18-03-2025 12:00:00 AM
దోర్బల బాలశేఖరశర్మ :
భారతదేశం ఇప్పటికీ పరిశుభ్రత విషయంలో అభివృద్ధి చెందిన ప్రపంచం కంటే మైళ్లకొద్ది దూరం వెనుకబడి ఉంది. ఫలితంగా అమెరికా వంటి అగ్రదేశాలతో పోల్చినప్పుడు పర్యాటకుల పట్ల మన ప్రదేశాల ఆకర్షణ తగ్గిపోతున్నది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ‘స్వచ్ఛ భారత్ మిషన్’ అనే స్ఫూర్తిదాయకమైన ఆలోచనను గత 10 సంవత్సరాలుగా అమలు చేస్తున్నారు.
ఈ మేరకు పటిష్టమైన చర్యలు కూడా తీసుకుంటున్నారు. ముఖ్యంగా గ్రామాల్లో ఈ భారీ పరిశుభ్రత ప్రాజెక్టు మొదటి దశ గణనీయమైన విజయాన్ని సాధించింది. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 12 కోట్లకు పైగా మరుగుదొడ్లు నిర్మితమైనాయి. వీటిలో 11.5 కోట్లు గ్రామీణ ప్రాంతాల్లోనే ఏర్పాటయినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి.
ఇది జర్మనీ, ఇటలీ, ఫ్రాన్స్, బ్రిటన్‌లలోని మొత్తం నివాస గృహాల సంఖ్యకు దాదాపుగా సమానం అంటే ఆశ్చర్యమే. దాదాపు 1,900 మల శుద్ధి కర్మాగారాలు, 30 లక్షల కంపోస్ట్ పిట్లు తయారైనాయి. ఈ మిషన్ ద్వారా 37.5 శాతం భారతీయ గృహాలకు టాయిలెట్ సదుపాయం సమకూరింది.
భారతీయ నగరాలను పూర్తి చెత్త రహితంగా మార్చడమే ‘అటల్ మిషన్ ఫర్ రిజువనేషన్ అండ్ అర్బన్ ట్రాన్సర్మేషన్ (అమృత్) 2..0 లక్ష్యమని ప్రధాని నరేంద్ర మోదీ పథకాన్ని ఆవిష్కరిస్తూ ఉద్ఘాటించారు. దీనితోపాటు ‘స్వచ్ఛ భారత్ మిషన్ అర్బన్’ (ఎస్‌బీఎమ్-యు) రెండో దశనూ కేంద్ర ప్రభుత్వం 2021లో ప్రారంభించింది.
‘స్వచ్ఛ భారత్ అర్బన్’ మొదటి దశ 2014లో మొదలవగా, 2021-22 నుంచి 2025-26 వరకు ఈ లక్ష్యసాధనకుగాను రూ.36,465 కోట్లను కేంద్రం కేటాయించింది. ‘స్వచ్ఛ భారత్’ విజయం ప్రధానంగా గ్రామీణ, పాక్షిక గ్రామీణ ప్రాంతాలలోనే నెలకొని ఉండడం గమనార్హం.
కానీ, ప్రపంచం దృష్టిలో మొట్టమొదట దర్శనమిచ్చేవి దేశంలోని నగరాలు, మహానగరాలు, ఇంకా ప్రముఖ పర్యాటక ప్రదేశాలు మాత్రమే. వీటిలో అనేకం పూర్తి చెత్త రహితంగా పరివర్తన చెందలేదు.
ప్రజలు శ్వాస తీసుకోలేని దుస్థితి
ఇప్పటికీ మురికి, చెత్తలలోనే ఆయా ప్రాంతాలు మునిగి ఉన్నట్టు విశ్లేషణలు చెబుతున్నాయి. ఇంకా, గొప్ప నాగరికతకు నిలయాలైన దేశంలోని నదులు, కాల్వలు, చెరువులు రకరకాల విష పదార్థాలు, రసాయనాలకు నిలయాలైనాయి.
పెద్ద నగరాల్లోని ప్రధాన వీధులు కాస్తంత మెరుగ్గా కనిపిస్తున్నా ఉపవీధులు, గల్లీలు, పేద-మధ్యతరగతి వారు నివసించే ప్రదేశాలు, అత్యధిక ప్రజాసమూహాలు కూడే ప్రాంతాలు ఉదాహరణకు రైల్వే జంక్షన్లు, బస్సు స్టేషన్లు, కూరగాయ మార్కెట్లు, పబ్లిక్ పార్కులు, ప్రభుత్వ విద్యాలయాలు, పాత- కొత్త పారిశ్రామిక వాడలు వంటివైతే భయంకరమైన కాలుష్యం బారిలోంచి ఇంకా బయట పడలేకున్నాయి.
