calender_icon.png 11 October, 2024 | 4:59 AM

చరిత్ర ఎలా గుర్తుపెట్టుకుంటుందో?

11-10-2024 02:22:13 AM

అంకితభావంతో దేశానికి సేవలందించా

సీజేఐ జస్టిస్ చంద్రచూడ్

న్యూఢిల్లీ, అక్టోబర్ 10: దేశ అత్యున్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తిగా పూర్తి అంకితభావంతో పనిచేశానని జస్టిస్ డీవై చంద్రచూడ్ చెప్పారు. తన పదవీ కాలాన్ని చరిత్ర ఎలా గుర్తు పెట్టుకుంటుందో అనే భయం, ఉత్కంఠ తనలో ఉన్నాయని తెలిపారు. భారతదేశ సుప్రీం కోర్టు 50వ ప్రధాన న్యాయమూర్తిగా 2020లో పదవి చేపట్టిన చంద్రచూడ్ పదవీకాలం నవంబర్ 10వ తేదీన ముగియనుంది.

భూటాన్‌లోని ‘జిగ్మే సింగ్యే వాంగ్‌చుక్ స్కూల్ ఆఫ్ లా’ మూడో స్నాతకోత్సవంలో బుధవారం జస్టి స్ చంద్రచూడ్ పాల్గొని మాట్లాడారు. ప్రస్త తం నాలో ఎన్నో ప్రశ్నలు తలెత్తుతున్నాయి. జీవితంలో నేను సాధించాల్సినవన్నీ సాధించానా? సీజేఐగా చరిత్ర నా పదవీ కాలాన్ని చరిత్ర ఏవిధంగా గుర్తుపెట్టుకుంటుంది? భవిష్యత్ తరాలకు ఎలాంటి వారసత్వాన్ని అందించబోతున్నాను? తదితర ప్రశ్నలు నా లో తలెత్తుతున్నాయి.. బహుశా కొన్ని ప్రశ్నలకు ఎప్పటికీ సమాధానాలు దొరక్కపోవచ్చేమో అని చంద్రచూడ్ అన్నారు. 

అంకితభావంతో పనిచేశా..

‘గత రెండేళ్లుగా అంకితభావంతో పనిచేశా. న్యాయవాద వృత్తిలో ఎన్నో అవరోధాలు ఎదురవుతాయి. ఒక్కోసారి ఒక అడుగు వెనక్కి వేయాల్సి రావచ్చు. భయపడకుండా ముందుకు సాగండి. ఏదో ఒకరోజు మీరు అనుకున్న లక్ష్యాలను చేరుకుంటారు’ అని చంద్రచూడ్  న్యాయ విద్యార్థులకు సూచించారు. నవంబర్ 9, 2022 లో సీజేఐగా బాధ్యతలు చేపట్టిన చంద్రచూడ్.. ఎలక్ట్రోరల్ బాండ్స్, ఎస్సీ వర్గీకరణ సహా ఎన్నో కీలకమైన తీర్పులు ఇచ్చారు.