calender_icon.png 30 March, 2025 | 4:02 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కోర్టు పరిధిలోని అంశంపై సీఎం ఎలా మాట్లాడుతారు?

27-03-2025 01:12:53 AM

  1. నిలదీసిన బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు 
  2. ఫిరాయింపుల అంశంపై సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలపై అభ్యంతరం 
  3. పోడియం వద్ద నిరసన తెలిపిన బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు
  4. కోర్టు పరిధిలో ఉన్న అంశంపై సీఎం మాట్లాడలేదు: మంత్రి శ్రీధర్‌బాబు 
  5. జ్యుడీషియరీ అంశాలపై పార్లమెంట్‌లో చర్చలు జరుగుతాయి: మంత్రి ఉత్తమ్ 

హైదరాబాద్, మార్చి 26 (విజయక్రాంతి): తెలంగాణ అసెంబ్లీలో కొద్దిసేపు గందరగోళం నెలకొంది. పార్టీ ఫిరాయింపులపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్య లపై దుమారం చెలరేగింది. పార్టీ ఫిరాయింపుల వ్యవహారం సుప్రీంకోర్టు పరిధిలో ఉన్నందున ఆ అంశంపై సీఎం ఎలా మాట్లాడుతారని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు సభలో ఆందోళన చేశారు.

పాయింట్ ఆఫ్ ఆర్డర్ కింద మాట్లాడే అవకాశం ఇవ్వాలని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు స్పీకర్‌ను కోరారు. ఇప్పుడు పాయింట్ ఆఫ్ ఆర్డర్ కుదరని, సీఎం ఎప్పుడో మాట్లాడితే ఇప్పుడేలా అవకాశం ఇస్తారని శాసనసభా వ్యవహారాలశాఖ మంత్రి శ్రీధర్‌బాబు వ్యాఖ్యానించారు. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు మాట్లాడటానికి మైక్ ఇవ్వకపోవడంతో బీఆర్‌ఎస్ సభ్యులందరూ పోడియం వద్దకు వెళ్లి నిరసన వ్యక్తం చేశారు.

వెంటనే మంత్రి శ్రీధర్‌బాబు మా ట్లాడుతూ ప్రతిపక్షాల నిరసనలను తీవ్రంగా ఖండించారు. సీఎం రేవంత్‌రెడ్డి కోర్టు తీర్పు విషయం గురించి మాట్లాడలేదని, కేవలం ఫిరాయింపుల విషయంలో మాత్రమే గతంలో మాదిరిగానే వ్యవహారిస్తామని అన్నారని వివరణ ఇచ్చారు. ఉపఎన్నికలు వస్తాయని బయట బీఆర్‌ఎస్ నాయకులు చేస్తున్న బెదిరింపులపైనే సీఎం స్పందించారని మంత్రి శ్రీధర్‌బాబు క్లారిటీ ఇచ్చారు.

ఇదే అంశంపై మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ.. పార్లమెంట్‌లో ఇలాంటి అంశంపై చర్చ జరుగుతోందని, జ్యుడీషియరీపై మాట్లాడే హక్కు పార్లమెంట్‌కు ఉంటుందన్నారు. మంత్రుల వివరణతో సంతృప్తి చెందని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు కొద్దిసేపు నిరసన వ్యక్తం చేసి సభ నుంచి బయటకు వెళ్లిపోయారు.

అవసరమున్న చోట రేషన్‌షాపులు పెంచుతాం: మంత్రి ఉత్తమ్ 

పట్టణాలు, గ్రా మాల్లో జనాభా ఎక్కువగా ఉన్న చోట ఒకే రేషన్ షాపు ఉండటం వ ల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నా రని తాండూరు ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సమాధానమిచ్చారు. రేషన్‌కార్డులు తక్కువగా ఉన్న చోట రేషన్‌షాపులను పెంచితే రేషన్‌డీలర్లకు  కమీషన్ తక్కువగా వచ్చి ఇబ్బందులు పడుతారన్నారు. ఎక్కువగా జనాభా ఉండి అవసరమున్న చోట కొత్త రేషన్‌షాపులు మంజూరు చేస్తామని మంత్రి తెలిపారు. 

