స్వింగ్ కింగ్ ట్రంప్
- అక్రమ వలసలపై కఠిన వైఖరి
- ద్రవ్యోల్బణంపై నిరసన
అమెరికా 47వ అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ లగ్జరీ లైఫ్‌స్టుల్ బయటికి కనిపించినా వ్యాపార, రాజకీయ జీవితంలో ఎన్నో ఒడుదొడుకులు ఎదుర్కొన్నారు. 90వ దశకంలో దాదాపు దివాళా తీసే దశకు చేరుకున్నారు. కానీ మళ్లీ పుంజుకుని తన వ్యాపారాన్ని వృద్ధి చేసుకున్నారు. 2016లో అధ్యక్ష బాధ్యతలు చేపట్టి 2020 లో ఓటమి తర్వాత ట్రంప్ ఎన్నో కేసులను ఎదుర్కొన్నారు.
క్యాపిటల్ భవనంపై ఆయన మద్దతుదారుల దాడి తర్వాత ట్రంప్ రాజకీయ జీవితంపై అనుమానాలు వ్యక్తమయ్యా యి. కానీ, వాటన్నింటినీ పక్కకునెట్టి సుస్పష్టమైన ఆధిక్యంతో ట్రంప్ రెండోసారి అధ్య క్షుడిగా ఎన్నికయ్యా రు. ఈసారి ట్రంప్ గెలుపునకు ఎన్నో అంశాలు దోహదం చేశాయి.
ప్రస్తుతం అమెరికా ఎదుర్కొంటున్న ద్రవ్యోల్బణం, ఆర్థిక మందగమనం, నిరుద్యోగం, సరిహద్దులో అక్రమ వలసలు, అంతర్జాతీయ యుద్ధాలకు ధన, ఆయుధ సాయం వంటి సమస్యలకు ట్రంప్ పరిష్కారం చూపుతారని అగ్రరాజ్య ఓటర్లు నమ్మారు.
* శ్రామిక శక్తికి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చే డెమోక్రాట్లకు గ్రామీణ, కార్మిక వర్గంతో నుంచి మద్దతు లభించేది. కానీ ఈ ఎన్నికల్లో వీరంతా ట్రంప్‌వైపు మొగ్గుచూ పారు. అమెరికా ఫస్ట్ నినాదంతో స్థానికులకే ఉద్యోగాలని ఆకట్టుకున్నారు.
* చైనా నుంచి దిగుమతులపై 60 శాతం, బ్రెజిల్, భారత్ వంటి దేశాలకు 20 శాతం సుంకాలు విధిస్తామని ట్రంప్ పేర్కొన్నారు. ఇది దేశీయంగా ఉత్పత్తి పెంపుతో పాటు ఉద్యోగావకాశాలు కల్పిస్తుంది.
* అక్రమ వలసలపై ట్రంప్ మొదటి నుంచీ కఠినంగానే వ్యవహరిస్తూ వస్తున్నారు. ఇప్పుడు కూడా చొరబాటుదారులను అస్సలు అంగీకరించేది లేదని, ఇప్పటికే దేశంలో అక్రమంగా ఉంటున్న లక్షలాది మందిని తరిమేస్తానని హామీ ఇచ్చారు. ఇది కౌంటీలతో పాటు యువతలో ఉత్సాహం నింపింది.
* డ్రగ్ సంబంధిత నేరాలు, విక్రయాలను అరికట్టేందుకు డ్రగ్ డీలర్లకు మరణశిక్ష విధించేందుకు ట్రంప్ మద్దతు తెలపడంతో కొన్ని వర్గాలు రిపబ్లికన్లకు మద్దతు ఇచ్చాయి.
* అంతర్జాతీయ యుద్ధాలకు ట్రంప్ దూరంగానే ఉంటారనే అంశం సైతం ఆయనకు దోహదం చేసింది. ప్రస్తుతం ఇజ్రాయెల్ రష్యా ఉద్రిక్తతల్లో అమెరికా ఆయుధ సరఫరాను ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. ట్రంప్ వస్తే ఈ విధానంలో మార్పు వస్తుందని అక్కడి ప్రజలు భావిస్తున్నారు.
