calender_icon.png 28 April, 2025 | 9:11 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పేదలకు ఇండ్ల స్థలాలు ఇవ్వాలి

27-04-2025 11:38:57 PM

కుంట్లూరులోని రావి నారాయణరెడ్డి నగర్ ఫేజ్-3లో అగ్నిప్రమాదంలో సర్వం కోల్పోయిన పేదలు 

ముఖ్యమంత్రితో మాట్లాడి పేదలకు న్యాయం చేస్తాం..

సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు... 

ఎల్బీనగర్: తెలంగాణ రాష్ట్రంలో నిరుపేదలు ఎక్కడైనా నివాసం ఏర్పరచుకున్నప్పటికీ మౌలిక వసతుల కల్పన ఆయా ప్రభుత్వాలదే బాధ్యత ఉంటుందని, అర్హులైన పేదలకు ఇండ్ల స్థలాలు ఇవ్వాలని సీపీఐ నాయకుడు, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు(MLA Kunamneni Sambasiva Rao) అన్నారు. రంగారెడ్డి జిల్లా పెద్ద అంబర్ పేట మున్సిపాలిటీ పరిధిలోని కుంట్లూరు రావి నారాయణరెడ్డి నగర్ ఫేజ్-3లో శనివారం అగ్నిప్రమాదం జరగడంతో అనేక మంది పేదలు నిరాశ్రయులు అయ్యారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ఆదివారం రావి నారాయణరెడ్డి కాలనీలో పర్యటించి, బాధితులను పరామర్శించారు. గుడిసెలో నివాసం ఉంటున్న నిరుపేదలకు ప్రభుత్వం తక్షణమే స్పందించి మౌలిక వసతులను కల్పించాలని కోరారు.

బాధితులను సీపీఐ పార్టీ ముఖ్య నాయకులు ఆందోజు రవీంద్రాచారి, ముత్యాల యాదిరెడ్డి, సామిడి శేఖర్ రెడ్డి తదితరులతో కలిసి ఎమ్మెల్యే బాధితులను పరామర్శించారు. ప్రమాద స్థలాన్ని పరిశీలించి, బాధితులతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రంగారెడ్డి జిల్లా కలెక్టర్ తో ఫోన్లో మాట్లాడి పేదలకు న్యాయం చేయాలని, విషయాన్ని తాను ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకువెళ్తానన్ని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పేదలు గుడిసెలో నివాసం ఉంటున్న ప్రాంతంలో అగ్ని ప్రమాదం జరగడం బాధాకరమన్నారు. ఈ ప్రమాదంలో దాదాపు 500 కుటుంబాలు సర్వం కోల్పోయాయని, పేదలను ప్రభుత్వమే తక్షణం ఆదుకోవాలని డిమాండ్ చేశారు.

భూదాన్ భూముల్లో నివాసం ఉంటున్న పేదలు మూడేళ్లుగా సొంతింటి కలలు నెరవేర్చుకోవడం కోసం ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.  రావి నారాయణరెడ్డి కాలనీలో పేదలు వేసుకున్న గుడిసెల ప్రాంతంలో ప్రభుత్వం తక్షణమే తాగునీరు, విద్యుత్ సౌకర్యం, ఇతర మౌలిక వసతులు కల్పించాలని కోరారు.  ముఖ్యమంత్రితో మాట్లాడి పేదలకు మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తామన్నారు.   బాధిత కుటుంబానికి లక్ష చొప్పున తక్షణ సాయంగా నష్టపరిహారం అందజేయాలని డిమాండ్ చేశారు. మరో రెండు, మూడు రోజుల్లో మళ్ళీ ఒకసారి పర్యటించి, పేదలకు న్యాయం జరిగే విధంగా కచ్చితంగా పోరాటం చేస్తానని ఆయన తెలిపారు. కార్యక్రమంలో సీపీఐ ముఖ్య నాయకులు, మాజీ కౌన్సిలర్ లక్ష్మణ్, హరికిషన్ సింగ్ నాయక్, అరుణ, నవనీత, సుజాత, దేవమ్మ తదితరులు పాల్గొన్నారు.