calender_icon.png 17 January, 2025 | 3:18 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సొసైటీలతో సంబంధం లేకుండా ఇళ్ల స్థలాలు

10-09-2024 04:37:37 AM

  1. అర్హులైన జర్నలిస్టులకు తప్పక న్యాయం చేస్తాం 
  2. మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్‌రెడ్డి

హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబర్ 9 (విజయక్రాంతి): సొసైటీలతో సంబంధం లేకుండా జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు అందజేస్తామని తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ కె.శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. టీయూడబ్ల్యూజే రాష్ట్ర ఉప ప్రధాన కార్యదర్శిగా నియామకమైన కలుకూరి రాములు పదవీ బాధ్యతల స్వీకారోత్సవ కార్యక్రమం బషీర్‌బాగ్‌లోని యూనియన్ కార్యాలయంలో జరిగింది. ఈ కార్యక్రమానికి శ్రీనివాస్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. సీఎం చేతుల మీదుగా జవహర్‌లాల్ నెహ్రూ సొసైటీకి స్థలం అప్పగింత పత్రాలు అందించడంతో 18ఏళ్ల గోస తీరిందన్నారు. హౌజింగ్ సొసైటీలలో సభ్యులుగా లేమని పలువురు జర్నలిస్టులు కలత చెందుతున్న విషయం తన దృష్టికి వచ్చిందన్నారు.

నిబంధనల ప్రకారం వర్కింగ్ జర్నలిస్టులుగా పనిచేస్తున్న ప్రతి ఒక్కరి నుంచి అక్రిడేషన్‌తో సంబంధం లేకుండా ప్రభుత్వం దరఖాస్తులు స్వీకరిస్తుందని తెలిపారు. గతంలో జర్నలిస్టులకు జూబ్లీ హిల్స్, బంజారాహిల్స్, గోపనపల్లిలో ఇళ్ల స్థలాలు వచ్చాయని తెలిపారు. కేవలం యూనియన్ చేసిన పోరాటాల వల్లే ఇది సాధ్యమైందని.. దేశోద్ధారక  భవన్ దానికి వేదిక అని శ్రీనివాస్‌రెడ్డి గుర్తుచేశారు.

ఈ సందర్భంగా యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు కె.విరాసత్‌అలీ మాట్లాడుతూ.. జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి నిష్పక్షపాతంగా పోరాటాలు చేసేది తమ యూనియన్ అని అన్నారు. హెచ్‌యూజే అధ్యక్షుడు శిగాశంకర్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో యూనియన్ ప్రధాన కార్యదర్శి రాంనారాయణ, స్టీరింగ్ కమిటీ సభ్యుడు మాజీద్, కోశాధికారి వెంకట్‌రెడ్డి, కార్యదర్శి యాదగిరి, జవహర్‌లాల్ నెహ్రూ జర్నలిస్టు హౌజింగ్ సొసైటీ అధ్యక్షుడు కిరణ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.