* అగ్రరాజ్యంలో ద్రవ్యోల్బణం రెండంకెల సంఖ్యకు చేరుకుంది. ఈ విషయంలో ట్రంప్ విధానాలు అనుకూలిస్తాయని విశ్లేషకులు చెబుతున్నారు.
* రెండుసార్లు ట్రంప్‌పై హత్యాయత్నం జరగడం కూడా సానుభూతి ఓట్లకు కారణమైందనే విశ్లేషణలు ఉన్నాయి.
* ట్రంప్ గెలుపులో అతిపెద్ద పాత్ర స్వింగ్ స్టేట్లదే. దాదాపు అన్ని స్వింగ్ స్టేట్లలో ట్రంప్ సత్తా చాటారు.
ట్రంప్‌పై కేసుల మాటేమిటి?
వాషింగ్టన్, నవంబర్ 7: డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధ్యక్ష బాధ్యతలు చేపడుతున్న నేపథ్యంలో ఆసక్తికర చర్చ ప్రారంభమైంది. 2020లో ఓటమి తర్వాత ట్రంప్ అనేక కేసుల్లో నేరారోప ణలు ఎదుర్కొన్నారు. ఆయనపై సివిల్, క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. ఈ ట్రంప్ ఏం చేస్తారన్నది ఆసక్తికరంగా మారింది.
అధ్యక్షుడిగా తన విచక్షణాధికారాలు ఉపయోగించి తనకు తాను క్షమాభిక్ష ఇచ్చుకుని ఫెడరల్ కేసుల్లోంచి బయటపడే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయితే పోర్న్‌స్టార్‌కు డబ్బులిచ్చిన కేసు, 2020 ఎన్నికల్లో జార్జియా ఫలితాన్ని మార్చడానికి ప్రయత్నించారన్న కేసులో ఎటువంటి అధికారాలు పని చేయవట.
ఈ రెండు కేసులు ముగింపు దశకు చేరు కున్నాయి. న్యాయస్థానం ఈ నెల 26న శిక్ష ఖరారు చేయాల్సి ఉంది. కానీ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో కోర్టు తీర్పును వాయిదా వేయించేందుకు ట్రంప్ తర ఫు లాయర్లు గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఒకవేళ లాయర్ల ప్రయత్నాలు ఫలించకపోయినా కోర్టు స్వల్ప శిక్షతోనే సరిపెట్టే అవకాశాలు ఉన్నాయి.
కాటేసిన ధరలు!
- ఆర్థిక విధానాలపై అపనమ్మకం
- శ్రామికవర్గం దూరం
అమెరికా అధ్యక్ష రేసులోకి వచ్చినప్పటి నుంచి డెమోక్రటిక్ అభ్యర్థి కమలాహ్యారిస్.. ట్రంప్ కన్నా ముందంజలో ఉన్నారు. ట్రంప్‌తో డిబేట్‌లోనూ కమల సత్తా చాటారు. సర్వేలు కూడా కమలవైపే ఉన్నాయి. కానీ అనూహ్యంగా ఎన్నికల్లో మాత్రం కమల ఓడిపోయారు. పాపులర్ ఓట్లలోనూ ఆధిక్యం కనిపించలేదు. ట్రంప్‌ది ఏకపక్ష విజయమే అయింది. ట్రంప్‌ను నిరోధించడంలో కమల ఐదు రకాలుగా విఫలమైనట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.
* 30 ఏళ్ల తర్వాత బైడెన్-హ్యారిస్ ప్రభుత్వంలో ద్రవ్యోల్బణం భారీగా పెరిగింది. కొవిడ్ మహమ్మారితో ప్రపంచవ్యాప్తం గా దాదాపు ఇదే పరిస్థితి నెలకొన్నా అమెరికా డాలరుకు ఉన్న ప్రత్యేకతలను డెమోక్రాట్లు వినియోగించుకోలేక పో యారనే ఆరోపణలు ఉన్నాయి. దీంతో కమల ఆర్థిక విధానాలపై ఓటర్లలో నమ్మకం సన్నగిల్లింది. గ్రాసరీ, గ్యాస్, విద్యుత్ ధరలు భారీగా పెరగడంతో డెమోక్రాట్లపై భారీ ప్రభావం చూపింది.
