calender_icon.png 18 November, 2024 | 3:43 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఒక్కరోజు నిద్రతో సరిపెడితే ఎలా?

18-11-2024 01:27:50 AM

  1. వారి దుర్భర జీవితాన్ని చూసి మాట్లాడాలి..
  2. రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు 

హైదరాబాద్, నవంబర్ 17 (విజయక్రాంతి): బీజేపీ నేతలు నిర్వాసితులతో కలిసి మూడు నెలలు కలిసి జీవించాలని, కానీ, వారు ఒక్కరోజు నిద్ర చేసి చేతులు దులుపుకొన్నారని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ఎద్దేవా చేశారు. హైదరాబాద్‌లోని నాంపల్లిలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో ఆదివారం కాంగ్రెస్ ఐటీ సెల్ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు.

మూసీ పరీవాహక ప్రాంతాన్ని అభివృద్ధి చేసే దిశగా రాష్ట్రప్రభుత్వం ముందుకు వెళ్తుంటే, బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు అడ్డుపడుతున్నారని మండిపడ్డారు. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి మూసీ బాధితుల సమస్యలు తెలుసుకుంటే బాగుంటుందని హితవు పలికారు. నది కలుషితం కావడంతో పరీవాహక ప్రజలు దుర్భర జీవితం గడుపుతున్నారని వెల్లడించారు.

ప్రభుత్వం తీసుకున్న ఇంత మంచి నిర్ణయాన్ని వ్యతిరేకించడం సరికాదన్నారు. బాధితుల బాగు కోసం నదిలో గోడలు కడితే సరిపోతుందని బీజేపీ నేతలు అనడం  కేవలం అవగాహనారాహిత్యమేనన్నారు. మూసీ ప్రక్షాళన డీపీఆర్ వచ్చాక ఏం చేయాలనే అంశంపై తమకు సలహాలు ఇవ్వాలని, కానీ ముందే వ్యతిరేక వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు.

మూసీ ప్రాంత ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందించాలని, వారి కోసం ఇండ్లు ఇవ్వాలని, నిర్వాసిత యువతకు ఉపాధి కల్పించాలని రాష్ట్రప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తున్నదని స్పష్టం చేశారు. కానీ, ఈలోపే బీజేపీ నాయకులు లేనిపోని రాద్ధాంతం చేయడం దారుణమన్నారు.