- పోలీసులను ప్రశ్నించిన హైకోర్టు
- ‘పట్నం’ పిటిషన్‌పై తీర్పు వాయిదా
హైదరాబాద్, నవంబర్ 25 (విజయక్రాంతి): లగచర్ల ఘటనకు సంబంధించి మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డిపై నమోదైన కేసుల్లో కేవలం తేదీలు మార్చడం తప్ప, అందులోని విషయం మాత్రం ఒక్కటే ఉందని హైకోర్టు వ్యాఖ్యానించింది. పోలీసు స్టేషన్లో రైటర్ కాపీ కొట్టినా కాస్త అవగాహన ఉండాల్సి ఉందని అన్నది.
ఎమ్మార్వో, డీఎస్పీ వంటి ఉన్నత అధికారులు ఫిర్యాదు ఇచ్చినపుడు వారే విషయాన్ని రైటర్‌కు వదిలిపెట్టకుండా రాసి ఇచ్చి ఉండవచ్చంది. ఏ నిబంధన కింద బహుళ ఎఫ్‌ఐఆర్లు నమోదు చేశారని పోలీసులను ప్రశ్నించింది. ఒకే ఘటనకు సంబంధించి బహుళ ఎఫ్‌ఐఆర్లు నమోదు చేయడాన్ని సవాల్ చేస్తూ బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు తీర్పు వాయిదావేసింది.
నరేందర్‌రెడ్డి పిటిషన్‌పై సోమవారం జస్టిస్ కే లక్ష్మణ్ విచారణ చేపట్టారు. పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. తేదీలు మార్చి ఇచ్చిన ఫిర్యాదుపై వేర్వేరు కేసులు నమోదు చేశారన్నారు. రాజకీయ దురుద్దేశాలతో పిటిషనర్‌ను బయటికి రాకుండా చేయాలన్న లక్ష్యంతో ఇలా కేసుల మీద కేసులు నమోదు చేస్తున్నారని ఆరోపించారు.
ప్రభుత్వం తరఫున అదనపు అడ్వొకేట్ జనరల్ తేరా రజనీకాంత్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. మొదట నమోదు చేసిన కేసు మీద పట్నం నరేందర్‌రెడ్డిని అరెస్ట్ చేసినప్పటికీ మిగిలిన రెండు ఫిర్యాదులు కూడా అదే అంశాలతో కావడంతో మొదటి ఎఫ్‌ఐఆర్‌తోనే కలిపి వేసినట్లు తెలిపారు. ఇరుపక్షాల వాదనలు పూర్తికావడంతో తీర్పును వాయిదా వేశారు.
మరో కేసులో బెయిలివ్వండి
పోలీసులు నమోదు చేసిన ఒక కేసులో బెయిలు మంజూరు చేయాలంటూ ఇప్పటికే రిమాండ్‌లో ఉన్న పట్నం నరేందర్‌రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. రాజకీయ కక్షతో ఎఫ్‌ఐఆర్ 153లో తనను అరెస్ట్ చేసి రిమాండ్‌లో ఉంచారని తెలిపారు. ఎలాంటి కారణాలు లేకుండా నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్ 154లో బెయిలు మంజూరు చేయాలని కోరారు.