం లేదు. దానికి చక్కటి ఉదాహరణ పోచారం మున్సిపాలిటీ. గతంలో పంచాయతీగా ఉన్న పోచారంతోపాటు నారపల్లి, అన్నోజీగూడ పంచాయతీలు కలిపి మున్సిపాలిటీగా ఏర్పాటు చేశారు. వరంగల్ హైవేకు ఆనుకుని ఉన్న ఇవన్నీ కూడా ఇటీవలి కాలంలో భారీగా అభివృద్ధి చెందాయి. జనాభా సైతం బాగా పెరిగింది. కాబట్టి, మున్సిపాలిటీగా చేయడంలో ఎలాంటి తప్పూ లేదు.
కానీ, మున్సిపాలిటీగా మారిన తర్వాత కూడా బహుళ అంతస్థుల భవనాలు తప్ప పెద్దగా అభివృద్ధి కనిపించడం లేదు. ఒకటి రెండు అభివృద్ధి ప్రాజెక్టులు చేపట్టారు కానీ అవి ప్రజలకు అందుబాటులోకి రాలేదు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు నారపల్లి మెయిన్ రోడ్డు విస్తరణసహా డివైడర్లు, వాటి వెంట లైట్లు ఏర్పరిచారు. రోడ్డు విస్తరణ, డివైడర్ల నిర్మాణం పూర్తయింది కానీ మధ్యలో ఏర్పాటు చేసిన వీధిలైట్లకు మాత్రం మోక్షం లభించలేదు. ఒకరోజు మాత్రం ట్రయల్ కోసమన్నట్లుగా లైట్లు వెలిగాయి. ఆ తర్వాత వెలిగిన జాడే లేదు. ఎన్నికల హడావుడి ముగిశాక ప్రారంభిస్తారేమోనని అందరూ అనుకున్నారు. కానీ, కొత్త ప్రభుత్వం వచ్చి ఏడు నెలలు గడుస్తున్నా లైట్లకు మాత్రం మోక్షం కలగలేదు. అధికారులకు ఎప్పటికి దయ కలుగుతుందో చూడాలి.
కృష్ణకాంత్, ఘట్‌కేసర్