మీడియా అకాడమీ చైర్మన్ కే శ్రీనివాస్‌రెడ్డి
ముషీరాబాద్, సెప్టెంబర్ 3 (విజయక్రాంతి): అర్హులైన జర్నలిస్టులందరికీ ఇండ్ల స్థలాలు ఇప్పించేందుకు కృషి చేస్తానని తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ కే శ్రీనివాస్ రెడ్డి అన్నారు. జర్నలిస్టుల సమస్యపై ఇప్పటికే అనేకసార్లు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లామన్నారు. మంగళవారం గ్రేటర్ హైదరాబాద్ జర్నలిస్ట్స్ మ్యూచువల్లీ ఎయిడెడ్ కో హౌసింగ్ సొసైటీ అధ్యక్షుడు మామిడి సోమయ్య, ప్రధాన కార్యదర్శి బొల్లం శ్రీనివాస్‌తో పాటు పలువురు ప్రతినిధులు మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్‌రెడ్డిని కలిసి జర్నలిస్టుల ఇండ్ల స్థలాల సమస్యలపై చర్చించారు.
ఈ సందర్భంగా శ్రీనివాస్‌రెడ్డి గ్రేటర్ జర్నలిస్ట్స్ హౌసింగ్ సొసైటీ గురించి ఆయన అడిగి తెలుసుకున్నారు. తమ సొసైటీ 2008లో ఏర్పడిందని, అప్పటి నుంచి మూడు దఫాలుగా జర్నలిస్టుల నుంచి సభ్యత్వం తీసుకున్నామన్నారు. ప్రస్తుతం సొసైటీలో 1300 మంది సభ్యులున్నారని అధ్యక్షుడు సోమయ్య వివరించారు. వారి వెంట సొసైటీ ప్రతినిధులు యర్రమిల్లి రామారావు, కరుణాకర్, అంజిరెడ్డి, నాగవాణి, టి.శాంతి ఉన్నారు.