calender_icon.png 18 March, 2025 | 6:46 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హాస్టల్ వార్డెన్ శ్రీనివాస్ ను సస్పెండ్ చేసి విధుల నుంచి శాశ్వతంగా తొలగించాలి

17-03-2025 06:48:36 PM

బెల్లంపల్లి (విజయక్రాంతి): బెల్లంపల్లి ఎస్సీ బాయ్స్ పోస్ట్ మెట్రిక్ హాస్టల్ వార్డెన్ కోరుట్ల శ్రీనివాసును సస్పెండ్ చేసి విధుల నుండి శాశ్వతంగా తొలగించాలని కోరుతూ సోమవారం మంచిర్యాల జిల్లా కేంద్రంలోని సాంఘిక సంక్షేమ శాఖ కార్యాలయంలో డిడి కి ఐక్య విద్యార్థి సంఘాల నాయకులు వినతిపత్రం అందజేశారు. అనంతరం ఐక్య విద్యార్థి సంఘాల జేఏసీ చైర్మన్ చిప్పకుర్తి శ్రీనివాస్ మాట్లాడుతూ.... బెల్లంపల్లి పట్టణంలో ఎస్సీ బాయ్స్ పోస్ట్ మెట్రిక్ హాస్టల్లో విద్యార్థులకు కనీస సౌకర్యాలు కల్పించకుండా, మెనూ ప్రకారం భోజనం పెట్టకుండ అరటి పండ్లు, కోడిగుడ్లు కొన్ని రోజుల నుండి ఇవ్వకుండా విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం పెట్టకుండా పెట్టినట్టు రికార్డుల్లో తప్పుడు లెక్కలు చూపెడుతు విద్యార్థుల కడుపులు కొట్టి దోచుకుంటున్నాడని ఆరోపించారు.

అంతేకాకుండా గతంలో మందమర్రిలో హాస్టల్ వార్డెన్ గా విధులు నిర్వహిస్తున్న సందర్భంలో విద్యార్థుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడం వలన విద్యార్థుల మధ్య ఘర్షణ జరిగి ఒక విద్యార్థి చనిపోవడం జరిగిందని తెలిపారు. విద్యార్థి చావుకు కారణమైన వార్డెన్ కోరుట్ల శ్రీనివాస్ ను సస్పెండ్ చేశారని, అతనిపై విచారణ  జరుగుతున్న సందర్భంలో అతనికి మళ్లీ బెల్లంపల్లి ఎస్సీ హాస్టల్లో వార్డెన్ గా బాధ్యత ఇవ్వడం వల్ల విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం పెట్టకపోవడంతో విద్యార్థుల రోడ్లపైకి వచ్చి నిరసన వ్యక్తం చేయాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. విద్యార్థులకు పరీక్షల సమయంలో వారి యొక్క జీవితాలతో చెలగాటమాడుతూ విద్యార్థుల బంగారు భవిష్యత్తును నాశనం చేస్తున్నారని ఆరోపించారు.

దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇలాంటివి సంఘటనలు పునరావృతం కాకుండా తక్షణమే విచారణ జరిపించి వార్డెన్ పై చర్యలు తీసుకొని సస్పెండ్ చేసి శాశ్వతంగా విధులు నుండి తొలగించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ విద్యార్థి జనసమితి జిల్లా అధ్యక్షుడు బచ్చలి ప్రవీణ్ కుమార్, తెలంగాణ విద్యార్థి సమైక్య జిల్లా అధ్యక్షుడు రేగుంట క్రాంతి కుమార్ తదితరులు పాల్గొన్నారు.