- పారదర్శకంగా లబ్ధిదారుల ఎంపిక
- హైదరాబాద్ జిల్లా ఇన్‌చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్
హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 12 (విజయక్రాంతి): రాష్ట్రంలో ఈనెల 26 నుంచి ప్రారంభం కానున్న ఇందిరమ్మ ఇళ్ల ఎంపిక, రేషన్ కార్డు మంజూరు ప్రక్రియలో రాజకీయాలకు అతీతంగా అధికారులు పారదర్శకంగా వ్యవహరించాలని బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు.
హైదరాబాద్ జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల ఎంపిక, రేషన్‌కార్డులపై.. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మేయర్, డిప్యూటీ మేయర్, జీహెచ్‌ఎంసీ కమిషనర్, జిల్లా కలెక్టర్, ఇతర అధికారులతో పొన్నం ప్రభాకర్ ఆదివారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వం నిర్ణయించిన షెడ్యూల్‌ను పొన్నం వివరించారు.
ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డుల మంజూరు ప్రక్రియలో ఈనెల 16 నుంచి 20 వరకు ఫీల్డ్ వెరిఫికేషన్, 21 నుంచి 24 వరకు ఎంపికైన ముసాయిదా జాబితా వార్డుసభలలో అందుబాటులో ఉంచడం, 21 నుంచి 25 వరకూ డేటాఎంట్రీ, ఆతర్వాత 26 నుంచి నియోజకవర్గానికి 3,500 ఇళ్లను కేటాయించడం జరుగుతుందన్నారు.
గ్రేటర్ వ్యాప్తంగా ప్రజా పాలనలో 10,70,463 దరఖాస్తులు అందగా, ఇంటి స్థలం ఉన్నవారు 9,913 మంది ఉన్నారన్నారు. ఈ దరఖాస్తులను 50 శాతం సర్వే చేయగా, హైదరాబాద్‌లో సొంత స్థలం ఉండి ఇళ్లులేని వారి అప్లికేషన్లు 50 శాతం వచ్చాయన్నారు. హైదరాబాద్‌లో స్థలం అంశం ప్రత్యేకమైందన్నారు. అయినప్పటికీ, ప్రజా ప్రతినిధుల సూచనల మేరకు నిరుపేదలకు మల్టీస్టోర్ లేదా స్లమ్ డెవలప్‌మెంట్ చేసి ఇల్లు నిర్మాణం
చేయడమా అనేదానిపై యాక్షన్ ప్లాన్ తీసుకున్నామని అన్నారు. సమావేశంలో మేయర్ గద్వాల విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ శ్రీలతాశోభన్ రెడ్డి, కమిషనర్ ఇలంబర్తి, జిల్లా కలెక్టర్ అనుదీప్, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ, ఎమ్మెల్యే దానం, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్, రాజ్యసభ సభ్యు డు అనిల్ కుమార్ యాదవ్, ఎంఐఎం ఎమ్మెల్యేలు తదితరులు పాల్గొన్నారు.