మంథని హాస్టల్లో బాలికకు నగ్న పూజల పేరిట వంట మనిషి వల
రాత్రి హాస్టల్ వర్కర్ ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్న పోలీసులు
మంథని లో కలకలం రేపిన ఘటన
మంథని,(విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా మంథని పట్టణంలోని ఓ హాస్టల్లో విద్యార్థినికి నగ్న పూజల పేరిట హాస్టల్ వంట మనిషి వల వేసిన ఘటన మంథని పట్టణంలో సోమవారం రాత్రి కలకలం సృష్టించింది. హాస్టల్లో ఉంటున్న ఓ బాలికకు డబ్బు ఆశ చూపి మహిళ వంట మనిషి నగ్న పూజలకు సహకరించాలని కోరింది. నగ్న పూజలు చేస్తేనే లక్ష్మి కటాక్షిస్తుందని నమ్మించి, వారం రోజుల క్రితం హాస్టల్ వర్కర్ కొందరు పూజలు చేసే వారిని సంప్రదించినట్లు సమాచారం. దీంతో ఆందోళన చెందిన బాలిక హాస్టల్ నుంచి తప్పించుకుని బంధువుల ఇంటికి వెళ్లి వారం రోజులుగా అక్కడే ఉండి, సోమవారం తల్లిదండ్రులు రావడంతో వారికి విషయం మొత్తం తెలిపింది. దీంతో బాలిక బంధువులు, తల్లిదండ్రులు హాస్టల్ కు చేరుకోని వంట మనిషిని నిలదీశారు. ఆమెతో వాగ్వాదానికి దిగడంతో హాస్టల్ వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పోలీసులకు సమాచారం అందడంతో మంథని సీఐ రాజు, ఎస్ఐ రమేష్, హాస్టల్ వద్దకు వెళ్ళి విచారణ చేపట్టారు. గత కొంతకాలంగా మంథని నడిబొడ్డున ఉన్న ప్రభుత్వ హాస్టల్లో పేద ఆడపిల్లలకు లక్ష్మి కటాక్షం పేరుతో వ్యభిచారం చేయిస్తున్నారని, ప్రచారం, నిన్నటి సంఘంటనతో వెలుగులోకి వచ్చింది. మంథనిలో గత కొన్ని రోజులుగా అక్రమ దందాలపై ఉక్కు పాదం మొపుతున్న పోలీసులు వ్యభిచార దందాను, నిర్వాహకులను పట్టుకొని కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. ప్రలోభ పెట్టిన మహిళను అదుపు లోకి తీసుకుని పోలీసుస్టేషన్ కు తరలించారు. బాలిక తల్లిదండ్రులు స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేశారు. దీంతో మంథని లో ఈ ఘటన ఒక్కసారిగా సంచలనం సృష్టించింది.