ఇది రాజ్యాంగాన్ని మోసం చేయడమే
ఎస్సీ సర్టిఫికెట్ కోసం క్రైస్తవ పిటిషనర్ వేసిన వ్యాజ్యం కొట్టివేత
న్యూఢిల్లీ, నవంబర్ 28: వేరే మతాలు, ఆచారాలను అవలంబిస్తూ.. కేవలం రిజర్వేషన్ల లబ్ధి పొందడానికి తాము హిందువులుగా చెప్పుకోవడాన్ని సుప్రీంకోర్టు తప్పుపట్టింది. ఇలా పేర్కొనడం రాజ్యాంగాన్ని మోసం చేయడమే అవుతోందని స్పష్టం చేసింది. క్రైస్తవంలోకి మారిన ఓ మహిళకు షెడ్యూల్డ్ కుల (ఎస్సీ) సర్టిఫికెట్‌ను నిరాకరిస్తూ మద్రాస్ హైకోర్టు వెలువరించిన తీర్పును అత్యున్నత న్యాయస్థానం సమర్థించింది. ఈ మేరకు జస్టిస్ పంకజ్ మిట్టల్, జస్టిస్ ఆర్ మహాదేవన్‌లతో కూడిన ధర్మాసనం 21 పేజీల తీర్పును వెలువరిచింది. వేరే మతంలోకి మారాలనుకునేవారు ఆ మతానికి సంబంధించిన ఆలోచ నలను పూర్తిగా విశ్వసించడం చాలా అవసరమని పేర్కొంది. కాగా కేసులో సమర్పించిన సాక్ష్యాల ఆధారంగా పిటిషనర్ క్రైస్తవ మతా న్ని అనుసరిస్తూ చర్చికి వెళ్తున్నట్లు నిర్ధారణ అయిందని ధర్మాసనం వెల్లడించింది.
ఉద్యోగం కోసం మతమార్పిడి సరికాదు..
క్రైస్తవ మతాన్ని అనుసరిస్తున్నానని, ఆలయాలకు కూడా వెళ్తున్నానని పిటిషనర్ ప్రస్తా వించారు. కానీ.. సదరు పిటిషనర్ తిరిగి హిందూమతంలోకి చేరినట్లు ఎక్కడా ఆధారాలను సమర్పించలేదని న్యాయస్థానం పేర్కొం ది. పిటిషనర్ ద్వంద్వ వైఖరిని ఆమోదించలేం. ఉద్యోగం కోసమే తాను హిందువునని చెప్తూ రిజర్వేషన్లు కోరుతున్న క్రిస్టియన్ పిటిషనర్‌కు ఎస్సీ ధ్రువీకరణ పత్రం ఇవ్వడం సామాజిక విలువలకు విరుద్ధం. రాజ్యాంగాన్ని మోసం చేయడమే అవుతుంది అని ధర్మాసనం స్పష్టం చేసింది.