ఫార్ములా ఈ-కారు రేసు, హెచ్‌ఎండీఏ నిధులపై కేటీఆర్‌పై ప్రశ్నల వర్షం
- ప్రతి ప్రశ్నకు రాష్ట్ర ప్రయోజనాల కోసమే చేశానంటూ జవాబులు?
- కేటీఆర్ వెంట లాయర్ రామచంద్రరావు
- సంక్రాంతి తర్వాత మళ్లీ పిలిచే అవకాశం
హైదరాబాద్, జనవరి 7 (విజయక్రాంతి): ఫార్ములా ఈ-రేసు కేసులో రూ.55 కోట్ల హెచ్‌ఎండీఏ నిధుల దుర్వినియోగంపై అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావును గురువారం విచారించింది. ఈ వ్యవహారంలో రూపాయి అనివీ నితి కూడా జరగలేదని కేటీఆర్ చెప్పినట్లు తెలిసింది.
అంతేకాకుండా ప్రభుత్వ విధానపరమైన నిర్ణయాలపై ప్రశ్నించే హక్కు ఏసీబీకి ఉండదని అధికారులతో చెప్పడం గమనా ర్హం. రాష్ట్ర ప్రయోజనాల కోసం తాను ఈ-రేసును తీసుకొచ్చినట్లు ఏసీబీ అధికారులు అడిగిన ప్రశ్నలకు కేటీఆర్ సమాధానం చెప్పినట్లు సమాచారం. ఈ సందర్భంగా కేటీఆర్‌పై ఏసీబీ అధికారులు ప్రశ్నల వర్షం కురిపించారు.
ఫార్ములా ఈ-కార్ రేసు హైదరాబాద్‌కు తీసుకురావాలన్న ఆలోచన ఎవరిది? హెచ్‌ఎండీఏ నుంచి ఎందుకు నగదు బదిలీ చేశారు? దీనికి ఆర్‌బీఐ అనుమతి తీసుకున్నారా? కేబినెట్ అప్రూవల్ ఉందా? ఇంతపెద్ద మొత్తం చెలిస్తున్నప్పుడు ఆర్థిక శాఖ అనుమతి ఎందుకు తీసుకోలేదు? విదేశీ కంపెనీకి నిధులను చెల్లించి..
మీరు ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించారనే విషయం మీకు తెలుసా? సీనియర్ ఐఏఎస్ అధికారి అర్వింద్ కుమార్, ఎంఏయూడీ ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిషోర్ ఇచ్చిన స్టేట్‌మెంట్లపై మీ అభిప్రాయం ఏంటి? ఇలా 5 ప్రధాన ప్రశ్నలు, పదుల సంఖ్యలో అనుబంధ ప్రశ్నలతో కేటీఆర్‌ను అధికారులు ఉక్కిరి బిక్కిరి చేశారు.
తనను మొత్తం 82 ప్రశ్నలను అడిగారని కేటీఆర్ విచారణ అనంతరం చెప్పారు. కానీ అన్ని ప్రశ్నలు అడగకపోవచ్చని తెలుస్తోంది. 35 నుచి 40 ప్రశ్నలు అడిగినట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. వీటిలో మెజార్టీ ప్రశ్నలకు ముక్తసరిగా కేటీఆర్ సమాధానం చెప్పినట్లు సమాచారం.
అలాగే, అవినీతి మీద ఏసీబీ అధికారుల ప్రశ్నలు అడిగినప్పుడు రాష్ట్ర ప్రయోజనాల కోసం అన్న పదాన్ని కేటీఆర్ పదేపదే వాడినట్లు తెలుస్తోంది. ఏసీబీ జాయింట్ డైరెక్టర్ రుతిరాజ్, అడిషనల్ ఎస్పీ శివరామ్ శర్మ, డీఎస్పీ మాజీద్ ఖాన్ కేటీఆర్‌ను విచారించారు.
