- జగన్నాథపురం పెద్దమ్మగుడి పరిధిలో డొల్ల మండపాలు
- పెద్ద మొత్తంలో అద్దె వసూళ్లు.. వసతులు మాత్రం నిల్లు..
భద్రాద్రి కొత్తగూడెం, ఆగస్టు 8 (విజయక్రాంతి): భద్రాద్రి జిల్లా పాల్వంచ మండలం జగన్నాథపురంలోని కనకదుర్గా అమ్మవారి ఆలయం (పెద్దమ్మతల్లి) భక్తుల పాలిట కొంగు బంగారంగా మారింది. అమ్మవారిని దర్శించుకునేందుకు నిత్యం వేలాది మంది వస్తుంటా రు. పండుగలు, జాతర సమయాల్లోనైతే రెట్టింపు భక్తులు వస్తారు. కొందరు మొక్కులు తీర్చుకునేందుకు బంధువులతో సహా ఇక్కడికి వస్తారు. వారు సరైన వసతులు లేక ఇబ్బంది పడకుండా ఉండేందుకు ఆలయ సమీపంలో దేవాదాయశాఖ రూ. 3.90 కోట్లతో రెండు ఏసీ కల్యాణ మండపా లు నిర్మించాలని నిర్ణయించింది. 2020లో పనులు ప్రారంభమై, మూడేళ్ల తర్వాత పనులు పూర్తయి ఫంక్షన్ హాళ్లు అందుబాటులోకి వచ్చాయి.
వసతులు కరువు..
రెండు ఫంక్షన్ హాళ్లలోనూ సరైన వసతులు లేకపోవడంతో భక్తులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రెండింటిలోనూ సరైన కిచెన్ షెడ్స్ లేవు. దీంతో వేడుకలు నిర్వహించుకునే వారు ఆరుబయటే వంట చేసుకోవా ల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక వర్షాకాలంలో వేడుకలు జరిగితే భక్తుల బాధ వర్ణనాతీతం. రెండు హాళ్లలోనూ సరైన డ్రైనేజీ వ్యవస్థ లేదు. దీంతో ఏదైనా ఫంక్షన్ జరిగి, పూర్తయిన తర్వాత ఎక్కడి మురుగు అక్కడే నిలుస్తోంది. అంతేకాదు సీలింగ్ నుంచి పెచ్చులూడి కిందపడుతున్నాయి.
కాంట్రాక్టర్లు ఈ సమస్యలను దేవాదాయశాఖ దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకపోవడంతో వారు తమ కాంట్రాక్ట్‌ను రద్దు చేసుకునేందుకు సిద్ధమవుతున్నారని తెలిసింది. మరోవైపు వేడుకలు నిర్వహించుకునేం దుకు భారీ మొత్తంలో అద్దె చెల్లిస్తున్నప్పటికీ సౌకర్యాలు లేకపోవడంపై భక్తులు పెదవి విరుస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు, చొరవ తీసుకుని ఫంక్షన్ హాళ్లలో వసతులు కల్పించాలని కోరుతున్నారు.