calender_icon.png 18 November, 2024 | 4:58 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అడుసు తొక్కి, కాళ్లు కడిగితే ఎలా?

28-07-2024 12:05:00 AM

‘సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియా’గా సాఫ్ట్‌వేర్ రంగంలో దేశంలోనే అగ్రస్థానంలో ఉన్న బెంగళూరు అభివృద్ధిలో దూసుకుపోయింది. ఫలితంగా రేయింబవళ్ళు ఈ నగరం మెలకువతో సందడిగా ఉంటుంది. ట్రాన్స్‌పోర్ట్ తదితర వ్యాపారాలు, రేయింబవళ్ల లావాదేవీలతో ఎందరికో ఉపాధి కలుగుతున్నది. ఒక రకంగా అన్ని విధాల అభివృద్ధి చెందిన నగరం బెంగళూరు. అయితే, కర్ణాటకలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం, దాని నేత సిద్ధరామయ్య సిద్ధాన్నాన్ని కాలదన్నుకునే అనాలోచిత నిర్ణయం ఒకటి తీసుకుని రాష్ట్రానికి తీరని నష్టం కలిగించారని చెప్పాలి. అదే, ఇటీవల తన కేబినెట్ సమావేశంలో ‘ప్రైవేటు రంగంలో కన్నడ వారికే ఉద్యోగాలు ఇవ్వాలంటూ తీర్మానాన్ని ఆమోదించటం’. ఈ నిర్ణయంతో ‘నేషనల్ సాఫ్ట్‌వేర్ అండ్ సర్వీసెస్ కంపెనీ’ (నాస్కామ్) ఆందోళన చెందింది. దీనివల్ల సాఫ్ట్‌వేర్ రంగంలో అర్హులైన నిపుణుల కొరత ఏర్పడుతుందని, వెంటనే దీనిని ఉపసంహరించుకోవాలని ‘నాస్కామ్’ కోరింది. 

బెంగళూరుతోపాటు వివిధ నగరాల్లో సుమారు 67 వేల ఐటి కంపెనీలు నమోదై ఉన్నాయి. ఒక్క బెంగళూరులోనే 15 లక్షలమందికి పైగా దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన ఐటీ ఉద్యోగులు పనిచేస్తున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. వీరిలో సుమారు 25 శాతం తెలుగు రాష్ట్రాలకు చెందినవారు కాగా, మిగిలిన వారు దేశంలోని ఇతర ప్రాంతాలకు చెందిన టెక్కీలు. కోవిడ్ సమయంలోనూ, అనంతరం ఏర్పడిన ఆర్థిక మాంద్యం నేటికీ ఈ నగరాన్ని వేధిస్తున్నది. ఇలాంటి సమయంలో బయటివారికి కాకుండా ‘తమ రాష్ట్రంలోని కన్నడిగులకే ఉద్యోగాలన్న’ మంత్రిమండలి నిర్ణయం ఐటీ కంపెనీలను మరింత ఆర్థిక కష్టాల్లోకి నెట్టటమే. నిపుణుల కొరతతో స్థానికులు లభించక, తమ సంస్థలను బయట రాష్ట్రాల్లోకి మార్చాలంటే ఐటీ కంపెనీలు అనేక ఇబ్బందులు ఎదుర్కోవాలి.

కరోనా మహమ్మారి విసిరిన పంజావల్ల నగరం విడిచిన టెక్కీలు, ఇతర ప్రైవేట్ రంగ ఉద్యోగులు వారి ప్రదేశాలకు వెళ్ళిపోయినప్పుడు నగరం నిస్తేజంగా మారి, అన్ని రంగాలు పడకేసే పరిస్థితి ఏర్పడింది. పీడకలలాంటి ఆ కాలం గడచి మళ్ళీ నగరం ఇప్పుడిప్పుడే కోలుకొంటున్నది. ‘వర్క్ ఫ్రమ్ హోమ్’ను అంచెలవారీగా ఎత్తేసి వారానికి 3-- రోజుల వరకు అఫీసులకు రావాల్సిందేనని కంపెనీలు ఉద్యోగులకు ఆదేశాలు ఇవ్వడంతో ఐటీ కార్యాలయాలు మళ్లీ ఉద్యోగులతో కళకళలాడుతున్నాయి. 