కోర్టు అనుమతితో కేటీఆర్ తన లాయర్ రామచంద్రరావుతో కలిసి ఏసీబీ కార్యాలయానికి వెళ్లారు. అయితే రామచంద్రరావును లైబ్రెరీలో కూర్చొబెట్టిన ఏసీబీ అధికారులు.. ఆయనకు కనబడేలా దూరంగా విచారించారు. కేటీఆర్‌ను సంక్రాంతి తర్వాత మరోసారి ఏసీబీ పిలిచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
హెచ్‌ఎండీఏ నిధులను ఎలా మళ్లిస్తారు?
ఏసీబీ అధికారులు మొదట కేటీఆర్ స్టేట్‌మెంట్‌ను రికార్డు చేశారు. ఫార్ములా ఈ కేసులో 13(1)ఏ, 13(2) పీసీయాక్ట్, 409, 120బీ సెక్షన్ల కింద మోపిన అభియాగాలను మీరు ఒప్పుకొంటారా? అని ఏసీబీ అధికారులు అడగ్గా.. ఈ వ్యవహారంలో తాను అవినీతికి పాల్పడలేదని కేటీఆర్ చెప్పినట్లు తెలిసింది. ఆ తర్వాత తాము తయారుచేసుకున్న ప్రశ్నావళి ఆధారంగా అధికారులు కేటీఆర్‌ను విచారించారు.
‘వాస్తవానికి ఈ రేసు ఒప్పందం తెలంగాణ ఎంఏయూడీ, ఫార్ములా ఈ ఆపరేషన్(ఎఫ్‌ఈఓ), గ్రీన్‌కో కంపెనీల మధ్య జరిగింది. ఒప్పందం ప్రకారం ఈ మూడింటి మధ్య లావాదేవీలు జరగాలి. కానీ ఈ ఒప్పందంలో లేని హెచ్‌ఎండీఏ నుంచి నిధులను ఎలా చెల్లిస్తారు? క్యాబినెట్ అనుమతి లేకుండా, ఆర్థిక శాఖ అప్రూవల్ లేకుండా హెచ్‌ఎండీఏ నిధులను తరలించడం నేరం కాదా? ఇది తప్పు అని మీకు తెలియదా? ఒకవైపు ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా..
మరోవైపు అటు క్యాబినెట్, ఇటు ఆర్థిక శాఖ అనుమతి లేకుండా ఏకపక్షంగా ఎవరి ప్రయోజనం కోసం ఇష్టానుసారంగా హడావుడిగా డబ్బులు చెల్లించడం చెల్లించారు?’ అని ఏసీబీ అధికారులు అడిగినట్లు సమాచారం. అత్యవసర పరిస్థితుల్లో తాను డబ్బులు చెల్లించమని అధికారులను ఆదేశించినట్లు కేటీఆర్ ఒప్పుకున్నట్లు తెలిసింది.
రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడులు ఏవీ?
2022లో హైదరాబాద్‌లో నిర్వహించిన ఫార్ములా ఈ రేసింగ్ వల్ల రాష్ట్రానికి రూ.700కోట్లు పెట్టుబడులు వచ్చాయని కేటీఆర్ మీడియా సమావేశంలో అన్న మాటల అధారంగా కూడా ఏసీబీ అధికారులు ప్రశ్నించారు. పెట్టుబడులు ఎక్కడ వచ్చాయి?, రాష్ట్రంలో నిర్వహించిన రేసు విజయవంతమైతే ఇన్వెస్టర్లు ఎందుకు ముందుకు రాలే దు?, ప్రభుత్వం ఆ మొత్తాన్ని చెల్లించాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? అని అధికారులు ప్రశ్నలు సంధించారు. దీని కేటీఆర్ ముక్తసరిగా సమాధానం చెప్పినట్లు సమాచారం.
10.30 గంటలకు మొదలై.. 5.15 ముగిసి..
