calender_icon.png 26 December, 2024 | 3:30 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పార్టీలోకి డ్రగ్స్ ఎలా వచ్చాయి?

07-11-2024 12:58:57 AM

  1. జన్వాడ ఫామ్‌హౌస్ పార్టీ కేసులో విజయ్ మద్దూరిని విచారించిన పోలీసులు
  2. పలు కోణాల్లో ఆరా.. స్టేట్‌మెంట్ రికార్డు 

చేవెళ్ల, నవంబర్ 6: రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి మండలంలోని జన్వాడ ఫామ్‌హౌస్ పార్టీ కేసు దర్యాప్తును పోలీసులు వేగవంతం చేశారు. ఈ కేసులో ఏ1గా ఉన్న కేటీఆర్ బామమరిది రాజ్ పాకాలను ఇప్పటికే విచారించిన మోకిలా పోలీసులు.. ఏ2గా ఉన్న రాజ్ పాకాల స్నేహితుడు విజయ్ మద్దూరిని బుధవారం విచారించారు.

తన న్యాయవాదితో కలిసి ఉదయం 10.30 గంటల సమయంలో పోలీసు స్టేషన్‌కు వచ్చిన విజయ్‌ని నార్సింగి ఏసీపీ రమణగౌడ్, సీఐ వీరబాబు, ఎస్సై కోటేశ్వర్‌రావు మధ్యాహ్నం 1.30 వరకు విచారించినట్లు తెలిసింది. పార్టీలోకి డ్రగ్స్ ఎక్కడి నుంచి వచ్చాయి.. ఎవరు సప్లు చేశారు..  పెడ్లర్లతో ఏమైనా సంబంధాలు ఉన్నాయా.. డ్రగ్స్ తీసుకోవడం ఎప్పటి నుంచి అలవాటు ఉంది.. పార్టీలో ఇంకెవరైనా తీసుకున్నారా? అనే కోణంలో ఆరాతీసినట్లు సమాచారం

30వ తేదీనే హాజరు కావాల్సి ఉన్నా.. 

గత నెల 26న రాత్రి స్థానికుల ఫిర్యాదు మేరకు పోలీసులు జన్వాడ ఫామ్‌హౌస్‌లో జరిగిన పార్టీ వ్యవహారాన్ని బట్టబయలు చేసిన విషయం తెలిసిందే. విజయ్ మద్దూరి డ్రగ్స్ తీసుకున్నట్టు నిర్ధారణ కావడంతో ఎన్డీపీఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. అంతేకాకుండా పార్టీలో పాల్గొన్న వారందరికీ నోటీసులు జారీ చేశారు.

అక్టోబర్ 30న ఏ1, ఏ2ను మోకిలా పీఎస్‌లో విచారణకు రావాల్సిందిగా నోటీసుల్లో పేర్కొన్నారు. ఆ సమయంలో రాజ్ పాకాల హాజరైనప్పటికీ.. అనారోగ్య సమస్యలతో ఆసుపత్రిలో ఉన్నందున తాను రాలేకపోతున్నానని విజయ్ తన లాయర్ల ద్వారా పోలీసులకు తెలిపారు.

ఆ తర్వాత నవంబర్ 1వ తేదీన చేవెళ్ల ఎక్సైజ్ పోలీసు స్టేషన్‌లో జరిగిన ఎంక్వైరీకి కూడా ఆయన హాజరు కాలేదు. విజయ్ ఈ కేసు విషయంలో కోర్టుకు వెళ్లగా.. ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్‌కు సహకరించాలని సూచించడంతో బుధవారం విచారణకు హాజరైనట్లు పోలీసులు చెప్పారు.