calender_icon.png 13 February, 2025 | 3:56 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భూసేకరణ ఎలా?

13-02-2025 12:34:59 AM

  1. ప్రభుత్వ పరిహారానికి, మార్కెట్ ధరకు భారీ వ్యత్యాసం
  2. తక్కువ ధరకు ఇచ్చేందుకు ముందుకురాని రైతులు
  3. రాష్ట్రంలో కొనసాగుతున్న నిర్వాసితుల ఆందోళనలు
  4. ప్రతిపక్షాలకు రాజకీయ అస్త్రంగా మారిన నిరసనలు
  5. పరిహారంపై ఆచితూచి వ్యవహరిస్తున్న ప్రభుత్వం

హైదరాబాద్, ఫిబ్రవరి 12 (విజయక్రాంతి): అభివృద్ధి పనులు, పారిశ్రామిక పార్కులు, ప్రాజెక్టుల నిర్మాణాలతో పాటు ఇతర అవసరాల కోసం తలపెట్టిన భూసేకరణ ప్రభుత్వానికి ఛాలెంజింగ్ మారింది. ఈ అభిప్రాయం స్వయంగా ప్రభుత్వవర్గా ల నుంచే వ్యక్తమవుతోంది.

గత పదేళ్లలో భూముల ధరలు అమాంతం పెరగడం.. ప్రభుత్వం ఇస్తున్న పరిహారానికి, బహిరంగ మార్కెట్ విలువకు భారీగా తేడా ఉండ టం.. పంట భూములు ఇవ్వడానికి రైతు లు ముందుకు రాకపోవడం.. కొన్నిచోట్లు తల్లిదండ్రులు భూములు ఇవ్వడానికి ముందుకొచ్చినా భవిష్యత్‌లో ధరలు భారీగా పెరుగుతాయని వారి వారసులు సంతకాలు పెట్టకపోవడం.. వీటికి తోడు ప్రతిపక్షాల ఆందోళనలు వెరసి సర్కార్‌కు భూసేకరణ సవాల్‌గా మారింది.

దీంతో అభివృద్ధి పనులు, ప్రాజెక్టుల నిర్మాణాల్లో ముందడగు పడటం లేదు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక నారాయణపేట గంల్ ఎత్తిపోతల పథకం, పారిశ్రామిక వాడలు, గ్రీన్‌ఫీల్డ్ హైవేల నిర్మాణం, ఫోర్త్‌సిటీతో పాటు రాష్ట్రవ్యాప్తంగా పలు అభివృద్ధి పనుల కోసం భూసేకరణ చేయాలని నిర్ణయించింది. అయితే కొన్నిచోట్ల భూసేకరణ సాఫీగా జరిగినా.. మెజార్టీ చోట్ల మాత్రం అనుకున్న స్థాయి లో వేగంగా జరగడం లేదని స్వయంగా మంత్రులే చెబుతున్నారు. 

పదేళ్లలో భారీగా పెరిగిన ధరలు.. 

బీఆర్‌ఎస్ పాలించిన పదేళ్ల కాలంలో ఊహించని రీతిలో భూముల ధరలు పెరిగాయి. ఖరీదైన ప్రాంతాల్లో సామాన్యుడు గుంట జాగా కూడా కొనలేని పరిస్థితి ఉంది. నాటి బీఆర్‌ఎస్ పాలకులు కృత్రిమం గా ధరలు పెంచి.. భారీగా వెనకేసుకున్నారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. ఈ క్రమంలో నాటి బీఆర్‌ఎస్ సర్కార్ పెంచిన భూముల ధరలు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇబ్బందిగా మారాయి. ఒక్క హైదరాబాద్ మాత్రమే మున్సిపాలిటీలు, పట్టణాలు, గ్రామాల్లోనూ ఇదే పరిస్థితి ఉంది. 

పొంతన లేని ధరలు..

