calender_icon.png 19 April, 2025 | 8:30 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రైలు పట్టాలు దాటేదెట్లా?

07-04-2025 01:07:08 AM

  1. అసంపూర్తిగా అండర్ డ్రైనేజీ పనులు

ఊరిస్తున్న సబ్ వే నిర్మాణం

మహబూబాబాద్, ఏప్రిల్ 6, (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా కేసముద్రం బల్దియాను రెండుగా చీల్చుతున్న కాజీపేట - విజయవాడ రైల్వే మార్గం పట్టణ ప్రజల రాకపోకలకు తీవ్ర ఆటంకంగా మారింది. కేసముద్రం పట్టణ నడిబొడ్డున రైల్వే ట్రాక్ ఉండడంతో ఇరువైపులా విస్తరించి ఉన్న పట్టణ ప్రజలు అటు ఇటు వెళ్లడానికి పెద్ద కష్టంగా మారింది. గత కొంతకాలం వరకు కేసముద్రం రైల్వే స్టేషన్ సమీపంలో ఉన్న అండర్ డ్రైనేజీ ద్వారా ద్విచక్ర వాహనాలు, పాదాచారులు రైల్వే ట్రాక్ దాటేందుకు అణువుగా ఉండేది.

పట్టణంలో రైల్వే ట్రాక్ దాటడానికి ఫుట్ ఓవర్ బ్రిడ్జి లేకపోవడంతో ఏండ్ల తరబడిగా అండర్ డ్రైనేజీనే రైల్వే ట్రాక్ దాటేందుకు తప్పనిసరి పరిస్థితుల్లో వినియోగించాల్సిన పరిస్థితి ఏర్పడింది. వర్షాకాలంలో వరదలు వచ్చిన సమయంలో ఇబ్బందులు కలగకుండా మహబూబాబాద్ ఎంపీ బలరాం నాయక్, ఎమ్మెల్సీ తక్కల్లపల్లి రవీందర్రావు  నిధులతో అండర్ డ్రైనేజీలో సిమెంటు లైనింగ్, రోడ్డు వేయడంతో ఇంతకాలం పాదాచారులకు, ద్విచక్ర వాహనాల రాకపోకలకు ఇబ్బంది లేకుండా పోయింది.

అయితే ఇటీవల కాజీపేట - విజయవాడ రైల్వే సెక్షన్ లో కొత్తగా మూడో లైన్ నిర్మాణం చేపట్టడంతో ప్రస్తుతం ఉన్న అండర్ డ్రైనేజీ పక్కనే స్లాబ్ కల్వర్టు నిర్మాణం చేపట్టడంతో అండర్ డ్రైనేజీ నుండి రాకపోకలను రైల్వే శాఖ నిలిపివేసింది. ఫలితంగా పాదాచారులు రైల్వే ట్రాక్ దాటేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నిత్యం రైల్వే స్టేషన్లో గూడ్స్ రైళ్లు నిలిచి ఉండడంతో రైల్వే ట్రాక్ దాటడం ప్రాణాంతకంగా మారింది.

ఇక ప్రతి పనికి పట్టణం ఇరువైపులా వెళ్లి రావడానికి వాహనదారులు రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఫ్లై ఓవర్ ద్వారా చుట్టూ తిరిగి రావలసిన పరిస్థితి నెలకొంది. కేసముద్రం రైల్వే స్టేషన్ సమీపంలో రెండు రైల్వే గేట్లను తొలగించి రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణానికి రైల్వే శాఖ అనుమతి ఇచ్చింది. దీనితో దశాబ్ద కాలం క్రితం కొత్తగా ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మించి రెండు గేట్లను తొలగించింది.

అయితే రైల్వే ట్రాక్ దాటడానికి పట్టణ ప్రజలకు ప్రత్యేకంగా ఫుట్ ఓవర్ బ్రిడ్జ్, మూసివేసిన గేటు స్థానంలో తేలికపాటి వాహనాలు వెళ్లడానికి సబ్ వే (ఆర్‌యుబి) నిర్మించాలని ఏళ్ల తరబడిగా పట్టణ ప్రజలు అధికారులను ప్రజాప్రతినిధులను వేడుకుంటున్న ఎవరు పట్టించుకోవడం లేదు. ఈ క్రమంలో మూడో లైన్ నిర్మాణంతో అండర్ డ్రైనేజీ ద్వారా రాకపోకలు నిలిపివేయడంతో పట్టణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి నెలకొంది.

గత కొంతకాలం క్రితం రైల్వే శాఖ సబ్ వే నిర్మాణానికి అనుమతి ఇవ్వడంతో పాటు నిధులు కూడా మంజూరు చేసినట్లు బిజెపి నేతలు ప్రకటించారు. అయితే ఇప్పటివరకు సబ్ వే నిర్మాణానికి అడుగులు ముందుకు పడడం లేదు. మూడో లైన్ నిర్మాణం కారణంగా ప్రస్తుతం రాకపోకలు నిలిపివేసిన అండర్ డ్రైనేజీ పనులను త్వరితగతిన పూర్తిచేస్తే కాస్త పట్టణ ప్రజలకు తాత్కాలిక ఉపశమనంగా ఉంటుంది.

అయితే ఆ పనులు పూర్తి చేయకుండా, సబ్ వే నిర్మాణ పనులు చేపట్టకుండా జాప్యం చేస్తుండడంతో నిత్యం వందల మంది ప్రజలు, రైలు ప్రయాణికులు రైల్వే ట్రాక్ దాటడానికి నరకయాతన పడుతున్నారు. ఇప్పటికైనా రైల్వే శాఖ, ప్రజా ప్రతినిధులు, అధికారులు స్పందించి పాత రైల్వే గేటు ప్రదేశంలో సబ్ వే నిర్మాణ పనులు చేపట్టాలని, అలాగే త్వరితగతిన మూడో లైన్ అండర్ డ్రైనేజీ నిర్మాణ పనులు పూర్తిచేసి ప్రజలకు ఇబ్బందులు తొలగించాలని కోరుతున్నారు.