* ట్రంప్ విజయంలో కీలక పాత్ర పోషించిన అంశం ఇమ్మిగ్రేషన్. కమల వైఫల్యంలోనూ ఇది కూడా ప్రధాన అంశం. బైడెన్ పాలనలో భారీ స్థాయిలో అక్రమ వలసలు వచ్చినట్లు అమెరికా డాటా పేర్కొంటుంది. ఇటీవల బైడెన్ ఉత్తర్వులతో చొరబాట్లు తగ్గినప్పటికీ గతేడాది మాత్రం రికార్డు స్థాయిలో దేశం లోని అక్రమ వలసలు వచ్చాయి. దీని రిపబ్లికన్లు అస్త్రంగా వాడుకున్నారు. అక్రమంగా అమెరికాలో ఉంటున్నవారిని బహిష్కరిస్తామని హామీ ఇచ్చారు.
* డెమోక్రాట్లకు 80 శాతానికిపైగా నల్లజాతి, హిస్పానిక్, ఆసియా ప్రజల మద్ద తు ఉంటుంది. అయితే వీరిలో ఎక్కువమంది శ్రామిక వర్గానికి చెందినవారే. ఈసారి ట్రంప్ హామీలతో ఈ వర్గాలన్నీ ట్రంప్‌వైపు మొగ్గు చూపాయి. అబార్షన్ అంశం కీలక అంశమైనప్పటికీ మహిళలను, యువతను కమల ఆకట్టుకోలేకపో యిందనే విశ్లేషణలు కూడా వస్తున్నాయి.
* వీటన్నింటితో పాటు కమల ప్రచారంలోకి ఆలస్యంగా అడుగుపెట్టారు. ఎన్నికలకు కేవలం 105 రోజుల ముందే ఆమెను అధ్యక్ష అభ్యర్థిగా ఎన్నుకున్నారు. దీంతో ట్రంప్‌తో పోలిస్తే కమల ప్రచారంలో వెనుకబడ్డారు. అంతేకాకుండా ఇంతతక్కువ కాలంలో తనేంటో ప్రజలకు కమల నిరూపించుకోలేపోయారన్నది వాస్తవం.
ఈ ఫలితాన్ని ఊహించలేదు
వాషింగ్టన్, నవంబర్ 6: అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు తనకు వ్యతిరేకంగా వస్తాయని తాను ఆశించలేదని డెమోక్రటిక్ అభ్యర్థి కమలాహ్యారిస్ అన్నారు. ఓటమి చెందిన మాత్రానా తన పోరాటాన్ని ఆపేది లేదని ఆమె స్పష్టం చేశారు. ఓటమి చెందిన అనంతరం వాషింగ్టన్ డీసీలోని హోవర్డ్ యూనివర్సిటీలో తన మద్దతుదారులను ఉద్దేశించి మాట్లాడారు.
దేశం కోసం చేసే పోరాటం ఎప్పుడూ విలువైనదేనని, స్వేచ్ఛ కోసం శ్రమించాల్సి ఉంటుందని అన్నారు. ఫలితం ఎలా ఉన్నా దాన్ని అంగీకరించాల్సిందేనని పేర్కొన్నారు. మనం చేసిన పోరాటంపై గర్వంగా ఉందని అన్నారు.
దేశంపై ప్రేమ, సంకల్పం, తనపై ఉంచిన నమ్మకంతో తన గుండె నిండిపోయిందని భావోద్వేగంతో చెప్పారు. గెలవకపోయినా స్వేచ్ఛ, న్యాయం, అవకాశాలు, గౌరవం, చట్టబద్ధ పాలన, సమాన న్యాయం కోసం పోరాడుతానని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ట్రంప్‌కు శుభాకాంక్షలు చెప్పినట్లు తెలిపారు.