- కులగణన సర్వేలో బీసీ జనాభా తగ్గడంపై బీసీ సంఘాల ఆగ్రహం
- 2014 సమగ్ర సర్వేలో రూ.1,85కోట్లు
- 2024 కులగణనలో 1.64 కోట్లు..
- ఓసీలు 15లక్షలు పెరిగి.. బీసీలు తగ్గడమేంటి?
- ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్‌ను కాపాడుకోవడానికే ఓసీ కోటా పెంపు: ఇంటలెక్చువల్ ఫోరం
హైదరాబాద్, ఫిబ్రవరి 3 (విజయక్రాంతి): ప్రభుత్వం ప్రకటించిన బీసీ కులగ ణన వివరాలు గందరగోళంగా మారాయి. బీసీలకు రాజకీయ, ఆర్థిక, సామాజికంగా చేయూతనందించేందుకు ఈ సర్వేను చేసినట్లు ప్రభుత్వం ప్రకటించింది. కానీ సర్కా రు వెల్లడించిన సర్వే ఫలితాలు బీసీలకు తీవ్రమైన అన్యాయం, నష్టం చేకూర్చే విధంగా ఉన్నట్లు బీసీ సంఘాలు మండిపడుతున్నాయి.
2014లో కేసీఆర్ ప్రభుత్వం చేసిన సమగ్ర సర్వేలో 51శాతం ఉన్న బీసీలు(ముస్లింలు కాకుండా).. 2024లో కాం గ్రెస్ సర్కార్ నిర్వహించిన కులగణనలో 46.25శాతానికి తగ్గడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
దీని ప్రకారం 21,52,677 మంది తగ్గారని, పదేళ్లలోనే బీసీలు ఇంతమంది ఎలా తగ్గుతారన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ఇదే పదేళ్లలో ఓసీలు ఏకంగా 15లక్షల మంది పెరిగారు. బీసీలు తగ్గడం ఏంటి? ఓసీలు పెరగడం ఏంటి? దీని వెనుక ఉన్న మతలబు ఏంటి? అని బీసీ సంఘాలు నిలదీస్తున్నాయి.
పెరగాల్సిన జనాభా తగ్గుతారా?
జనాభా లెక్కల ప్రకారం.. ఏడాదికి సగటు ఒకశాతం జనాభా పెరుగుతుందని అంచనా. ఈ లెక్కన 2014లో రాష్ట్రంలో 3.63కోట్లు మంది జనాభా ఉన్నట్లు తేల్చారు. 2024నాటికి ఏటా నాలుగు లక్షల చొప్పున పెరిగి దాదా పు 4.02కోట్లకు చేరుకోవాలి. కానీ అనూహ్యంగా జనా భా తగ్గింది. కులగణన సర్వేలో మొత్తం జనాభా 3.7కోట్లుగా ప్రభుత్వం ప్రకటించింది. అంటే దాదాపు 35 లక్షలకు పైగా జనాభా లోటు కనిపిస్తోంది. ఈ జనాభా తగ్గడంపై బీసీ సంఘాల అనుమానం వ్యక్తం చేస్తున్నా యి. ఒక కులం జనాభా భారీగా తగ్గి, మరో కులం జనా భా భారీగా పెరగడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
5న బీసీ సంఘాల సమావేశం
కులగణన సర్వేపై తీవ్రమైన అసహనం వ్యక్తం చేసిన బీసీ సంఘాలు ప్రభుత్వం తీరును తప్పుపడుతున్నాయి. మంగళవారం సర్వే రిపోర్టును చెత్తబుట్టలో వేసి నిరసన తెలపాలని నిర్ణయం తీసుకున్నాయి. సర్వేకు నిరసనగా 5వ తేదీన బీసీ సంఘాలు, మేధావులు సమావేశమయ్యేందుకు సిద్ధమవుతున్నారు. మంగళవారం అసెంబ్లీ లో చర్చను బట్టి ఈ సమావేశంలో కార్యచరణ ప్రకటించనున్నారు.
ఈడబ్ల్యూఎస్ ప్రయోజనం కోసమే: బీసీ ఇంటలెక్చువల్ ఫోరం
కులగణనలో ఓసీ జనాభా 15.89లక్షలు పెరిగింది. అదే క్రమంలో బీసీల జనాభా తగ్గింది. ఈడబ్ల్యూఎస్ ప్రయోజనాలను కాపాడుకోవడం కోసమే ఇలా చేశారని అర్థమవు తోంది. లేకుంటే ఇది డేటా ఎంట్రీ సమస్య కావొచ్చు. బీసీల ప్రయోజనాల దృష్ట్యా డేటాను ప్రభుత్వం సరిచేయాలి.
సర్వే రిపోర్టు తప్పుల తడక
కులగణన రిపోర్టు తప్పుల తడకగా ఉంది. బీసీల లెక్కను తక్కువ చేసి, అగ్రకులాల జనాభాను ఎక్కువ చేసి చూపించారు. ఇది బీసీలకు అన్యాయం చేయడంతోపాటు అవమానించడమే. కులగణన పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసింది. ఇది బీసీ వ్యతిరేక ప్రభుత్వం. సమగ్ర కుల రిపోర్టును ప్రజల ముం దు పెట్టాలి. కులగణన సర్వేపై ప్రభుత్వం పునఃసమీక్షించాలి. లేకుంటే కాంగ్రెస్‌కు ఇవే చివరి ఎన్నికలు. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను కాపాడుకోవడం కోసం లేని జనాభాను చూపిస్తున్నారు. బీసీ సబ్ కమిటీలో భట్టి, పొన్నం ఉండాలి. కానీ ఉత్తమ్‌కుమార్ రెడ్డి ఎలా ఉంటారు?
జాజుల శ్రీనివాస్‌గౌడ్,
బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు