calender_icon.png 18 October, 2024 | 10:02 AM

వేళలు పాటించకుండా ప్రయాణికులు లేరంటే ఎలా?

18-10-2024 12:35:40 AM

  1. ఎంఎంటీఎస్ రైళ్ల సమయపాలన పాటించండి
  2. జంట నగరాల రైల్వే ప్రయాణికుల సమావేశంలో ప్రస్తావన

హైదరాబాద్, అక్టోబర్ 17 (విజయక్రాంతి): వేళాపాళా లేకుండా రైళ్లు తిప్పుతూ ప్రయాణికుల సంఖ్య తగ్గిపోతుందంటే ఎలా అని జంట నగరాలకు చెందిన రైల్వే ప్రయాణికుల అసోసియేషన్లు అధికారులను ప్రశ్నించాయి. ఒకప్పుడు ఎంతో గొప్పగా ప్రయాణికులకు సేవలందించిన ఎంఎంటీఎస్ రైళ్లు ఇప్పుడు అధ్వానంగా మారిపోయాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు.

గురువారం సికింద్రాబాద్, హైదరాబాద్ రైల్వే డివిజన్ల పరిధిలోని రైల్వే ప్రయాణికుల అసోసియేషన్లతో సికింద్రాబాద్ డివిజనల్ కార్యాలయం నిర్వహించిన సమావేశంలో రైల్వేశాఖ తీరుపై అసోసియేషన్లు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాయి.

ఎంఎంటీఎస్ రైల్వే సేవలను మరింత మెరుగుపరిచే దిశలో భాగంగా తీసుకోవాల్సిన చర్యలపై ప్రయాణికుల అసోసియేషన్లతో డివిజనల్ రైల్వే మేనేజర్లు చర్చించి సలహాలు తీసుకున్నారు.

సమయపాలన పాటించడంతో పాటు మేడ్చల్ వైపు నుంచి వచ్చే ఎంఎంటీఎస్ రైళ్లను సికింద్రాబాద్‌లో ఎంఎంటీఎస్ రైళ్లకు ప్లాట్‌ఫాం దొరకని పరిస్థితి ఉన్నందున సీతాఫల్‌మండి వరకే నడపాలని అక్కడి నుంచి ఫలక్‌నుమా నుంచి సికింద్రాబాద్ మీదుగా వెళ్లే ఎంఎంటీఎస్ రైళ్లలో ప్రయాణించేందుకు అవకాశం ఉంటుందని పలువురు అధికారులకు తెలిపారు.

ఎంఎంటీఎస్ రైళ్లలో ప్రయాణికుల సంఖ్య పెరిగేందుకు కచ్చితమైన సమయపాలన పాటించాలని, గతంలో ఉన్న హైలైట్స్ యాప్‌ను తిరిగి తీసుకురావాలని కోరారు. ప్రస్తుతం కొత్తగా వేసిన సనత్‌నగర్ కొత్త లైన్ ప్రారంభించినా ఒక్కగానొక్క రైలు తిప్పితే ఏం లాభమని, వేళాపాళా లేకుండా తిప్పడంతో ప్రయాణికులు ఎక్కడం లేదన్నారు.

ఈ మార్గంలో రైళ్ల సంఖ్య పెంచి సమయపాలన పాటించాలన్నారు. సేవల పొడిగిం పు మొదలైన అంశాల గురించి సూచనలు అందించారు. కొత్త స్టాపేజ్‌లు, వివిధ మార్గాల్లో ఎంఎంటీఎస్ రైళ్ల పునరుద్ధరణకు సంబంధించిన అంశాలపై డివిజనల్ రైల్వే మేనేజర్లకు విన్నవించారు.

సభ్యులు అందించిన సలహాలన్నింటినీ సానుకూలంగా తీసుకుని, ప్రజలకు అత్యుత్తమ సేవలు అందించేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని డీఆర్‌ఎంలు హామీ ఇచ్చారు. అయితే దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ ఎంఎంటీఎస్ సేవల సమయపాలన అంశంలో ప్రత్యేకంగా దృష్టి సారించేందుకే ఈ సమావేశం ఏర్పాటు చేసినట్లు సమాచారం. సికింద్రాబాద్ డీఆర్‌ఎం భరతేశ్ కుమార్ జైన్, హైదరాబాద్ డీఆర్‌ఎం లోకేశ్ విష్ణోయ్ జంట నగరాలకు చెందిన వివిధ ప్రయాణికుల సంఘాలు ఈ సమావేశంలో పాల్గొన్నాయి.