సీఎం సెల్ఫ్‌గోల్

ఇలాంటి స్థితిలో సిద్ధరామయ్య ప్రభుత్వ నిర్ణయం అటు సాఫ్ట్‌వేర్ కంపెనీలకు, ఇటు ఉద్యోగులకు ఆందోళన కలిగించిందని చెప్పాలి. అలాగే, స్థానికులకూ ఈ నిర్ణయం తెలివితక్కువ, తొందరపాటులా అన్పించింది. అర్హతలుంటే  ఎలాగూ స్థానికులకే ఉద్యోగాలు వస్తాయి. చాలినంతమంది నిపుణులు లేనప్పుడు బయటి రాష్ట్రాలవారిని నియమించుకోవాలి. కర్ణాటకే కాదు అమెరికా, బ్రిటన్, కెనడా, ఫ్రాన్స్ తదితర పలు దేశాల్లోనూ ఇలాగే ఇతరుల నియామకాలు జరుగుతాయన్న విషయం తెలియక పోవటం తెలివితక్కువ తనం. వాస్తవానికి తెలుగు రాష్ట్రాలతోపాటు ఇతర ప్రాంతాలకు చెందిన టెక్కీలు 15 లక్షలమంది, వారి కుటుంబసభ్యులు మరో 15 లక్షలు (మొత్తం 30 లక్షలు) ఉంటే కర్ణాటకకు ఎన్ని రకాల ఆదాయమో వేరే చెప్పే పని లేదు. అనేక రంగాలకు అదనంగా ఆదాయం చేకూరుతుంటే రాష్ట్రాన్ని, ఆర్థిక రంగాన్ని కుదేలు చేసేలాంటి ఆ నిర్ణయాన్ని స్థానికులు కూడా జీర్ణించుకోలేక పోతున్నారు.

అప్పటికిగాని సిద్ధాన్నంలో నీళ్లు పోసుకుంటున్నామని సిద్ధరామయ్యకు తెలిసి రాలేదు. బెంగళూరుసహా కర్ణాటకను ఆర్థికంగా దెబ్బ తీసే నిర్ణయంతో సెల్ఫ్‌గోల్ చేసుకున్నామని ఆయన గ్రహించినట్టున్నారు. దీంతో స్థానికులకు ఉద్యోగాల నిర్ణయాన్ని నిలిపి వేస్తున్నామని ప్రకటించారు. దీనిపై మరింత లోతుగా అలోచించి తరువాత నిర్ణయం తీసుకుంటామని ప్రకటించారు కూడా. అయినా, అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. కర్ణాటక ప్రభు త్వం, సీఎం సిద్దరామయ్య మనసులో ఏముందో అన్ని కంపెనీలకు అర్థమైంది. విరిగిన మనసులు అతకవన్నట్లు, అనుమాన బీజాలకు అంకురార్పణ జరిగి, పలు కంపెనీలు భవిష్యత్తుకు తగ్గట్లుగా ప్రణాళికలు వేసుకునేందుకు సిద్ధరామయ్య ప్రభుత్వం కారణంగా మారింది. ప్రపంచంతో పోటీ పడేలా కన్నడిగులను తీర్చిదిద్దే నైపుణ్యాలను పెంచే ప్రణాళికలు వేసి, శిక్షణ ఇచ్చి, అమలు చేయా ల్సిన బాధ్యత తీసుకోకుండా రాష్ట్ర ప్రభు త్వం తొందరపడి అడుసులో కాలేసింది. అనుమానపు బీజాలు వేసిన తర్వాత దాన్ని సరిదిద్దుకోవటం కష్టం. 

చలాది పూర్ణచంద్రరావు

 సీనియర్ జర్నలిస్టు

సెల్: 9491545699