calender_icon.png 10 January, 2025 | 12:21 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇందిరమ్మలో ఇంటి పోరు!

28-10-2024 01:09:07 AM

  1. కమిటీల కారణంగా ‘హస్తం’లో అంతర్గత పోరు
  2. వర్గాల వారీగా జాబితాలు తయారీ
  3. ప్రతిపక్ష ఎమ్మెల్యేకు తెలియకుండా జాబితా ?
  4. తలలు పట్టుకుంటున్న అధికారులు

మెదక్, అక్టోబర్ 27 (విజయక్రాంతి): ‘కరవమంటే కప్పకు కోపం.. విడవమంటే పాముకు కోపం’ అనే సామెతలా తయారైంది అధికారుల పరిస్థితి. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేప్టటిన ఇందిరమ్మ ఇండ్ల పథకం అమలుకు శ్రీకారం చుట్టింది.

అందులో భాగంగా గ్రామాల్లో వేసే కమిటీల కారణంగా అధికార కాంగ్రెస్ పార్టీలో అంతర్గత గొడవలు మొదలైనట్లు తెలుస్తోంది. మరోవైపు ప్రతిపక్ష బీఆర్‌ఎస్ నేతల నుండి ఒత్తిళ్లు మొదలయ్యాయి. అయితే కాంగ్రెస్‌లో ఉన్న గ్రూపులు వేర్వేరుగా జాబితా లను తయారు చేసి మండల పరిషత్ అధికారులకు ఇస్తున్నాయి.

అయితే ఎవరి జాబితా ను ప్రామాణికంగా తీసుకోవాలో పాలుపోక పలు మండలాల్లో అధికారులు తలలు పట్టుకుంటున్నారు. అదేవిధంగా ప్రభుత్వ నిబం ధనలను పాటించాలని, రాజకీయాలకు అతీతంగా కమిటీలు వేయాలని బీఆర్‌ఎస్, బీజేపీ, సీపీఐ, సీపీఎం నాయకులు అధికారులపై ఒత్తిడి తెస్తున్నారు. 

కాంగ్రెస్‌లో అంతర్గత గొడవలు..

గ్రామాల వారీగా వేస్తున్న ఇండిరమ్మ ఇండ్ల కమిటీలు కాంగ్రెస్ పార్టీలో అంతర్గత పోరుకు కారణమవుతున్నాయి. జిల్లాలోని పలు గ్రామాల్లో కాంగ్రెస్‌లోని వివిధ గ్రూపుల వారీగా తమకు చెందిన వారితో ఓజాబితాను తయారు చేసుకుని వీటినే అమలు చేయాలని అధికారులపై ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం.

జిల్లాలోని మెదక్, నర్సాపూర్ నియోజకవర్గంలో మెదక్‌లో కాంగ్రెస్, నర్సాపూర్‌లో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థులు గెలుపొందారు. ఈ రెండు నియోజకవర్గాల్లో కాంగ్రెస్, బీఆర్‌ఎస్ వర్గాలకు చెందిన వారు కమిటీల్లో అవకాశాలు ఇవ్వాలని గొడవ పడుతున్నట్లు సమాచారం.

పలు మండలాల్లో మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్న వారికే ప్రాధాన్యత ఇవ్వాలని కొందరు నాయకులు పట్టుబడుతుండగా, తమకూ అవకాశం ఇవ్వాలని ఇటీవల వివిధ పార్టీల నుంచి కాంగ్రెస్‌లో చేరిన నాయకులు కోరుతున్నట్లు తెలిసింది. దీంతో ఇరువర్గాల మధ్య అంతర్గత పోరు నడుస్తున్నట్లు సమాచారం. 

ప్రతిపక్ష నాయకుల ఒత్తిడి..

ఇందిరమ్మ ఇండ్ల పథకం కేవలం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులకే పరిమితం కాదని, నిరుపేదలందరికీ పక్కా ఇండ్లు మంజూరు చేయాలని జిల్లాలోని అధికారులపై బీఆర్‌ఎస్, బీజేపీ, సీపీఐ, సీపీఎం పార్టీలకు చెందిన నాయకులు ఒత్తిడి తెస్తున్నారు. కమిటీ లు రాజకీయాలకు అతీతంగా వేయాల ని డిమాండ్ చేస్తూ అధికారులకు వినతిపత్రాలు అందజేస్తున్నారు.

ప్రధానంగా నర్సాపూర్ నియోజకవర్గంలో ఈ రభస జోరుగా సాగుతున్నట్లు సమాచారం. స్థానిక ఎమ్మెల్యేకు తెలియకుండానే కాం గ్రెస్ పార్టీ నేతలు ఆయా గ్రామాలకు చెందిన కమిటీల జాబితాను అధికారులకు అందజేసినట్లు సమాచారం. అయి తే బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో ఇత ర పార్టీల ఊసేలేదని, ఇప్పుడు కమిటీ ల్లో వారి పేరు ఎలా పెడతారని కాంగ్రెస్ నాయకులు ప్రశ్నిస్తున్నట్లు తెలిసింది.

దీంతో అధికారులు మౌనంగా ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. మరోవైపు ప్రొటోకాల్ ప్రకారం ఎమ్మెల్యే వర్గీయు లు ఇచ్చిన కమిటీనే అమలు చేయాలని బీఆర్‌ఎస్ నేతలు పట్టుబడుతున్నట్లు సమాచారం. ఇందిరమ్మ ఇండ్ల కమిటీ లు వేయడంలోనే ఇంత రాద్ధాంతం అయితే లబ్ధిదారుల ఎంపికలో ఎన్ని గొడవలు జరుగుతాయోనని అధికారు లు ఆందోళన చెందుతున్నారు.

కమిటీ నిబంధనలు ఇలా..

ప్రతి నియోజకవర్గానికి 3,500 చొప్పున ఇందిరమ్మ ఇండ్లను మొదటి విడతగా మంజూరు చేయనున్నారు. అయితే పక్షపాతం లేకుండా ఇండ్లను పంపిణీ చేయాలనే ఆలోచనతో మండ ల పరిషత్ అధికారుల నేతృత్వంలో కమిటీలను వేయాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చాయి.

ప్రభుత్వ నిబంధనల ప్రకారం కమిటీలో గ్రామంలోని ఇద్దరు స్వయం సహాయక సంఘాల మహిళలు, ఒక ఎస్సీ లేదా ఎస్టీ, ఒక బీసీ, ఇతరులు ఒకరితో పాటు గ్రామ సర్పంచ్, పంచాయతీ కార్యదర్శి సభ్యులుగా మొత్తం ఏడుగురు ఉండాలి. అయితే గ్రామాల్లో సర్పంచ్‌ల పదవీకాలం ముగియడంతో వారి స్థానంలో గ్రామ ప్రత్యేక అధికారిని సభ్యుడిగా చేర్చారు. వీరు గ్రామాల్లో పర్యటించి ఇండ్లు లేని నిరుపేదలను గుర్తించి వారికి పక్కా ఇండ్లు మంజూరు కోసం సిఫారసు చేయాల్సి ఉంటుంది.