calender_icon.png 5 November, 2024 | 4:03 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మార్గదర్శిపై మాట్లాడొద్దంటే ఎట్లా?

05-11-2024 01:55:43 AM

వినతిని తోసిపుచ్చిన హైకోర్టు

హైదరాబాద్, నవంబర్ 4 (విజయక్రాంతి): తమపై మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్, ఇతరులు మీడియాలో మాట్లాడకుండా గాగ్ ఆర్డర్ ఇవ్వాలంటూ మార్గదర్శి ఫైనాన్సియర్స్ చేసిన వినతిని తెలంగాణ హైకోర్టు తోసిపుచ్చింది.

తమ సంస్థకు సంబంధించి ఎలాంటి సమాచారం మీడియాకు వెల్లడించకుండా ఆదేశించాలని మార్గదర్శి తరఫున సీనియర్ న్యాయవాది సిద్దార్థ లూథ్రా చేసిన విజ్ఞప్తిని తిరస్కరించింది. విచారణ చేపట్టకుండానే ఆ విధమైన ఉత్తర్వులు ఎలా ఇవ్వగలమని ప్రశ్నించింది. మరోవైపు లూథ్రా తీరుపై ఉండవల్లి అసహనం వ్యక్తం చేశారు.

సుప్రీంకోర్టు సూచన మేరకు తాను హైకోర్టుకు కేసు విచారణలో సహకారం అందిస్తున్నానని, వాది, ప్రతివాది తరఫున న్యాయవాదిని కాదనే విష యాన్ని లూథ్రా గుర్తుంచుకోవాలని హితవు పలికారు. తాను మీడియాతో మాట్లాడి సుమారు ముడ్నెల్లు అయ్యిందన్నారు. ఉండవల్లి వాదనలను పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు, మార్గదర్శి కోరిన మేరకు గాగ్ ఆర్డర్ ఇచ్చేందుకు నిరాకరించింది.

తదుపరి విచారణను ఈ నెల 7కు వాయిదా వేసింది. నిబంధలను ఉల్లంఘించినందుకు మార్గదర్శి, దాని కర్త రామోజీరావుపై డిపాజిటర్ల పరిరక్షణ చట్టం కింద చర్యలు తీసుకోవాలని కోరుతూ ఈ కేసులో అధీకృత నాంపల్లి కోర్టులో దాఖలు చేసిన ఫిర్యాదును కొట్టివేస్తూ ఉమ్మడి హైకోర్టు 2018 డిసెంబర్ 31న తీర్పు వెలువరించింది. దీనిని ఉండవల్లి, నాటి ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాలు చేశాయి.

ఆ తీర్పులోని కొంత భాగంపై రామోజీరావు సైతం అభ్యంతరం చెబుతూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు తీర్పును గత ఏప్రిల్ 9న కొట్టివేసిన సుప్రీంకోర్టు, డిపాజిట్ల సేకరణకు సంబంధించిన వాస్తవాలను నిగ్గు తేల్చాలని ఆదేశించింది. ఉండవల్లి, ఏపీ ప్రభుత్వ వాదనలు వినాలని హైకోర్టుకు స్పష్టం చేసింది. దీంతో ఈ వ్యవహారంపై హైకోర్టు ధర్మాసనం సోమవారం మరోసారి విచారణ జరిపింది. 

రెండు వారాల్లో మారుస్తాం

సర్టిఫికెట్‌లో పేరు మార్పుపై హైకోర్టుకు ప్రభుత్వం వివరణ

హైదరాబాద్, నవంబర్ 4 (విజయక్రాంతి): గెజిట్ నోటిఫికేషన్‌కు అనుగు ణంగా సర్టిఫికెట్‌లో పేరు మార్పునకు చర్యలు తీసుకుంటామని హైకోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం తెలియజేసింది. నోటిఫికేషన్ మేరకు పిటిషనర్ పేరును రెండు వారాల్లో మార్పు చేసి కొత్త సర్టిఫికెట్ జారీ చేస్తామని సెకండరీ ఎడ్యుకేషన్ బోర్డు చెప్పింది.

పిటిషనర్ విజ్ఞప్తిని ప్రభుత్వం ఆమోదించిన నేపథ్యంలో విచారణను ముగిస్తున్నట్లు హైకోర్టు సీజే జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ జె శ్రీనివాస్‌రావు ధర్మాసనం తెలిపింది. తన పేరు మార్చుకున్నట్టు గెజిట్ జారీ అయినప్పటికీ ఎస్‌ఎస్సీ, ఇంటర్ బోర్డు, ఉస్మానియా యూనివర్సిటీ సర్టిఫికెట్లలో పేరు మార్చలేదంటూ రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్‌కు చెందిన వీ మధుసూదన్‌రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు.

సర్టిఫికెట్లలో పేరు మార్పు చేయకపోవడం 1961లో జారీ చేసిన జీవో 1263లోని సెక్షన్ రూల్ 1, 2, 3 చట్టవిరుద్ధమని పిటిషనర్ న్యాయవాది అరవింద్ వాదించారు. ప్రాథమిక హక్కుల ఉల్లంఘన కూడా అవుతుందన్నారు. గెజిట్ నోటిఫికేషన్‌కు అనుగుణంగా సర్టిఫికెట్లలోనూ పేరు మార్పునకు రెండు వారాల సమయం కావాలని  ప్రభుత్వం తరఫున స్పెషల్ జీపీ ఎస్ రాహుల్‌రెడ్డి కోరారు.

ఇదే కేసుపై గతంలో విచారణ జరిపిన హైకోర్టు విద్యార్థుల పేరు మార్పునకు గెజిట్ నోటిఫికేషన్ వెలువడ్డాక కూడా సర్టిఫికెట్లలో మార్పు చేయడానికి ఇబ్బందే ంటని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. విద్యార్థులను ఇబ్బందులు, వేధింపులకు గురిచేయకుండా వెంటనే సర్టిఫికెట్లల్లో కూడా పేరు మార్పునకు చర్యలు తీసుకోవాలంది.

ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకుంటే ఆధార్ కార్డులో ఒక పేరు, సర్టిఫికెట్లపై మరో పేరు ఉంటుంది కదా, గెజిట్ అప్లోడ్              చేసే సౌకర్యం ఉండదు కదాని కూడా ప్రశ్నించింది.