02-04-2025 12:53:00 AM
రైతుభరోసా అమలుపై రేవంత్‌రెడ్డి హామీ ఏమైంది?
రైతులను ఇంకెన్నిసార్లు మోసం చేస్తారు..
పంట కోతల సమయానికి కూడా డబ్బులు ఖాతాల్లో వేయరా?
జాతీయపక్షి ఉసురుతీసుకుంటున్న ప్రభుత్వం: మాజీమంత్రి హరీశ్‌రావు
హైదరాబాద్, ఏప్రిల్ 1 (విజయక్రాంతి): రైతుభరోసా అమలుపై మరోసారి సీఎం రేవంత్‌రెడ్డి మాటతప్పారని మాజీ మంత్రి హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇందిరమ్మ ఆత్మీయభరోసా అడుగు ముందుకు పడటం లేదని, డేట్లు మారుతున్నాయి.. డెడ్ లైన్లు మారుతున్నాయి తప్పా రైతులకు ఇచ్చిన హామీలు మాత్రం నెరవేరడం లేదని ఆరోపించారు. ఇచ్చిన వాగ్దానాలను తుంగ లో తొక్కడం, మాటి చ్చి మోసం చేయడం, నాలుక మడతేయడం రేవంత్‌రెడ్డికి అలవాటుగా మారిందని హరీశ్‌రావు మంగళవారం ఎక్స్ వేదికగా విమర్శించారు. మార్చి 31కల్లా రైతు భరోసా డబ్బులు రైతులందరి ఖాతాల్లో వేస్తామని జనవరి 26న గొప్పగా ప్రకటించారని, మొన్నటి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లోనూ మార్చి31 నాటికి రైతులందరికీ భరోసా డబ్బులు ఇస్తామని చెప్పారని గుర్తుచేశారు.
రేవంత్‌రెడ్డి మాటలు ఘనం గా ఉంటే, చేతలు హీ నంగా ఉన్నాయని మండిపడ్డారు. ముఖ్యమంత్రి మాట లు నమ్మి ఉగాది వేళ ఆశగా ఎదురుచూసిన రైతులకు చేదు అనుభవమే ఎదురైం దన్నారు. రైతులను ఇంకెన్నిసార్లు మోసం చేస్తావు రేవంత్ రెడ్డి? అంటూ ప్రశ్నించారు. “దసరాకిస్తమన్నరు, ఇవ్వలేదు.. సంక్రాంతికి ఇస్తమ న్నరు, ఇవ్వలేదు. ఉగాదికి ఇస్తామని ఊరించారు. రైతుల్ని ఉసూరుమనిపించారు” అం టూ నిలదీశారు. నాడు కేసీఆర్ నాట్ల సమయంలో రైతుబంధు ఇస్తే, రేవంత్‌రెడ్డి కోతల సమయం వచ్చినా రైతుభరోసా ఇవ్వడం లేదని పేర్కొన్నారు. మోసమే తన విధానం గా మార్చుకున్న రేవంత్‌రెడ్డి రైతుల్ని అన్ని కోణాల్లో దగా చేస్తున్నారని, రుణమాఫీని దారుణ వంచనగా మార్చారని తెలిపారు. ఎన్నికల మ్యానిఫెస్టోలో చెప్పినట్లు, అసెంబ్లీ లో ప్రకటించినట్లు రైతులందరికీ రుణమాఫీ చేసేదాకా, రైతుభరోసా ఇచ్చేదాకా బీఆర్‌ఎస్ పార్టీ “నిన్నూ, నీకాంగ్రెస్ పార్టీని” వెంటాడుతూనే ఉంటుందని హరీశ్‌రావు హెచ్చరించారు.
జాతీయ పక్షి ఉసురు తీసుకుంటారా?
“ఎంతైనా జాతీయ పార్టీ కదా.. అందుకేనేమో, జాతీయ పక్షి ఉసురుతీసుకుంటు న్నారు..”అని హరీశ్‌రావు కాంగ్రెస్ ప్రభుత్వా న్ని విమర్శించారు. హెచ్‌సీయూలోని పచ్చని భూముల మీద, వన్యప్రాణుల మీద రేవంత్ సర్కార్ విధ్వంసం సృష్టిస్తోందని మాజీ మం త్రి హరీశ్‌రావు మరో ట్వీట్‌లో పేర్కొన్నారు.