భూముల ధరలు పెరగడం వల్ల రిజిస్ట్రేషన్ విలువకు.. బహిరంగ మార్కెట్ విలువకు అసలు పొంతనే ఉండటం లేదు. ఆర్‌ఆర్‌ఆర్ కోసం కాంగ్రెస్ ప్రభుత్వం 1,935 హెక్టార్ల భూమిని సేకరించాలని గతేడాది నిర్ణయించింది. కానీ భూసేకరణ అనుకున్న స్థాయిలో జరగడం లేదు. ట్రిపుల్‌ఆర్ కోసం చౌటుప్పల్ వద్ద జంక్షన్ కోసం 181 ఎకరాలు సేకరించాలని ప్రభుత్వం భావించింది.

ఇక్కడ ఎకరం భూమి విలువ బహిరంగ మార్కెట్‌లో రూ.కోటి నుంచి రూ.3 కోట్లు పలుకుతోంది. అయితే రిజిస్ట్రేషన్ విలువ మాత్రం రూ.20 లక్షల నుంచి రూ.25 లక్షలే ఉంది. లగచర్ల పారిశ్రామికవాడ కోసం ప్రభుత్వం భూమిని సేకరించేందుకు సిద్ధమైంది. ఇక్కడ మార్కెట్ విలువ ఎకరం రూ.20 లక్షలుంటే.. ప్రభుత్వం మాత్రం రూ.8 లక్షలు చెల్లిస్తామని ప్రకటించింది.

అలాగే, 30 వేల ఎకరాల్లో ఫోర్త్ సిటీని నిర్మించాలని రేవంత్‌రెడ్డి సర్కార్ యోచిస్తోంది. ఇందులో ఇప్పటికే 12 వేల ఎకరాలను సేకరించారు. మిగిలిన 18 వేల ఎకరాలను సేకరించడం సర్కార్‌కు సవాల్‌గా మారింది. ఫోర్త్ సిటీ ప్రకటన తర్వాత ఇక్కడ భూముల ధరలు ఆశాన్నంటాయి. దీంతో ఇక్కడి రైతులు కూడా తమ భూములిచ్చిందుకు ముందుకు రావడం లేదు.

ఇలా రాష్ట్రవ్యాప్తంగా బహిరంగ మార్కెట్‌లో పలికే ధరకు.. ప్రభుత్వమిచ్చే పరిహారానికి పొంతన ఉండటం లేదని నిర్వాసితులు చెబుతున్నారు. రాష్ట్రంలో భూసేకరణ చట్టం-2013 ప్రకారం ప్రభుత్వం భూమిని సేకరించాలి. ఈ లెక్కన భూమి ధరకు మూడు రెట్లు ఇచ్చి భూమిని తీసుకోవాలి.

కానీ ప్రభుత్వం బహిరంగ మార్కెట్ విలువను నిర్వాసితులకు ఇవ్వకుండా.. రిజిస్ట్రేషన్ వాల్యూ ప్రకారం మూడు రేట్ల పరిహారం ఇవ్వడానికి ముందుకు రావడంతో సమస్య జటిలంగా మారుతోంది.

సమస్యంతా పరిహారంతోనే..

పారిశ్రామికాభివృద్ధి ఒకే దగ్గర ఉండకూడదని టైర్ 2, టైర్ 3 పట్టణాలతో పాటు గ్రామాల్లో పెట్టుబడులు పెట్టేలా కంపెనీలను ప్రోత్సహించాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలో భారీఎత్తున పారిశ్రా మిక పార్కులు ఏర్పాటు చేసి కంపెనీలను ఆహ్వానించాలని అనుకుంది.

అలాగే, ఎంఎస్‌ఎంఈలను ప్రోత్సహించేందుకు జిల్లాలను యూనిట్లుగా చేసి ఆయా చోట్ల అవసరమైన భూమిని వాటికి ఇవ్వాలని సర్కారు ఆలోచిస్తోంది. ఈ క్రమంలో వికారాబాద్ జిల్లాలో ని లగచర్ల, పోలేపల్లి గ్రామాల్లో పారిశ్రామికవాడల కోసం భూసేకరణ చేపట్టింది. అక్కడ పరిహారం విషయంలో జరిగిన ఆందోళన దేశవ్యాప్తంగా సంచనంగా మారింది.

