calender_icon.png 18 November, 2024 | 7:18 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎన్నాళ్లీ కాలుష్యం బెడద?

08-11-2024 12:00:00 AM

దేశ రాజధాని ఢిల్లీ మహానగరాన్ని గత కొన్నేళ్లుగా కాలుష్యం బెడద పీడిస్తున్నా పరిష్కారం మాత్రం కనుచూపు మేరలో కనిపించడం లేదు. ప్రతి ఏటా శీతాకాలం మొదలవడంతోనే నగరాన్ని కాలుష్యం కమ్మేస్తూ ఉంటుంది. రుతుపవనాలు ఉత్తరాదినుంచి ఉపసంహరించుకోవడంతో పాటుగా పొరుగు రాష్ట్రాలయిన హర్యానా, పంజాబ్‌లో రైతులు పెద్ద ఎత్తున పంట వ్యర్థాలను దగ్ధం చేయడంతో దట్టమైన పొగ నగరాన్ని కమ్మేస్తూ వస్తోంది.

ఇప్పటికే ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరాల్లో ఒకటిగా పేరు తెచ్చుకున్న ఢిల్లీ నవంబర్, డిసెంబర్ మాసాల్లో వాయు కాలుష్యంతో ఉక్కిరిబిక్కిరి కావడం పరిపాటి అయింది. అయితే ఈ వ్యవహారం కేంద్ర, రాష్ట్రప్రభుత్వాల మధ్య రాజకీయ ఆరోపణలకు కేంద్రం కావడం విచిత్రం.ప్రతి సంవత్సరం ఈ వ్యవహారం సర్వోన్నత న్యాయస్థానానికి ఎక్కుతూనే ఉంది.కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, ఢిల్లీలో అధికార పార్టీ అయిన ఆప్ నేతలు ఒకరిపై ఒకరు నెపాన్ని నెట్టుకుంటూ రాజకీయ విమర్శలు చేసుకుంటూ కాలం గడిపేయడం తప్ప సమస్యకు శాశ్వత పరిష్కార మార్గాలపై దృష్టిపెట్టడం లేదు. 

పొరుగు రాష్ట్రాలయిన పంజాబ్, హర్యానా, రాజస్థాన్, యూపీలలో రైతులు పంటవ్యర్థాలను తగులబెట్టడమే ఏటా ఢిల్లీలో వాయు కాలుష్యానికి ప్రధాన కారణమని సుప్రీంకోర్టు సైతం అభిప్రాయపడింది. ఆయా రాష్ట్రాలన్నీ ఈ వ్యర్థాల దహనాన్ని ఆపడానికి చర్యలు తీసుకోవాలని గతంలోనే ఆదేశించింది. అయినా ఫలితం శూన్యం. కాగా ఈ ఏడాది ఢిల్లీలో వాయు కాలుష్యం తీవ్రత చాలా ఎక్కువగా ఉంది. దీపావళి సందర్భంగా నగరంలో బాణాసంచా కాల్చడంపై రాష్ట్రప్రభుత్వం పండగకు ముందే నిషేధించింది.

అయినా పండగ రోజుల్లో ప్రజలు యధావిధిగా పెద్ద ఎత్తున టపాకాయలు కాల్చారు. ఫలితంగా పండగ తర్వాతి రోజు నగరంలో వాయు నాణ్యత సూచీ అత్యంత ప్రమాద స్థాయి అయిన 400 మార్కుకు చేరువయింది. ఫలితంగా ఏడేళ్ల తర్వాత నగరంలో స్కూళ్లు మూతపడ్డాయి. ఇప్పటికే పలు ఆఫీసులకు ‘వర్క్ ఫ్రమ్ హోమ్’ అమలు చేస్తున్నారు. దట్టమైన పొగ నిండిన రోడ్లతో గాలి పీల్చుకోవడానికి ఇబ్బంది పడుతూ ముక్కులకు మాస్కులు తగిలించుకుని జనం రోడ్లపైకి రావలసిన పరిస్థితి.

వాయు కాలుష్యం బెడదను తగ్గించడానికి ఢిల్లీ ప్రభుత్వం మరోసారి ఈ నెల 13నుంచి వాహనాలకు సరిబేసి విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించింది. 2019 తర్వాత ఢిల్లీలో మళ్లీ ఈ విధానాన్ని తేవడం ఇదే మొదటిసారి. మరోవైపు యమునానది కాలుష్య కాసారంగా మారింది. విషపూరిత నురుగుతో తాగడానికి కాదు కదా కనీసం స్నానాలు చేయడానికీ ప్రమాదకరంగా మారింది. ఛత్‌పూజల సందర్భంగా నదిలో స్నానాలను హైకోర్టు నిషేధించింది కూడా. మనుషులే కాదు, పశుపక్ష్యాదులు సైతం పెద్ద ఎత్తున అనారోగ్యం బారిన పడుతున్నారు.

ఈ పరిణామాలన్నిటినీ గమనించిన సుప్రీంకోర్టు  కేంద్రంతో పాటుగా రాష్ట్ర ప్రభుత్వాన్ని తీవ్రంగా తప్పుబట్టింది. బాణాసంచా నిషేధం అమలుకు రాష్ట్రప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకున్నట్లు కనిపించడం లేదని వ్యాఖ్యానించింది. అంతేకాదు సరిబేసి విధానం వల్ల ఫలితం అంతంతమాత్రమేనని వ్యాఖ్యానించింది. పర్యావరణ పరిరక్షణ కోర్టు బాధ్యత అని అనుకోవడం తప్పని, వాయు, శబ్ద కాలుష్య నియంత్రణ బాధ్యత అందరిదీ అని మరోసారి హితవు చెప్పాల్సి వచ్చింది.

పంటవ్యర్థాల దగ్ధాన్ని అరికట్టడానికి పొరుగు రాష్ట్రాలపై ఏం చర్యలు తీసుకున్నారో చెప్పాలని కేంద్రాన్ని నిలదీయడంతో వారం, పది రోజుల్లో కఠిన చర్యలు తీసుకుంటామని కోర్టుకు హామీ ఇచ్చింది.. దానికి అనుగుణంగా రైతులు పంట వ్యర్థ్థాలను దగ్ధం చేస్తే భారీగా రూ.30 వేల వరకు జరిమానాలు విధిస్తూ నిర్ణయం తీసుకుంది. కానీ ఇక్కడో విషయం గమనించాలి ఈ రాష్ట్రాల్లో పంజాబ్‌లో ‘ఆప్’ అధికారంలో ఉంటే మిగతావన్నీ బీజేపీ పాలిత రాష్ట్రాలే. మరి ఎవరిని తప్పుబట్టాలి. రాజకీయాలు పక్కన పెట్టి ప్రజల ఆరోగ్యాలపై దృష్టిపెడితే అందరూ హర్షిస్తారు.