- బషీర్‌బాగ్‌లో నిజాం కాలేజీ విద్యార్థుల ధర్నా
- రోడ్డుపై బైఠాయింపు.. ట్రాఫిక్ జాం
హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 5 (విజయక్రాంతి): నిజాం కాలేజీలోని గర్ల్ల్‌స హాస్టల్‌లో డిగ్రీ విద్యార్థినులకు మాత్రమే అడ్మిషన్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు సోమవారం బషీర్‌బాగ్ చౌరస్తాలో ఆందోళనకు దిగారు. తమ డిమాండ్ నెరవేరే వరకు కదిలేది లేదని రోడ్డుపై బైఠాయించారు. విద్యార్థులు మాట్లాడుతూ.. 2022లో డిగ్రీ విద్యార్థినుల కోసం నిజాం కాలేజీ ఆవరణలో హాస్టల్‌ను నిర్మించారని.. ఆ ఏడాది డిగ్రీలో విద్యార్థులు తక్కువగా ఉన్నందున అదే హాస్టల్‌లో డిగ్రీ విద్యార్థులతో పాటు పీజీ విద్యార్థులకు అడ్మిషన్లు ఇచ్చారని చెప్పారు. అయితే ఈ ఏడాది డిగ్రీలో అడ్మిషన్లు ఎక్కువ రావడంతో హాస్టల్‌లో చేరేవారి సంఖ్య ఎక్కువగా ఉన్నప్పటికీ రూమ్‌లు లేకపోవడంతో విద్యార్థినులు ప్రైవేట్ హాస్టళ్లలో ఉండి ఆర్థికభారంతో చదువుతున్నారన్నారు.
పీజీ విద్యార్థులకు వేరే హాస్టల్ కేటాయించి డిగ్రీలో అవసరం ఉన్నవారందరికీ హాస్టల్ గదులను కేటాయించాలని డిమాండ్ చేశారు. కళాశాల ప్రిన్సిపాల్ బయటకు వచ్చి స్పష్టమైన హామీ ఇచ్చేవరకు ఆందోళన కొనసాగిస్తామని హెచ్చరించారు. దీంతో లిబర్టీ నుంచి అబిడ్స్‌కు వెళ్లే మార్గంలో భారీగా వాహనాలు ఆగిపోవడంతో ట్రాఫిక్ జాం అయ్యింది. ఎంతచెప్పినా వినకపోవడంతో ఆందోళన చేస్తున్న విద్యార్థులను అబిడ్స్ పోలీసులు అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు.