నల్లగొండ (విజయక్రాంతి): యాదాద్రి భువనగిరి జిల్లా భువగిరిలో బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయంపై ఎన్‌ఎస్‌యూఐ, యువజన కాంగ్రెస్ కార్యకర్తల దాడికి నిరసనగా బీఆర్‌ఎస్ అధిష్ఠానం ఆదివారం మహాధర్నాకు పిలుపునిచ్చింది. దీంతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా బీఆర్‌ఎస్ ముఖ్య నేతలను ధర్నాకు వెళ్లనివ్వకుండా పోలీసులు హౌజ్ అరెస్ట్ చేశారు. నల్లగొండ పట్టణంలో కంచర్ల భూపాల్‌రెడ్డిని ఆయన ఇంట్లో నిర్బంధించారు. భువనగిరి టీచర్స్ కాలనీ వద్ద నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యను, మిర్యాలగూడలో నల్లమోతు భాస్కర్‌రావును, రామన్నపేటలో మాజీ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్‌ను అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ నుంచి వస్తున్న మాజీ మంత్రి జగదీష్‌రెడ్డిని అడ్డుకొని ఘట్కేసర్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. బీఆర్‌ఎస్ నేతల అరెస్టులను ఆ పార్టీ నల్లగొండ జిల్లా అధ్యక్షుడు రవీంద్రకుమార్ తీవ్రంగా ఖండించారు. ప్రజా పాలన పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం పోలీస్ రాజ్యం నడుపుతున్నదని విమర్శించారు.