శిథిలావస్థలో పలు భవనాలు
మరుగుదొడ్లు లేక విద్యార్థులకు ఇబ్బందులు
కలుషిత నీరు, అపరిశుభ్ర పరిసరాలు
తరచుగా అస్వస్థతకు గురవుతున్న విద్యార్థులు
వికారాబాద్, జూలై 10 (విజయక్రాంతి): జిల్లాలో ప్రభుత్వ వసతి గృహాల పరిస్థితి అధ్వానంగా తయారైంది. ప్రభుత్వాలు మారుతున్నా వసతి గృహాల రూపురేఖలు మారడం లేదు. శిథిల భవనాలు, కిటికీలు లేని గదులు, తలుపులు లేని మరుగుదొడ్లు, నీరు లేక అలంకారప్రాయంగా ఉన్న స్నానాల గదులే దర్శనమిస్తున్నాయి. సంబంధిత అధికారులు కూడా పర్యవేక్షించక పోవడం విద్యార్థులకు శాపంగా మారింది.
సమస్యలు కోకొల్లలు..
పలు ప్రభుత్వ హాస్టళ్లలో విద్యార్థులకు తాగునీటి వసతి లేదు. అపరిశుభ్రమైన పరిసరాల మధ్య భోజనం చేయాల్సి వస్తోంది. చాలా హాస్టళ్లలో మరుగుదొడ్లు లేవు. ఉన్నా వాటి నిర్వహణ సక్రమంగా లేక ఆరుబయటకు వెళ్లాల్సి వస్తోంది. మరుగుదొడ్లకు తలుపులు లేకపోవడంతో పాటు వాటిలో నీటి సరఫరా ఉండడం లేదు. కోడంగల్‌లోని బీసీ వసతి గృహం మరుగుదొడ్లు అధ్వానంగా మారాయి. వాటికి తలుపులు లేక నిరుపయోగంగా ఉన్నాయి. వసతి గృహ భవనం కూడా శిథిలావస్థకు చేరిం ది. యాలాల్‌లోని బీసీ వసతి గృహం పూర్తి శిథిలావస్థకు చేరింది.
పై పెచ్చులు ఊడి పడుతుండడంతో విద్యార్థులు భయం భయంగా గడుపుతున్నారు. ధారూరు బీసీ బాలుర వసతి గృహంలో శుభ్రం చేసేవారు లేక మరుదుదొడ్లు నిరుపయోగంగా ఉండి డ్రైనేజీ నీరు బయటకు వస్తోంది. దీంతో విద్యార్థులు దుర్వాసనతో ఇబ్బంది పడుతున్నారు. మోమిన్ పేట్‌లోని బాలుర వసతి గృహంలో మరుగుదొడ్లకు తలుపులు లేవు. ఈ సమస్యలకు తోడు తరచూ భోజనం వికటిస్తుం డడంతో విద్యార్థులు ఆసుపత్రుల పాలవుతున్నారు. ఇటీవల జిల్లాలో ఈ సంఘటనలు తరచుగా చోటుచేసుకుంటున్నా సంబంధిత శాఖల అధికారులు కనీసం స్పందించడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.
ఆసుపత్రుల పాలవుతున్న విద్యార్థులు..
ఈ ఏడాది వసతి గృహాలు ప్రారంభమైన నాటి నుంచి జిల్లాలో ఎక్కడో ఒకచోట సమస్యలు వెలుగుచూస్తూనే ఉన్నాయి. వికారాబా ద్‌లోని ఓ రెసిడెన్షియల్ గురుకుల పాఠశాలలో 20 మంది విద్యార్థులు అస్వస్థతకు గురై ఆసుపత్రి పాలయ్యారు. పరిగి సమీపంలోని నస్కల్ కేజీబీవీలో విద్యార్థినులు తీవ్ర అస్వస్థతకు గురై రెండు రోజులు ఆసుపత్రిలోనే చికిత్స పొందారు. అయితే ఇలాంటి సంఘటనలు బయటకు పొక్కినవి కొన్ని మాత్రమే. అన్నంలో పురుగులు వస్తున్నా, ఆల్పాహారం నాణ్యతగా లేకపోయినా, తాగునీరు కలుషితంగా ఉన్నా వార్డెన్ల భయానికి విద్యార్థులు గమ్మునుండి పోతున్నారు. సమస్యలను బయటకు చెబితే హాస్టల్ నుంచి పంపించేస్తామని పలువురు వార్డెన్లు బెదిరిస్తున్నట్లు సమాచారం.
అలంకారప్రాయంగా ఆర్‌వో ప్లాంట్లు..
ఐదేళ్ల క్రితం జిల్లాలోని అన్ని ప్రభుత్వ వసతి గృహాల్లో సురక్షితమైన మంచినీటిని అందించాలనే ఉద్దేశంతో ఆర్‌వో ప్లాంట్లను ఏర్పాటు చేశారు. ఒక్కో వసతి గృహానికి రూ. 2.50 లక్షలు ఖర్చు చేశారు. అయితే ఈ ఆర్‌వో ప్లాంట్లు ఏడాది మాత్రమే పనిచేశాయి. ప్రస్తుతం జిల్లాలోని 80 శాతం వసతి గృహాల్లో ఆర్‌వో ప్లాంట్లు మూలనపడ్డాయి. వాటిని బాగు చేయించడం లేదు. దీంతో విద్యార్థులు బోరు, నల్లా నీటిని, ట్యాంకుల్లో నిల్వ ఉన్న నీటినే తాగుతున్నారు. దీంతో విద్యార్థులు అస్వస్థతకు గురవుతున్నారు.