calender_icon.png 25 February, 2025 | 11:36 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రామోజీ ఫిలిం సిటీలో ఇంటి స్థలాలను వెంటనే ఇవ్వాలి

17-02-2025 11:13:17 PM

సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా..

ఇంటి స్థలాలను కబ్జా చేసిన రామోజీ యాజమాన్యంపై కేసు నమోదు చేయాలి..

జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డికి వినతి పత్రం అందజేత..

ఇబ్రహీంపట్నం (విజయక్రాంతి): రామోజీ ఫిలిం సిటీలో పేదలకు ఇచ్చిన ఇంటి స్థలాలను కబ్జా చేసిన రామోజీ యాజమాన్యంపై కేసు నమోదు చేసి, ఇంటి స్థలాలను వెంటనే పేదలకు ఇవ్వాలని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి పగడాల యాదయ్య డిమాండ్ చేశారు. సోమవారం సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో రంగారెడ్డి కలెక్టరేట్ కార్యాలయం ఎదుట ఇంటి స్థలాల పట్టాలు ఉన్న లబ్ధిదారులతో కలిసి ధర్నా చేపట్టారు. అనంతరం జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ రంగారెడ్డి జిల్లా కార్యదర్శి పగడాల యాదయ్య మాట్లాడుతూ.. 2007 సంవత్సరంలో ఇంటి స్థలం లేని పేదలందరికీ ఇంటి స్థలం ఇవ్వాలని పోరాటం చేసిన ఫలితంగా 2007 సంవత్సరంలో అప్పటి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం ఇబ్రహీంపట్నం మండలం నాగన్ పల్లి గ్రామంలో సర్వేనెంబర్ 189లో 12 ఎకరాలు, 203లో 8 ఎకరాల 4గుంటల భూమిని నాగన్ పల్లి, పోల్కంపల్లి, రాయపోల్, ముకునూర్ గ్రామాలకు చెందిన 675 మంది పేదలకు 60 గజాల చొప్పున ఇంటి స్థలం పట్టాలు ఇచ్చారని గుర్తు చేశారు.

దీనికి లేఅవుట్ నక్ష ఇచ్చి ప్రభుత్వమే ఇల్లు నిర్మించి ఇస్తామని చెప్పి లబ్ధిదారులను నమ్మించి కొంతమంది లబ్ధిదారుల నుంచి అప్పుడున్న అధికారులు ఇంటి పట్టాలను కూడా తీసుకున్నారు. గత 17 సంవత్సరాలుగా సిపిఎం ఆధ్వర్యంలో ఈ ఇంటి స్థలాలు ఇవ్వాలని నిరంతరం పోరాటం చేస్తున్నామని, అందులో భాగంగానే 2022 నవంబర్ లో జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు పెద్ద ఎత్తున లబ్ధిదారులతో కలిసి ధర్నా చేసిన సందర్భంగా రామోజీ యాజమాన్యం సర్వే నెంబర్ 189, 203లో ఇంటి స్థలాల కోసం కేటాయించిన భూమిని తమకు కేటాయిస్తే వేరే సర్వే నెంబర్లలో ఇంటి స్థలాల కోసం 25 ఎకరాల అసైన్డ్ భూమిని రైతుల నుంచి కొనుగోలు చేయడానికి అవసరమైన నష్టపరిహారాన్ని చెల్లిస్తామని రామోజీ వారు అప్పుడున్న కలెక్టర్ కి దరఖాస్తు చేసుకున్నారు. రామోజీ యాజమాన్యం, ప్రభుత్వ అధికారులు వెంటనే లబ్ధిదారులకు ఇంటి స్థలాలు ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు.

కానీ నేటి వరకు అటువంటి ప్రయత్నాలు ఏవి జరగడం లేదు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి వెంటనే లబ్ధిదారులకు కేటాయించిన సర్వే నెంబర్లలోనే ఇంటి స్థలాలు ఇవ్వాలని అన్నారు. నిరుపేదలైన లబ్ధిదారులకు ఇంటి స్థలాలు ఇచ్చి ఇల్లు నిర్మించుకోవడానికి ప్రభుత్వమే ఐదు లక్షల రూపాయల నిధులను ఇవ్వాలని అన్నారు. అనంతరం జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి  తక్షణమే మంగళవారం రామోజీ యాజమాన్యాన్ని పిలిపించి ఆర్డీవో సమక్షంలో లబ్ధిదారులతో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బి సామెల్, మండల కార్యదర్శి సిహెచ్ బుగ్గరాములు, జిల్లా కమిటీ సభ్యులు సిహెచ్ జంగయ్య, పంది జగన్, మండల కమిటీ సభ్యులు సిహెచ్ నర్సింహా, రాయపోల్ మాజీ ఎంపిటిసి నీరుడు బిక్షపతి, సిపిఎం నాయకులు గూడెం అశోక్, తదితరులు పాల్గొన్నారు.