చారకొండలో బైపాస్ రహదారి నిర్మాణానికి 29 ఇండ్లు గుర్తింపు
కష్టపడి కట్టుకున్న గూడు నేలమట్టం కావడంతో ఆవేదనలో నిర్వాసితులు
ఇండ్ల కూలిచివేతలను అడ్డుకున్న నిర్వాసితులను ఆరెస్ట్ చేసిన పోలీసులు
ఫలించని నిర్వాసితుల నాలుగేళ్ల పోరాటం
400 మంది పోలీసులతో భారీ బందోబస్తు
చారకొండ,(విజయక్రాంతి): పేదలు ఇష్టంగా కట్టుకున్న ఇళ్లను జాతీయ రహదారి విస్తరణ పేరుతో కూల్చివేసిన ఘటనతో నాగర్‌కర్నూల్ జిల్లా చారకొండ(Charakonda) మండల కేంద్రంలో ఉద్రిక్తత పరిస్థితులు చోటుచేసుకుంది. జడ్చర్ల - కోదాడ 167వ జాతీయ రహదారి విస్తరణ(National Highway Expansion)లో భాగంగా చారకొండ మండల కేంద్రం నుంచి మర్రిపల్లి వరకు 1.2 కిలో మీటర్ల బైపాస్ రోడ్డు నిర్మాణానికి నాలుగేళ్ల క్రితం 29 ఇండ్లను అధికారులు గుర్తించారు. నాలుగేళ్లుగా తమ ఇండ్ల మీదుగా రహదారి నిర్మించవద్దని పాత రహదారి వెంబడే నిర్మించాలని ప్రజాప్రతినిధులకు, అధికారులకు విన్నవించి ఎన్నో ఉద్యమాలు చేశారు. ఎన్నో సార్లు అధికారులు ఇండ్లను కూల్చాలని ప్రయత్నించినప్పటికీ నిర్వాసితుల ప్రతిఘటించడంతో వాయిదా పడుతూ వచ్చింది.
ఎట్టకేలకు మంగళవారం భారీ పోలీస్ బందోబస్తు నడుమ రెవెన్యూ అధికారులు 29 ఇండ్లను కూల్చివేతల(Houses Demolished) ప్రక్రియ చేపట్టారు. దీంతో బాధితులు అడ్డుకోవడంతో కొంతసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గ్రామం మధ్య నుంచి బైపాస్ తీసుకెళ్లడంపై స్థానికులు నిరసన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో కూల్చివేతలను అడ్డుకుంటున్న నిర్వాసితులను పోలీసులు అరెస్టు చేసి వెల్దండ పోలీసు స్టేషన్ కు తరలించారు. కష్టపడి నిర్మించుకున్న ఇళ్లు తమ ముందే కూల్చివేస్తుంటే బాధితులు కన్నీటి పర్యంతానికి లోనయ్యారు. తమకు ముందస్తు నోటీసులు ఇవ్వకుండా కూల్చివేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇళ్లలోని సామగ్రిని సిబ్బంది రైతువేదిక, పీఏసీఎస్ గోడౌన్లకు తరలించారు. కూల్చివేత ప్రక్రియలో ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా సీఐ విష్ణువర్ధన్ రెడ్డి, స్థానిక ఎస్సై శంషుద్దీన్ ఆధ్వర్యంలో దాదాపు 400 మంది పోలీసులతో బందోబస్తు నిర్వహించారు.