calender_icon.png 25 October, 2024 | 10:47 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎంతకాలం ఈ వివక్ష?

12-10-2024 12:00:00 AM

వసూలయిన పన్నుల్లో రాష్ట్రాలకు విడుదల చేయాల్సిన వాటాల విషయంలో  కేంద్రం వివక్ష మరోసారి బట్టబయలయింది. అక్టోబర్ నెలకు సంబంధించి పన్నుల్లో  రాష్ట్రాలకు రావాల్సిన నిధులను కేంద్రం గురువారం విడుదల చేసింది.  ముందస్తు వాయిదా రూ.89,086 కోట్లతో కలి పి మొత్తం రూ.1,78, 173 కోట్ల నిధులను కేంద్రప్రభుత్వం విడుదల చేసింది.

పండగల సీజన్‌లో రాష్ట్రాలు మూలధన వ్యయాన్ని వేగవంతం చేయడానికి వీలుగా ముందస్తు వాయిదాను కూడా కలిపి నిధులను విడుదల చేస్తున్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ ఒక ప్రకటన చేసింది. అయితే అధిక పన్నులద్వారా ఆదాయాన్ని అందించే రాష్ట్రాలకు తక్కువగా, రూపాయి పోవడమే తప్ప రావడం లేని ఉత్తరప్రదేశ్, బీహార్, మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రాలకు అధిక నిధులు ఇవ్వడం మరోసారి  వివాదాస్పదంగా మారింది.

ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాలయిన తమిళనాడు, కర్నాటక, కేరళ, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలనుంచి కేంద్రానికి లభించే పన్నులు ఎక్కువ. ఈ రాష్ట్రాలు పారిశ్రామికంగాను, వ్యవసాయి కంగాను ప్రగతి పథంలో ఉండడం దీనికి కారణం. అందుకే ఈ రాష్ట్రాల్లో తలసరి ఆదాయం కూడా ఎక్కువే. కానీ కేంద్రం రాష్ట్రాలకు విడుదల చేసిన నిధులను పరిశీలిస్తే దక్షిణాది రాష్ట్రాలకు గతంలో మాదిరిగానే మరోసారి అన్యాయం జరిగిందనేది అర్థం అవుతుంది.

అయిదు దక్షిణాది రాష్ట్రాలకు కలిపి దక్కింది రూ. 28,152 కోట్లు కాగా అందులో తెలంగాణకు విదిలించింది రూ.3,745 కోట్లే. ఒక్క హైదరాబాద్ నగరంనుంచే పన్నుల రూపంలో కేంద్రానికి వేల కోట్ల ఆదాయంఏటా లభిస్తూ ఉంటుంది. అయినా రాష్ట్రానికి కేటాయింపుల విషయంలో అన్యాయమే జరుగుతూ వస్తోంది.

మరో వైపు దేశంలోనే వెనకబడిన రాష్ట్రాలుగా గుర్తింపు పొందిన ఉత్తరప్రదేశ్, బీహార్ రాష్ట్రాలకు మాత్రం ఉదారంగా నిధులు  దక్కుతున్నాయి. తాజాగా విడుదల చేసిన నిధుల్లో సైతం యూపీకి అత్యధికంగా రూ.31, 983 కోట్ల నిధులు దక్కాయి. అంటే అయిదు దక్షిణాది రాష్ట్రాలకు కలిపి ఇచ్చిన దానికన్నా ఎక్కువే.

మొత్తం నిధుల్లో ఈ రాష్ట్రానికి 17.9 శాతం నిధులు దక్కగా దక్షిణాది రాష్ట్రాలన్నిటికీ కలిపి దక్కింది 15.8 శాతం మాత్రమే. ఇక రెండో స్థానంలో బీహార్ ఉంది. ఈ రాష్ట్రానికి రూ.17, 931 కోట్లు దక్కాయి.

15వ ఆర్థిక సంఘం సిఫార్సుల ప్రకారం కేంద్రం పన్నుల్లో 41 శాతాన్ని రాష్ట్రాలకు ఇవ్వాల్సి ఉంటుంది. కానీ 202425 ఆర్థిక సంవత్సరంలో  32.5 శాతం మాత్రమే రాష్ట్రాలతో పంచుకోవాలని ఆర్థిక శాఖ అంచనా వేసింది. దీనివల్ల సెస్, సర్చార్జీల్లో కూడా కేంద్రంనుంచి రావలసిన వాటా భారీగా తగ్గుతుందని దక్షిణాది రాష్ట్రాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

నిజానికి కేంద్రం పన్నుల్లో వాటాను పెంచాలని ఈ రాష్ట్రాలు చాలా కాలంగా డిమాండ్ చేస్తున్నాయి. ఇటీవల రాష్ట్రానికి వచ్చిన 16వ ఆర్థిక సంఘానికి ఈ  సమస్యలన్నిటినీ రేవంత్ ప్రభుత్వం వివరించింది. ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క గణాంకాలతో సహా తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని వివరించారు కూడా. 

ప్రతిపక్ష పాలిత రాష్ట్రాలకు కేంద్రం పన్నుల వాటాలో వివక్షపై కొద్ది నెలల క్రితం ఆయా రాష్ట్రాల మంత్రులు ఢిల్లీలో ధర్నా సైతం నిర్వహించారు. అయినా మోదీ సర్కార్ వైఖరిలో ఎలాంటి మార్పూ రాలేదు. అత్యధిక ఆదాయాన్ని అందించే రాష్ట్రాలకు అత్తెసరు నిధులు కేటాయించడం విపక్ష పాలిత రాష్ట్రాల పట్ల కేంద్రం వివక్షకు సాక్ష్యంగా నిలుస్తోందని, రూపాయి పోవడమే తప్ప తిరిగి రాని రాష్ట్రాలకు పెద్ద ఎత్తున నిధులు కేటాయించడం ఏమిటని తెలంగాణలోని ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్‌ఎస్ నిలదీస్తోంది.

రాష్ట్రం ఏర్పడి పదేళ్లయినా ఇంతవరకు కేంద్రం తెలంగాణకు అదనంగా ఇచ్చింది ఒక్క రూపాయి కూడా లేదని ఆ పార్టీ మండిపడుతోంది. బడ్జెట్‌లో రాష్ట్రానికి మొండి చేయి చూపించిన కేంద్రం తాము చెల్లించిన పన్నుల వాటాలో సైతం అన్యాయం చేస్తోందని ఆ పార్టీ నేత హరీశ్ రావు ధ్వజమెత్తారు. ఈ వివక్షను ఇక ఎంతకాలం భరించాలని కూడా ప్రశ్నిస్తున్నారు.