- 2014కు ముందు కల్వకుంట్ల కుటుంబ ఆస్తులు ఎన్ని?
పదేళ్లలో అందినకాడికి దోచుకున్నారు: కడియం
జనగామ, జనవరి 2(విజయక్రాంతి): పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో కల్వకుంట కుటుంబం అందినకాడికి దోచుకుందని స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఆరోపించారు. 2014కు ముందు వాళ్ల ఆస్తులెంత.. ఇప్పుడెంతనో చెప్పే ధైర్యం ఉందా అని ప్రశ్నించారు. గురువారం చిలుపూరు మండలం మల్కాపూర్‌లో ఆయన పర్యటించి ప్రజలతో ముఖాముఖి నిర్వహిం చారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కేసీఆర్ కుటుంబం చేసిన అవినీతి వల్లే ప్రస్తుతం అనేక కేసుల్లో ఇరుక్కుంటోందన్నారు. వందలాది ఎకరాలను వెనకేసుకొని రాష్ట్రాన్ని మాత్రం అప్పులకుప్ప చేశారని మండిపడ్డారు. అవినీతికి పాల్పడినవారు, ధరణిని దుర్వినియోగం చేసిన వారు, దళితబంధులో కమీషన్లు తీసుకున్న వారు తనపై విమర్శలు చేస్తూ నీతులు బోధించడం విడ్డూరంగా ఉందన్నారు.
ఎవరెన్ని విమర్శలు చేసినా తాను మాత్రం స్టేషన్‌ఘన్‌పూర్ అభివృద్ధిపైనే దృష్టి సారిస్తానన్నారు. వచ్చే వానకాలంలో మల్లన్నగండి రిజర్వాయర్ నుంచి మల్కాపూర్‌కు గోదావరి జలాలు తీసుకొస్తానని కడియం హామీ ఇచ్చారు. ఎలాంటి అక్రమాలకు తావు లేకుండా అసలైన లబ్ధిదారులకే ఇందిరమ్మ ఇండ్లు వచ్చేలా కృషి చేస్తానన్నారు. కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.