calender_icon.png 17 January, 2025 | 12:25 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హాట్సాఫ్.. నరేషీ మీనా!

17-09-2024 12:00:00 AM

చిన్న చిన్న సమస్యలకే జీవితం అయిపోయిందనుకునే ఈ రోజుల్లో.. ప్రాణాన్ని నిలబెట్టుకొనేందుకు రి యాలిటీ షోకి వెళ్లింది 27 ఏళ్ల మహిళ. బ్రెయిన్ ట్యూ మర్.. ఈ పేరు వినగానే అందరూ భయపడతారు. మెదడులో కణితిని తలుచుకుంటూ జీవితం అయిపోయిం దంటూ బాధపడుతారు.

కానీ రాజస్థాన్‌లోని మాధోపూర్‌కి చెందిన 27 ఏళ్ల నరేషీ మీనా మాత్రం అందరిలా భయపడుతూ కూర్చోలేదు. తొణకని ఆత్మవిశ్వాసంతో కౌన్ బనేగా కరోడ్ పతి షాలో పాల్గొని రూ.యాభై లక్షలు గెలుచుకుంది. అలా ఈ సీజన్‌లో కోటి రూపాయలు ప్రశ్నకు చేరిన మొదటి కంటెస్టెంట్‌గా నిలిచింది. అయితే తన ప్రాణాలను కాపాడుకొనేందుకు కావాల్సిన డబ్బు కోసమే ఈ షోకి వచ్చానంటోంది ఈ ధీర వనిత. 

సాధారణ మధ్య తరగతి కుటుంబానికి చెందిన నరేషీకి బాగా చదువుకొని కలెక్టరవ్వాలన్నది కల. గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో తొమ్మిదో తరగతి వరకు విద్యాభ్యాసం పూర్తి చేసి, ఆ తర్వాత సవాయి మాధోపూర్‌లోని సురభి పబ్లిక్ స్కూల్‌లో 12వ తరగతి, 2015లో బీఏలో, 2017లో హిస్టరీ, పాలిటికల్ సైన్స్, హిందీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. ఆ తర్వాత పాలిటికల్ సైన్స్‌లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. 

అమ్మ నగలన్నీ అమ్మేసి.. 

అయితే సివిల్స్‌కి ప్రిపేర్ అవుతున్న సమయంలో నరేషీకి ఓసారి తీవ్రమైన తలనొప్పి వచ్చింది. ఎన్ని మందులు వాడినా తగ్గలేదు. వైద్య పరీక్షలు చేయిస్తే మెదడులో కణితి ఉందని చెప్పారు. తొలగించకపోతే ప్రాణాలకే ప్రమాదం అన్నారు. ఆర్థిక పరిస్థితి బలహీనంగా ఉన్నప్పటికీ అమ్మ నగలన్నీ అమ్మేసి 2019లో సర్జరీ చేయించారు. అయితే కణితిని పూర్తిగా తొలగించలేదు. అది సున్నితమైనచోట ఉండటంలో మూడొంతులు మాత్రమే తీశారు. పూర్తిగా పోవాలంటే ప్రోటాన్ థెరపీ చేయించాలని చెప్పారు. దానికోసం రూ.30 లక్షలు ఖర్చవుతాయని డాక్టర్లు వెల్లడించారు. 

అమితాబ్ బచ్చన్ భరోసా..

తీవ్రమైన తలనొప్పి వేధిస్తున్నా చదువును మాత్రం పక్కన పెట్టలేదు నరేషీ. ఖర్చుల కోసం విమెన్స్ ఎంపవర్‌మెంట్ డిపార్టుమెంట్‌లో సూపర్ వైజర్‌గా చేరింది. ఉద్యోగం చేస్తూనే సివిల్స్ ప్రిలిమినరీ పాసయ్యింది. ఆ సమయంలోనే కేబీసీకి వెళ్లాలనుకుంది. ఒకవేళ అందులో గెలిస్తే వచ్చే డబ్బుతో సర్జరీ చేయించుకోవచ్చని అనుకుంది. వెంటనే అప్లు చేసి షోకి ఎంపికయ్యింది. తన గురించి తెలుసుకున్న అమితాబ్ బచ్చన్ షోలో గెలిచినా ఓడినా సర్జరీ చేయిస్తానని భరోసానిచ్చారు. ఫైనల్‌గా ఆ షోలో 50 లక్షల రూపాయలు గెలుచుకొని ఎందరికో ఆదర్శంగా నిలిచారు నరేషీ మీనా.