ఫ్రాన్స్ రాజధాని పారిస్‌లో 1987లో ప్రారంభమైన పేదరికంపై పోరుబాట ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలో 1992 నుంచి ప్రతీ సంవత్సరం అక్టోబర్ 17న ప్రపంచ పేదరిక నిర్మూలనా దినోత్సవంగా రూపు దిద్దుకొంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న నివేదికల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 20 శాతం జనా భా పేదరికంతో మగ్గుతున్నారు. అంటే ప్రతిపది మందిలో ఒకరు పేదరికంతో సతమతం అవుతున్నారని అర్థం.
2021 గణాంకాలు ప్రకారం 710 మిలియన్ల జనాభా దుర్భర పేదరికం (ఎక్స్‌ట్రీమ్ పావర్టీ)లో ఉన్నారని నివే దికలు చెబుతున్నాయి. పేదరికం అంటే ఆహా రం, దుస్తులు, నివాసం లేకపోవడమే కాదు, కనీసం సౌకర్యాలు, మంచినీరు , విద్య వైద్యం వంటివి కూడా అందకపోవడం అని కూడా గ్రహించాలి.
ఈ కోణంలో పరిశీలన చేస్తే ప్రపంచ వ్యాప్తంగా భారత్‌తో పాటు ఇరవై దేశాల్లో ముఖ్యంగా ఈస్ట్ ఆసియా, పసిఫిక్, సబ్ సహారా ప్రాంతాల్లో అత్యధికంగా పేదరికం విస్త్తరించి ఉందని గ్రహించాలి. పేదరికం అనేది సమస్త సమస్యలకు మూలం. అధిక జనాభా, రాజకీయ, సామాజిక, ఆర్థిక, లింగ, జాతి వివక్షతలు దీనికి ప్రధాన కారణాలు. సంపద కేంద్రీకృతమై ఉండడం.
అభివృద్ధి చెందిన దేశాలు ఇతర దేశాలను అణచి వేసే దుస్థితి. అనేక కారణాలు, సాకులు, వంకలతో ఇతర దేశాలపై దాడులు, యుద్ధాలు చేయడం తో అనేక మంది పేదరికం బారిన పడుతున్నా రు. ఇటీవలి కాలంలో ప్రపంచాన్ని వణికించిన కరోనా వైరస్ ధాటికి ప్రపంచ జనాభా చెల్లాచెదురై కొందరు మరణించగా, మరెందరో ఉద్యోగ ఉపాధి అవకాశాలు కోల్పోయి పేదరి కం కోరల్లో చిక్కుకుని నేటికీ సతమతమవుతున్నారు.
మరోపక్క ప్రకృతి వైపరీత్యాలు, వరద లు, తుపానుల కారణంగా ప్రజల జీవితాలు పేదరికానికి మరింత చేరువై జీవితాలు దుర్భరంగా తయారవుతున్నాయి. ఇక మనదేశంలో ఇటీవలి కాలంలో ప్రైవేటీకరణ కార్పోరేటీకరణ వలన అనేక మంది అసంఘటిత కార్మికులుగా మారి చాలీచాలని జీతంతో జీవితాలను అంతంత మాత్రంగానే నడుపుకుంటున్నారు. ఒక్కమాటలో చెప్పాలంటే దేశంలో దాదాపు సగం మంది జనాభా ప్రభుత్వాలు ఇచ్చే పథకాలు, పెన్షన్‌లతో బతుకులు ఈడుస్తున్నారు.
భారత రాజ్యాంగం ప్రకారం అందరికీ సమానంగా, నాణ్యమైన విద్య, వైద్యం ప్రభుత్వాలు అందించాలి. కానీ ప్రభుత్వాలు ఈ రెండు రంగాలను దాదాపు ప్రైవేటీకరణ, కార్పోరేటీకరణ చేయడంతో సామాన్య మధ్య తరగతి ప్రజలు తమ వేతనాల్లో ఎక్కువ భాగం వీటిపై ఖర్చు చేయడం వలన దాదాపు దేశం లో సగం జనాభా పేదరికంలో మగ్గుతున్న పరిస్థితి.
ఇకనైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విద్య వైద్యం పేద మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో ఉంచాలి. స్వీడన్, నార్వే, ఫిన్లాండ్ వంటి నార్డిక్ దేశాలు మానవ అభివృద్ధి సూచికలో మొదటి స్థానంలో ఉండ డానికి ఆయా ప్రభుత్వాలు ఈ రంగాలపై దృష్టిపెట్టడమే కారణం. ప్రస్తుతం ప్రపంచ మానవ అభివృద్ధి సూచికలో మనదేశం 134వ స్థానం ఉంది.
ఆకలి సూచీలో 105వ స్థానం, నిరుద్యోగంలో 87వ ర్యాంక్, సంతోష సూచీలో 126వ స్థానం, ఆరోగ్య సూచీలో 56వ స్థానం, అక్షరాస్యతలో 105వ స్థానంలో .. ఇలా అనేక అంతర్జాతీయ సూచీకల్లో భారత్ అధమ స్థానంలో ఉండుట అత్యంత బాధాకరమైన విషయం.
ఇకనైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విద్య, వైద్యం కోసం, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడం కోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. ప్రైవేటీ కరణ కార్పోరేటీకరణ కాషాయకరణ మానుకోవాలి. పేర్లు మార్చినంత మాత్రన పేదరికం పోదని గ్రహించాలి. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడం ద్వారానే పేదరిక నిర్మూలనకు శాశ్వత పరిష్కారం అని గ్రహించాలి.
సంపద వికేంద్రీకరణ, భూ సంస్క రణలు అమలు, రైతులకు గిట్టుబాటు ధరలు, పరిశ్రమలు ఏర్పాటు, పర్యావరణ పరిరక్షణ, విద్య, వైద్యం ప్రభుత్వ ఆధీనంలో ఉండడం వంటి చర్యలద్వారానే ముఖ్యంగా మన దేశంలో పేదరికాన్ని పారద్రోలగలం అనే వాస్తవాన్ని మరు వరాదు. 2047 నాటికి వికసిత భారత్, వికసిత తెలంగాణ లక్ష్యం కోసం ఇకనైనా పేదరికం నిర్మూలనకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు శాశ్వత ప్రాతిపదికన చర్యలు తీసుకుని, ప్రణాళికా బద్ధంగా పనిచేస్తాయని ఆశిద్దాం.
ఐ.ప్రసాదరావు