కేటీఆర్ ఉదయం 10గంటలకు నందినగర్‌లోని తన నివాసం నుంచి ఏసీబీ ఆఫీస్‌కు బయలుదేరారు. 10.30 గంటలకు ఏసీబీ అధికారులు విచారణ ప్రారంభించారు. మధ్యమధ్యలో పలుమార్లు టీ బ్రేక్ ఇచ్చారు. అలాగే మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో కేటీఆర్‌కు లంచ్ బ్రేక్ ఇచ్చారు. 2 గంటలకు తిరిగి విచారణ ప్రారంభించారు.
ఇదిలా ఉండగా.. కేటీఆర్ విచారణను ఆసాంతం ఆడియో, వీడియో రూపంలో అధికారులు రికార్డు చేశారు. ఇటీవల లగచర్ల విచారణ సమయంలో పట్నం నరేందర్ రెడ్డి చెప్పని కొన్ని అంశాలను కూడా పోలీసులు స్టేట్‌మెంట్‌లో రాశారని బీఆర్‌ఎస్ ఆరోపించిన నేపథ్యంలో అధికారులు ఈ జాగ్రత్తలు తీసుకున్నట్లు తెలిసింది.
మెలికపెట్టిన ఏసీబీ అధికారులు.. ఖంగుతున్న కేటీఆర్?
డబ్బులు ఇక్కడి నుంచి పోయిన మాట వాస్తవం. ఆ నగదు ఎక్కడికి పోయిందో కూడా ప్రభుత్వానికి స్పష్టత ఉంది. అలాంటప్పుడు అవినీతికి ఆస్కారం ఎక్కడుంది’ అని ఏసీబీ అధికారులను కేటీఆర్ ఎదురు ప్రశ్నించినట్లు తెలిసింది. అయితే డబ్బు ఎక్కడి నుంచి ఎక్కడికి పోయింది? అనేదానిపై అవగాహన ఉన్నదని, కాకుంటే అది నిబంధనలకు విరుద్ధంగా అక్రమమార్గంలో దారిమళ్లడం వల్లే తాము విచారిస్తున్నామని ఏసీబీ అధికారులు మెలికపెట్టడంతో కేటీఆర్ ఖంగుతున్నట్లు తెలిసింది.
అలాగే, గ్రీన్‌కో కంపెనీకి నిధులు చెల్లించిన తర్వాత.. అదే సంస్థ నుంచి బీఆర్‌ఎస్‌కు బాండ్ల రూపంలో సొమ్ము రావడంపైగా ఏసీబీ అధికారులు ప్రశ్నించినట్లు తెలిసింది. దీనికి కేటీఆర్ సరిగా సమాధానం చెప్పలేదని సమాచారం. ఇలా పలు ప్రశ్నలతో కేటీఆర్ నుంచి ఏసీబీ అధికారులు సమాధానాలను రాబట్టి రికార్డు చేసినట్లు చేశారు.
మీ వల్లే ఆర్‌బీఐ రూ.8 కోట్ల ఫైన్
వాస్తవానికి ఎఫ్‌ఈఓకు హెచ్‌ఎండీఏ నుంచి బదిలీ అయినది రూ.4౬కోట్లు. అయితే కేటీఆర్ హడావుడిగా ఆర్బీఐ అనుమతి లేకుండా ఫౌండ్ల రూపంలో లండన్ కంపెనీ ఎఫ్‌ఈఓకు బదిలీ చేశారు. దీంతో హెచ్‌ఎండీఏకు ఆర్‌బీఐ రూ.౯ కోట్ల ఫైన్ విధించింది. ఫలితంగా హెచ్‌ఎండీఏ నుంచి దుర్వినియోగమైన మొత్తం రూ.55 కోట్లకు చేరుకుంది.
మీ అనాలోచిత ఆదేశాల వల్లే రూ.౯ కోట్ల ఫైన్ పడింది. దీనిని మీరు బాధ్యత వహిస్తారా? అని ఏసీబీ అధికారులు అడగ్గా.. రాష్ట్ర ప్రయోజనాల కోసమే తాను హడావుడిగా నగదును బదిలీ చేయించినట్లు కేటీఆర్ సమాధానం చెప్పినట్లు సమాచారం.