అక్బరుద్దీన్‌పై మంత్రి సీతక్క ఆగ్రహం 

ఎంఐఎం ఎల్పీ నేత అక్బరుద్దీన్‌పై మంత్రి సీతక్క ఆగ్రహం వ్యక్తం చేశారు. శాంతిభద్రతలపై చర్చ సం దర్భంగా అక్బరుద్దీన్ మాట్లాడుతూ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక నేరాలు పెరిగాయని, శాంతిభద్రతలు లేవని, కేసులు ఎక్కువగా పెరిగాయని చెప్పారు. దీంతో మంత్రి సీతక్క జోక్యం చేసుకుని గత ప్రభుత్వంలో శాంతిభద్రతలు సవ్యంగా ఉన్నట్లు..

ఈ పది నెలల్లోనే ఏదో జరిగిపోతున్నట్లు అక్బరుద్దీన్ మాట్లాడటం సరికాదన్నారు. మంత్రి సీతక్క మాట్లాడేది తనకు ఆర్థం కావడంలేదని అక్బరుద్దీన్ వ్యాఖ్యానించారు. అందుకు సీతక్క  బదులిస్తూ ‘నా మాతృభాష తెలుగు..నేను మారుమూల ప్రాంతం, గూడేల్లో పుట్టి పెరిగా..’ అని సమాధానమిచ్చారు.

గత ప్రభుత్వ హయాంలో డ్రగ్స్, గంజాయి, ఇతర మత్తు పదర్థాలు విచ్చలవిడిగా పెరిగిపోవడం వల్లే ఇప్పుడు నేరాలు, మహిళలపై అత్యాచారాలు జరుగుతున్నాయన్నారు. తమ ప్రభుత్వం మాదకద్రవ్యాలను కంట్రోల్ చేస్తుందని, నేరాలు కూడా అదుపులోనే ఉన్నాయన్నారు. ఎక్కడో ఒక చోట కొన్ని జరుగుతున్నాయని, వాటిపై పోలీసులు నిఘా పెంచారని మంత్రి వివరణ ఇచ్చారు.

సభలో ప్రతిపక్షం గొంతు నొక్కే ప్రయత్నం: ఎమ్మెల్యే హరీశ్ రావు 

సుప్రీంకోర్టులో పెండింగులో ఉన్న పార్టీ ఫిరాయింపుల విషయమై నిబంధనలకు విరుద్ధంగా సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడారని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు ఆరోపించారు. బుధవారం అసెంబ్లీ లాబీలో హరీశ్ మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు. శాసనసభలో సీఎం పలికిన వ్యాఖ్యలు అసెంబ్లీ, పార్లమెంటు వ్యవస్థకు పూర్తి విరుద్ధమన్నారు.

కోర్టులో పెండింగులో ఉన్న విషయాలను చట్టసభల్లో మాట్లాడకూడదని కౌల్ అండ్ శకధర్ పార్లమెంటరీ ప్రొసీజర్ బుక్ లో స్పష్టంగా ఉందన్నారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలు తిరిగి వెళ్లిపోతారనే అనుమానం వచ్చిందేమో, అందుకే ఉప ఎన్నికలు రావంటూ అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి మాట్లాడారని విమర్శించారు.

సీఎం చర్య అసెంబ్లీ ప్రివిలేజ్ కిందకే వస్తుందన్నారు. పాయింట్ ఆఫ్ ఆర్డర్ కింద తాను చెప్పే ప్రయత్నం చేయగా మధ్యలో మైక్ కట్ చేసినందుకు నిరసనగా సభ నుంచి వాకౌట్ చేశామన్నారు.