ఆయా ప్రాంతాలలో ప్రజలు శ్వాస తీసుకోలేని దుస్థితి నెలకొన్న దాఖలాలు కూడా కనిపిస్తున్నాయి. భారతదేశానికి ‘స్వచ్ఛ భారత్ 2.0’ అవసరం. ఇందుకోసం కేంద్ర- రాష్ట్ర పౌర ప్రభుత్వాలు కలిసికట్టుగా ఆయా కార్పొరేషన్లు, లాభాపేక్షలేని సంస్థలు, పౌరులతో కలిసి పునరుద్ధరితమైన, బలమైన కార్యాచరణను చేపట్టవలసిన అవసరం బాగా కనిపిస్తున్నది.
140 కోట్ల జనాభా కలిగిన భారతదేశంలో ప్రవర్తనా, వ్యవస్థాగత మార్పులు కేవలం 10 సంవత్సరాలలో జరగవు. జరగాలని ఆశించడంలోనూ హేతుబద్ధత లేదు. కానీ, సామాన్య ప్రజలలో ఈ మేరకు ఉద్యమ స్థాయి చైతన్యం తేవచ్చు. గత ప్రభుత్వాల పోకడలతో పోల్చుకోకుండా, సంకల్పబలంతో ప్రస్తుత ప్రభుత్వాలు ముందడుగు వేయాలి.
ప్రభుత్వాలు, ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు ఈ దిశగా ఎందుకు శ్రమించకూడదు? కేవలం ఆయా ప్రత్యేక కాలాలలో ఫొటోలకు పోజులు ఇవ్వడానికో, తమ అధినేతల మెప్పు పొందడానికో కాసేపు శ్రమించి ఊరుకుంటే సరిపోదు కదా!
స్వచ్ఛ స్పృహ ప్రజలలో నెలకొనాలి
పట్టణాలు, నగరాలు, మహానగరాలలో పారిశుధ్ధ్యం పట్ల అత్యధిక శ్రద్ధాసక్తులు కనబరిచి, ఆచరణలో చూపే ప్రజలకు, అపార్ట్ మెంట్ల వాసులకు, వ్యాపార సంస్థలకు మొదట ప్రోత్సాహకాలను ప్రవేశపెట్టాలి. వ్యర్థాలను రీసైకిల్ చేసేలా గాలి, నదులు, నేలను కలుషితం చేయని పారిశ్రామిక యూనిట్లకు కొత్త అనుమతులు, బహుమతులు ఇవ్వాలి.
తమ కంపెనీలలో ఆయా వస్తువుల ఉత్పత్తి అనంతరం తమంతట తాముగా పర్యావరణ పరిసరాలను శుభ్రం చేసుకోవడానికి ముందుకు వచ్చేలా ప్రభుత్వాలు, అధికారులు శ్రమించాలి. ఈ మేరకు విధి విధానాలను పకడ్బందీగా అమలు పరచాలి. ఎవరి సమయమైనా విలువైందే. అలాగని, పబ్లిక్ ప్రదేశాలను గలీజుగా ఉంచుతామంటే ప్రభుత్వాలు ఊరుకోకూడదు.
చెత్తను వేరు చేసి పరిసరాలను శుభ్రంగా ఉంచే నివాసితుల సంఘాలు, మార్కెట్ స్థలాలు, ఆర్కేడ్లు, షాపింగ్ జోన్లకు ప్రోత్సాహక బహుమతులు ఇవ్వాలి. పలుమార్లు అవకాశాలు ఇచ్చినా కూడా చెత్తా చెదారాల విషయంలో అదే తప్పును పదేపదే చేసే వారికి తగిన శిక్షలను సైతంకచ్చి తంగా అమలు చేయాలి. సంస్థలు, కార్యాలయాల లోపలి చెత్త, బహిరంగ చెత్త, బహి రంగ మూత్ర విసర్జన లేదా మలవిసర్జనకు పాల్పడే వారిని ఏ మాత్రం క్షమించకూడదు.
ఐతే, ఈ మేరకు ఆయా నిర్దిష్ట ప్రాం తాలలో టాయ్‌లెట్స్ సౌకర్యాలు విధిగా కల్పించవలసిన బాధ్యతను ప్రభుత్వాలు భుజాన వేసుకోవాలి. ఈ విషయంలో సరిగా పనిచేయని మున్సిపాలిటీలు, మార్కె ట్ కమిటీలు, గృహ నిర్మాణ సంస్థలు వంటివాటికి భారీ జరిమానా విధించాలి. ఆకస్మిక తనిఖీల కోసం ప్రతి నగరంలో ఫ్లయింగ్ స్క్వాడ్లను నిర్మించుకోవాలి.