ప్రస్తు తం పెద్దపల్లి ఎన్టీపీసీ విస్తరణ, నాగ్‌పూర్-ఖమ్మం-అమరావతి గ్రీన్‌ఫీల్డ్ హైవే, నారా యణపేట-కొడగంల్, పాలమూరు రంగారెడ్డి, నిజామాబాద్-జగ్దల్‌పూర్ రహదారి, మంచిర్యాల-వరంగల్-విజయవాడ హైవే, ఆర్‌ఆర్‌ఆర్ కోసం ప్రభుత్వం భూసర్వేలు చేసి చాలా కాలమైంది. కానీ భూసేకరణ మాత్రం ముందుపడటం లేదు. ఆయా చోట్ల పరిహారమే ప్రధాన సమస్యగా మారింది.

బీఆర్‌ఎస్ మాదిరి కాకుండా!

భూసేకరణ విషయంలో ఆందోళనలు జరుగుతున్నా.. ప్రభుత్వం వెనక్కి తగ్గడం లేదు. రైతులకు అన్యాయం జరగకుండా పరిహారం ఇచ్చేందుకు సిద్ధమని ఇదివరకే లగచర్ల ఘటన సమయంలో సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించారు. అయితే పరిహారం చెల్లింపుల విషయంలో ఎలాంటి అక్రమాలు జరగకుండా నిజమైన నిర్వాసితులకే పరిహారం చెల్లించాలని ప్రభుత్వం ఆలోచిస్తోం ది.

బీఆర్‌ఎస్ సర్కార్ హయాంలో ఫార్మాసిటీ కోసం ఇచ్చిన పరిహారంలో అక్రమాలు జరిగినట్టు ప్రభుత్వం దృష్టికి వచ్చింది. బినామీలకు పరిహారం ఇచ్చారన్న సమాచారం తో ఆ వివరాలను తెప్పించుకొనే పనిలో నిమగ్నమైంది. బీఆర్‌ఎస్ మాదిరిగా కాకుండా, అసలైన లబ్ధిదారులకు మెరుగైన పరిహారం చెల్లించేందుకు ప్రణాళికలు రచిస్తున్నట్టు తెలుస్తోంది.

రాష్ట్రంలో పలుచోట్ల ఆందోళనలు

భూసేకరణ పరిహారం విషయంలో ప్రస్తుతం రాష్ట్రంలో పలుచోట్ల ఆందోళనలు జరుగుతున్నాయి. నిరనసలకు ప్రతిపక్షాలు కూడా మద్దతుగా నిలుస్తున్నాయి. మంచిర్యాల జిల్లాలో హైవే- 63 నిర్మాణం కోసం ప్రభుత్వం భూ మిని సేకరించేందుకు సిద్ధమవగా.. రైతులు ఆందోళనలు నిర్వహిస్తున్నారు.

లగచర్లలో భూ సేకరణ సంక్లిష్టంగా మారింది. కల్వకుర్తి, నంద్యాల రహదారికి భూసేకరణ చేస్తున్న సమయంలో రైతులు ఆత్మహత్యాయత్నం చేసిన విషయం తెలిసిందే. కొడంగల్-నారాయణపేట ఎత్తిపోతలకు సంబంధించి న భూ సర్వేను రైతులు అడ్డుకుంటున్న నేపథ్యంలో పోలీసుల పహారాల్లో సర్వే నిర్వహిస్తున్నారు.

తమ డిమాండ్ మేర కు పరిహారం ఇస్తేనే  భూములు ఇచ్చేందుకు తాము సిద్ధమని రైతులు అంటున్నారు. ఈ రైతుల ఆందోళనలను ఆసరాగా చేసుకున్న ప్రతిపక్షాలు.. ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టే ప్రయత్నం చేస్తున్నాయి.