- వనపర్తి జిల్లా కేంద్రంలో ఘటన
- ప్రైవేటు పాఠశాల ఎదుట విద్యార్థి సంఘాల ఆందోళన
వనపర్తి, డిసెంబర్ 21 (విజయక్రాంతి): హాస్టల్‌లో ఉంటున్న విద్యార్థి విద్యుత్‌షాక్‌కు గురై మృతిచెందిన ఘటన వనపర్తి జిల్లా కేంద్రంలో శనివారం జరిగింది. వనపర్తి జిల్లా చిన్నంబావి మండలం పెద్దమారు గ్రామానికి చెందిన శిరీష, భాస్కర్‌రావు దంపతుల కుమారులు హరీశ్ (15), గౌతమ్ ఇద్దరు జిల్లా కేంద్రానికి సమీపంలో గల రేడియంట్ పాఠశాలలో చదువుతున్నారు. పాఠశాలకు చెందిన హాస్టల్‌లోనే ఉంటున్నారు. 9వ తరగతి చదువుతున్న హరీశ్ రోజు మాదిరిగా శనివారం ఉదయం స్నానం చేశాడు.
అనంతరం మరో విద్యార్థితో కలిసి హాస్టల్ పక్కన గల వేరుశనగ పంట వేసిన పొలం వద్దకు వెళ్లారు. పంటకు రక్షణగా పెట్టిన విద్యుత్ వైర్లను గమనించని హరీశ్ వేరుశనగ కోసం వెళ్తున్న క్రమంలో విద్యుత్ వైర్లు తగిలి షాక్‌కు గురై అక్కడికక్కడే మృతి చెందాడు. అది చూసిన మరో విద్యార్థి పాఠశాల యాజమాన్యానికి చెప్పాడు. పాఠశాల సిబ్బంది హరీశ్‌కు సీపీఆర్ చేసి జిల్లా ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందాడని నిర్ధారించారు.
హరీశ్ తల్లిదండ్రులు ఆసుపత్రికి చేరుకుని కొడుకు మృతదేహాన్ని చూసి కన్నీరుమున్నీరుగా విలపించారు. పాఠశాల యాజమాన్యం నిర్లక్ష్యం, పర్యవేక్షణ లోపం కారణంగా విద్యార్థి మృతి చెందాడని విద్యార్థి సంఘాల నాయకులు పాఠశాల ఎదుట బైఠాయించారు. హరీశ్ తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.