calender_icon.png 26 October, 2024 | 7:04 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మెడికల్ అడ్మిషన్లలో స్థానికత ఎలా?

13-08-2024 01:12:48 AM

వివరాలు ఇవ్వాలని హైకోర్టు ఆదేశం

హైదరాబాద్, ఆగస్టు 12 (విజయక్రాంతి): రాష్ట్రంలోని వైద్య కళాశాలల్లో మెడికల్, డెంటల్ కోర్సుల్లో అడ్మిషన్లకు స్థానికత నిర్ధారణ నిబంధనలపై వివరణ ఇవ్వాలని ప్రభుత్వానికి సోమవారం హైకోర్టు నోటీసులు జారీ చేసింది. మెడికల్ నిబంధనలు 2017ను సవరిస్తూ రూల్ 3 ఏను చేర్చుతూ ప్రభుత్వం గత నెల 19న జారీ చేసిన జీవో 33ను సవాలు చేస్తూ హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆలోక్ అరాధే, జస్టిస్ జే శ్రీనివాసరావుతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. పిటిషనర్ల తరఫు న్యాయవా దులు వాదనలు వినిపిస్తూ గత ఏడాది ఇదే హైకోర్టు వెలువరించిన తీర్పునకు విరుద్ధంగా ప్రభుత్వం నిబంధనలను సవరిస్తూ జీవో తీసుకొచ్చిందని తెలిపారు.

ప్రస్తుత నిబంధన ప్రకారం అడ్మిషన్‌కు ముందు వరుసగా నాలుగేళ్లు తెలంగాణలో చదివి ఉండాలని నిబంధన తీసుకువచ్చారని చెప్పారు. 10వ తరగతి వరకు ఇక్కడ చదివినవారు.. తల్లిదండ్రుల ఉద్యోగ, ఇతరత్రా ఇతర ప్రాంతాలకు వెళ్లిన సందర్భాల్లో ఇక్కడ శాశ్వత నివాసాన్ని కోరుకొంటే ఎమ్మార్వో ధ్రువీకరణ పత్రం సమర్పించాలని ఇదే హైకోర్టు గత ఏడాది తీర్పు చెప్పిందని గుర్తుచేశారు. ప్రస్తుతం ఆ తీర్పునకు విరుద్ధంగా ప్రభుత్వం నిబంధనలు ఉన్నాయని తెలిపారు. గత ఆదేశాల ప్రకారం స్థానిక నివాస ధ్రువీకరణ పత్రం కోసం ఎమ్మార్వోలను ఆశ్రయిస్తే తిరస్కరిస్తున్నారని ఆందోళన వ్యక్తంచేశారు. వాదనలు విన్న ధర్మాసనం ప్రతివాదులైన వైద్య ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి, కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ, ఎన్టీఏలకు నోటీసులు జారీ చేస్తూ విచారణను 14కు వాయిదా వేసింది.