త్వరితగతిన ప్రతిస్పందించగల సహాయక యూనిట్లను ఏర్పాటు చేయాలి. పోలీసులకు నేరాన్ని నివేదించినట్లుగా, పౌరులు మురికివాడల ఫొటోలు తీసుకొని అధికారులకు వాట్సాప్‌లలో షేర్ చేసేలా పోత్సహించాలి. కావలసి న స్థాయిలో హెల్ప్ లైన్లను ప్రవేశపెట్టాలి.
మానవ వనరుల వినియోగం ఆపాలి
భారతదేశంలోని చాలా గ్రామపంచాయతీలు, మున్సిపాలిటీలు, నగర పాలకసంస్థలు అత్యంత అవినీతిపరులు, పాలనలో బలహీనులు, ఇంజినీర్లకు బదులుగా గుమస్తాలతో నిండి ఉన్నాయన్న ఆరోపణలు కోకొల్లలు. అలాంటి వారిని గుర్తించి, నిర్దాక్షిణ్యంగా ఆయా శాఖలనుంచి తప్పించాలి. ‘స్వచ్ఛ భారత్ మిషన్’ ప్రస్తుతం పట్టణ వృద్ధిని పరిష్కరించడానికి భూగర్భ మురుగు నీటి వ్యవస్థను పునర్నిర్మించాల్సిన అవసరాన్ని పరిష్కరించడం లేదు.
ఇందుకోసం భారీ పెట్టుబడులను ఆహ్వానించాలి. పారిశుధ్ధ్య కార్మికుల విధి నిర్వహణ, సంక్షే మం, భద్రత పట్ల ప్రభుత్వాలు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. ఉదాహరణకు 2016-2019 మధ్య కాలంలో దేశంలో మురుగు కాలువలు, సెప్టిక్ ట్యాంకులను శుభ్రం చేస్తున్నప్పు డు 282 మంది పారిశుద్ధ్య కార్మికులు మరణించినట్లు అధికారిక సమాచారం.
అందు లో ఒక్క పై నిర్దిష్ట కాలంలోనే అత్యధిక మరణాలు తమిళనాడులో 40 నమోదయ్యా యి. హర్యానాలో మ్యాన్‌హోల్స్ మరణాలు 31, ఢిల్లీ, గుజరాత్‌లలో చెరో 30 సంభవించాయి. తరువాత మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ లలో చెరో 27 మరణాలు నమోదైనాయి. దేశవ్యాప్తంగా 2016లో 50 మరణాలు సంభవించగా, 2017లో 83 మంది పారిశుద్ధ్య కార్మికులు సెప్టిక్ ట్యాంకులు, మురుగు కాలువలలో ఊపిరాడక మరణించారు.
2018లో ఈ రకంగా 66 మరణాలు నమోదయ్యాయి. ఈ గణాంకాలకు సంబంధిత రాష్ట్రాలలోని పోలీసులు దాఖలు చేసిన ఎఫ్‌ఐఆర్‌ల సంఖ్య ఆధారమని సంబంధిత మంత్రిత్వ శాఖ అధికారికంగా వెల్లడించింది. ఆధునికంగా, సాంకేతికంగా ఇంతగా అభివృద్ధి చెందిన కాలంలోనూ విలువైన కార్మికుల ప్రాణాలను ఈ రకంగా కోల్పోవడమంటే అది మన ప్రభుత్వాల ఉదాసీన తను చాటినట్టే.
భారతదేశంలో ప్రస్తుతం నీటిద్వారా వచ్చే వ్యాధులను గుర్తించి పారిశుద్ధ్య కార్యక్రమానికి అనుసంధానించే యంత్రాంగం కూడా లేదు. చాలాచోట్ల మరుగుదొడ్లు, మలాన్ని శుభ్రం చేయడానికి ఒక నిర్దిష్ట సామాజిక వర్గంపైనే ఆధారపడే దుస్థితి నెలకొనడం అన్యాయం.
యంత్రాల సేవలను వినియోగించాల్సిన చోట మానవ వనరులను ఉపయోగించడం వల్ల ఈ రకమైన పరిస్థితులు ఎదురవుతుంటాయి. ఇలాంటి సమస్యలు అన్నింటినీ దేశం అధిగమించినప్పుడే ‘స్వచ్ఛ భారత్’తో కూడిన ‘వికసిత్ భారత్’ లక్ష్యం సంపూర్ణమైనట్టుగా భావించాలి.