calender_icon.png 6 February, 2025 | 12:19 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వేడెక్కిన ఢిల్లీ

01-02-2025 12:00:00 AM

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం రోజురోజుకూ వేడెక్కుతోంది. ఎన్నికలకు మరో అయిదు రోజులు మాత్రమే ఉండగా శుక్రవారం ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన ఏడుగురు ఎమ్మెల్యేలు పార్టీకి రాజీనామా చేసి కేజ్రీవాల్‌కు భారీ షాక్ ఇచ్చారు. భారతీయ జనతా పార్టీతో నువ్వా, నేనా అన్నట్లుగా పోరు జరుగుతున్న వేళ కేజ్రీవాల్‌పైనా, పార్టీపైనా విశ్వాసం కోల్పోయినట్లు ప్రకటిస్తూ ఈ ఎమ్మెల్యేలు రాజీనామా చేయడంతో ఒక్కసారిగా ఢిల్లీ రాజకీయాలు మారిపోయాయి.

గత ఎన్నికల్లో ఆప్ టికెట్‌పై గెలిచిన ఈ ఎమ్మెల్యేలకు ఈ సారి ఎన్నికల్లో పోటీ చేసేందుకు టికెట్లు లభించలేదు. వాస్తవానికి ఆప్ అసెంబ్లీ ఎన్నికల కోసం తన అభ్యర్థుల జాబితాను దాదాపు నెల రోజుల ముందే ప్రకటించింది. కానీ అప్పుడు  ఈ ఎమ్మెల్యేల్లో ఎవరు కూడా తమ అసంతృప్తిని బైటపెట్టకుండా ఎన్నికలు సమీపించిన తరుణంలో పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించడం గమనార్హం.

వాస్తవానికి ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల వేడి షెడ్యూల్ ప్రకటించడానికి ముందే ప్రారంభమైంది. లిక్కర్ కుంభకోణం కేసులో బెయిలుపై జైలునుంచి విడుదలైన తర్వాత కేజ్రీవాల్ సీఎం స్థానంలోతనకు బదులుగా అతీశీని నియమించి తాను అసెంబ్లీ ఎన్నికలపైనే దృష్టిపెట్టడం ద్వారా మరోసారి ఢిల్లీ పీఠాన్ని దక్కించుకోవడానికి రంగం సిద్ధం చేసుకున్నారు.

అదే క్రమంలో అందరికన్నా ముందుగా మొత్తం 70 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించి ప్రచారం కూడా మొదలు పెట్టారు. మరోవైపు 23 ఏళ్లుగా దేశ రాజధానిలో అధికారానికి దూరంగా ఉన్న బీజేపీ ఈ సారి ఎలాగైనా ఢిల్లీ కోటపై కాషాయ జెండాను ఎగరేయాలని సర్వశక్తులూ ఒడ్డుతుండడంతో  ఈ రెండు పార్టీల మధ్య ముఖాముఖి పోటీ ఖాయమని అందరూ భావించారు.

పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకున్నా అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం ఆ పార్టీతో  పొత్త్తు ఉండదని  కేజ్రీవాల్ ప్రకటించడంతో ఒకప్పుడు ఢిల్లీలో తిరుగులేని శక్తిగా ఉన్న కాంగ్రెస్ పార్టీ అనివార్యంగా బరిలో దిగాల్సి వచ్చింది. దీంతో ఆప్, బీజేపీ మధ్య ముఖాముఖి పోటీ కాస్తా ముక్కోణపు పోటీగా మారింది.

అయితే నామినేషన్ల ఘట్టం ముగిసి ప్రచారపర్వం మొదలైనప్పటినుంచీ కాంగ్రెస్ పోటీ నామమాత్రంగా మారింది. ఆప్, బీజేపీల మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణలతో వణికించే చలిలో సైతం ఢిల్లీ వాతావరణం వేడెక్కి పోయింది. ప్రచార సభల్లో  రాజకీయ పార్టీలపై విమర్శలు చేయడం, దానికి దీటుగా ప్రత్యర్థులు ఎదురు దాడి చేయడం సహజం.

కానీ కేజ్రీవాల్  కొద్ది రోజుల క్రితం ఓ ఎన్నికల సభలో మాట్లాడుతూ ఢిల్లీ ప్రజలు తాగడానికి వాడే యమునా నది జలాల్లో హర్యానా ప్రభుత్వం విషం కలుపుతోందంటూ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. తనపై కోపం ఉంటే తనను అరెస్టు చేయండి కానీ ఢిలీ ్లప్రజలను చంపకండంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు రెండురాష్ట్రాల మధ్య వివాదంగా మారింది.

దీనిపై హర్యానాలోని బీజేపీ ప్రభుత్వం ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేయడం, వివరణ కోరుతూ ఈసీ కేజ్రీవాల్‌కు నోటీసులు పంపడం జరిగిపోయాయి. అయితే కేజ్రీవాల్ ఓ మెట్టు కూడా తగ్గలేదు సరికదా, తాను చేసిన వ్యాఖ్యలను మరింత రాజకీయం చేశారు. ఈసీతో పాటుగా ప్రధానికి, హర్యానా ముఖ్యమంత్రికి యమునా నది నీళ్లను పంపుతానని, ఆ నీళ్లను వారు తాగితే తాను క్షమాపణ చెప్పడానికి సిద్ధమంటూ మరింత దూకుడు పెంచారు.

దీంతో ఈ సమస్యను విషప్రయోగం అంశంతో ముడిపెట్టకుండా  వాస్తవాలతో నివేదిక శుక్రవారం ఉదయానికల్లా సమర్పించాలని ఢిల్లీ జల్‌బోర్డును ఈసీ ఆదేశించింది. జల్‌బోర్డు ఏం వివరణ ఇస్తుంది, దీనిపై ఈసీ ఏం చర్యలు తీసుకుంటుందనే విషయం అటుంచితే, ప్రచారపర్వంలో ఇరుపార్టీలు ఎంతగా దిగజారి వ్యవహరిస్తున్నాయో గత మూడు, నాలుగు రోజులుగా జరుగుతున్న ఘటనలు అద్దం పడుతున్నాయి. ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడుతారనేది పక్కనపెడితే ఇలాంటి ప్రచారం ప్రజాస్వామ్యానికి ఎంతమాత్రం మంచిది కాదు.