నగరంలో రోడ్లన్నీ జలమయం
బంజారాహిల్స్ ఉదయ్‌నగర్ కాలనీలో నాలా రిటర్నింగ్ వాల్
ట్రాఫిక్ జామ్‌తో వాహనదారుల ఇక్కట్లు
ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాలచే సహాయక చర్యలు
లోతట్టు ప్రాంతాల్లో మేయర్, కమిషనర్ పర్యటన
మరో 5 రోజులు వర్షం పడే అవకాశం
ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక
సహాయక చర్యల కోసం టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు
హైదరాబాద్ సిటీబ్యూరో, మే 16 (విజయక్రాంతి): నగరంలో గురువారం భారీ వర్షం కురిసింది. దాదాపు 2 గంటల పాటు కుండపోత వర్షం కురవడంతో రహదారులు, లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. రోడ్డుపై నిలిచిన వరద నీటిలో కార్లు, బైక్‌లు కొట్టుకుపోయాయి. వర్షం, ఈదురు గాలులకు ఫ్లెక్సీ బ్యానర్లు విద్యుత్ స్తంభాలపై పడటంతో పలు చోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది.
బంజారాహిల్స్ ఉదయ్ నగర్ కాలనీలోని నాలా పై కప్పు అదే నాలాలో కొట్టుకుపోయింది. భారీగా కురిసిన వర్షానికి అప్రమత్తమైన జీహెచ్‌ఎంసీ అధికారులు వెంటనే డిజాస్టర్ రెస్క్యూ బృందాలను అలర్ట్ చేసి, సహాయక చర్యలు అందేలా చర్యలు తీసుకున్నారు. జీహెచ్‌ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మీ, కమిషనర్ రొనాల్డ్ రాస్ లోతట్టు ప్రాంతాల్లో పర్యటించి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రానున్న మరో 5 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకు రావొద్దని కోరారు.
ఏకధాటిగా 2 గంటలు
నగరంలో పది రోజుల క్రితం కురిసిన భారీ వర్షం.. బీభత్సం గురించి మరువకముందే గురువారం సాయంత్రం మరోసారి భారీ వర్షం కురిసింది. భారీ వర్షానికి ప్రజలు తీవ్ర ఇబ్బంది పడ్డారు. రెండు గంటల పాటు ఏకధాటిగా కుండపోత వర్షం దంచి కొట్టడంతో బంజారాహిల్స్, మాదాపూర్, ఏఎస్‌రావు నగర్, టోలిచౌకి, గడ్డి అన్నారం, ఇందిరాపార్కు సమీపంలోని ఎన్టీఆర్ స్టేడియం, అల్వాల్, ఎల్‌బీనగర్, ఖైరతాబాద్ తదితర ప్రాంతాలలో ట్రాఫిక్ జామ్ నెలకొంది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.
సుమారు 10 సెంటీ మీటర్లకు పైగా కురిసిన వర్షానికి లోతట్టు ప్రాంతాల ప్రజలు తీవ్ర భయబ్రాంతులకు లోనయ్యారు. ఈ సమయంలో పలు వాహనాలు వర్షం నీటిలో కదలకుండా మొరాయించాయి. బంజారాహిల్స్ ఉదయ్ నగర్ కాలనీ నాలాలో బైక్ కొట్టుకుపోవడంతో ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాలు బైక్‌ను బయటకు తీశాయి. ఏఎస్‌రావు నగర్‌లో ఓ కారును, మాదాపూర్ లో టూ వీలర్‌ను డీఆర్‌ఎఫ్ సిబ్బంది నీళ్ల నుంచి బయటకు నెట్టాల్సి వచ్చింది.
కొట్టుకుపోయిన నాలా పైకప్పు
భారీ వర్షం కారణంగా బంజారాహిల్స్ వెంకటేశ్వర కాలనీలో అత్యధికంగా 8.7 వర్షపాతం నమోదు కాగా, అత్యల్పంగా చార్మినార్‌లో 6.2 సెంటిమీటర్ల వర్ష పాతం నమోదు అయినట్టు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఈ వర్షానికి బంజారాహిల్స్ డివిజన్ ఉదయ్ నగర్ కాలనీలో నాలా రిటర్నింగ్ వాల్, నాలా పైకప్పు కొట్టుకుపోయాయి. విషయం తెలుసుకున్న మేయర్ గద్వాల విజయ లక్ష్మి, కమిషనర్ రొనాల్డ్ రాస్, ఈవీడీఎం ఎన్. ప్రకాష్ రెడ్డి, ఇతర జీహెచ్‌ఎంసీ అధికారులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు.
చుట్టూ కంచెను ఏర్పాటు చేసి హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేశారు. వరుసగా మరో 5 రోజుల పాటు భారీ వర్షాలు ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. ప్రజలకు ఏమైనా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటే తక్షణమే జీహెచ్‌ఎంసీ అధికారులకు ఫిర్యాదు చేయాలన్నారు. లేదంటే, జీహెచ్‌ఎంసీ టోల్ ఫ్రీ నంబర్లు 040 1111, 90001 13667 కు ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలన్నారు.
గంటలో 82 ఫిర్యాదులు
గురువారం కురిసిన భారీ వర్షం కారణంగా జీహెచ్‌ఎంసీకి గంటలో 82 ఫిర్యాదులు అందాయి. వర్షం రాగానే డీఆర్‌ఎఫ్ బృందాలు అలర్టు ఎక్కడికక్కడే సహాయక చర్యలు చేపట్టేందుకు రంగంలోకి దిగారు. నగరంలో సీఎం క్యాంపు కార్యాలయంతో పాటు మాదాపూర్ శిల్పారామం, ఎల్‌బీ నగర్, గుడి మల్కాపూర్, ఎన్టీఆర్ స్టేడియం, రాజ్‌భవన్ రోడ్డు, ఉప్పల్, రాజేంద్రనగర్, షేక్‌పేట, ఈసీఐఎల్, హయత్‌న గర్, గచ్చిబౌలి, కూకట్‌పల్లి, సుచిత్ర, గాజులరామారం, మెట్టుగూడ, మల్కాజిగిరి, అల్వాల్, మూసాపేట్, కేబీఆర్ పార్కు, చార్మినార్, చాంద్రాయణ గుట్ట తదితర 63 ప్రాంతాలలో రోడ్డుపై వర్షం నీళ్లు నిలిచినట్టుగా ఫిర్యాదులు అందాయి. వీటిలో 50 ప్రాంతాలను క్లియర్ చేయగా, మరో 15 ప్రాంతాల్లో చర్యలు చేపడుతున్నారు. అసెంబ్లీ ప్రాంతంతో పాటు 18 చోట్ల వర్షం కారణంగా చెట్లు నేలకొరిగాయి.
వర్షపాతం వివరాలు
ప్రాంతం వర్షపాతం
బంజారాహిల్స్ 8.7 సెం. మీ
మలక్‌పేట్ 8.5 సెం. మీ
గోషామహల్ 8.3 సెం. మీ
యూసుఫ్‌గూడ 7.9 సెం. మీ
కార్వాన్ 7.6 సెం. మీ
నాంపల్లి 7.6 సెం. మీ
సైదాబాద్ 7.4 సెం. మీ
గోల్కొండ 7.3 సెం. మీ
షేక్‌పేట 7.3 సెం. మీ
ఖైరతాబాద్ 7.1 సెం. మీ
చార్మినార్ 6.8 సెం.మీ