calender_icon.png 29 October, 2024 | 12:00 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కొంప ముంచుతున్న హైసెక్యూరిటీ ప్లేట్లు

14-07-2024 12:58:32 AM

కాంట్రాక్టర్ నిర్లక్ష్యంతో ఇబ్బందులు పడుతున్న వాహనదారులు

హెచ్‌ఆర్‌ఎస్‌పీ బిగించినా ఆన్‌లైన్‌లో నమోదు చేయని వైనం

రాష్ట్రవ్యాప్తంగా 6 లక్షలకు పైగా లావాదేవీలు బంద్

బాధ్యత తీసుకునేందుకు ముందుకు రాని ఉన్నతాధికారులు

నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేట సమీపంలోని చౌటపల్లికి చెందిన భాస్కర్ అనే వ్యక్తి తన ట్రాక్టర్ (టీఎస్31సీ8030)ను తన సమీప బంధువుకు విక్రయించాడు. బ్యాంకులో తాకట్టు ముగిసిన తర్వాత పత్రాలు తీసుకుని వాహనం రీరిజిస్ట్రేషన్ కోసం అర్టీఏ కార్యాలయానికి వెళ్తే  హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్ ఫిట్టింగ్ చేయలేదని, కాబట్టి స్లాట్ బుకింగ్ చేసేందుకు అవకాశం లేదని అధికారులు తెలిపారు.  దీంతో అడ్వాన్స్‌గా డబ్బులు ఇచ్చిన వ్యక్తి ట్రాక్టర్ ఓనర్‌తో గొడవ పడి తన డబ్బులు తాను తీసుకువెళ్లాడు.. ఇది ఒక్క భాస్కర్‌కు ఎదురైన పరిస్థితి మాత్రమే కాదు. తెలంగాణ వ్యాప్తంగా సుమారు 6 లక్షలకు పైగా వాహనాలకు ఇదే పరిస్థితి ఎదురవుతోంది. 2019కు ముందు హెచ్‌ఎస్‌ఆర్‌పీ బిగించుకోని వారు తప్పనిసరిగా 2024 ఫిబ్రవరి 17 నాటికి హెచ్‌ఎస్‌ఆర్‌పీ బిగించుకోవాల్సిందేనని రవాణా శాఖ స్పష్టం చేసింది.  అధికారులు మాత్రం ఎలాంటి సమాధానం చెప్పడం లేదు.  

హైదరాబాద్, జూలై 13 (విజయక్రాంతి): సాధారణ నెంబర్ ప్లేట్ల స్థానంలో అధిక భద్రతను ఇచ్చేవిగా పేర్కొంటూ కేంద్రం హైసెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్ (హెచ్‌ఎస్‌ఆర్‌పీ)లను తీసుకువచ్చింది. 2001లోనే వీటిని తీసుకొచ్చినా 2014లో ఎన్డీఏ సర్కారు వచ్చిన తర్వాత వీటిని అమలు చేశారు. తెలంగాణలో 2015లో హెచ్‌ఎస్‌ఆర్‌పీని ప్రవేశపెట్టగా ఆర్టీసీ, రవాణా శాఖ ఆధ్వర్యంలో ఓ కాంట్రాక్టర్‌కు వీటిని బిగించే బాధ్యతను అప్పగించారు. 2019 వరకు కాంట్రాక్టర్ గడువు ముగిసింది.

అయితే సద రు కాంట్రాక్టర్ చాలా వాహనాలకు నెంబర్ ప్లేట్లు బిగించలేదు. ఫలితంగా వాటి రిజిస్ట్రేషన్ పూర్తయినా హెచ్‌ఎస్‌ఆర్‌పీ బిగించ కపోవడంతో పాటు ఆన్‌లైన్‌లో వాటి ఎంట్రీ నమోదు కాలేదు. నెంబర్ ప్లేట్ లేకుంటే ఏమవుతుందిలే అనుకున్న వినియోగదారులు బయట సాధారణ నెంబర్ ప్లేట్లు బిగించుకుని వాడుతున్నారు. ఆ వాహనాలను ఇతరులకు విక్రయించే సమ యంలో లేదా వాటి హైపోథికేషన్ (తాకట్టు) ముగిసిన సమయంలో తమ పేరిట చేయించు కునేందుకు వెళ్లినప్పుడు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇక్కడే రవాణా శాఖ అధికా రులు పట్టించుకోకుండా చేతులెత్తేస్తున్నారు. దీంతో వేలాది మంది వాహనదారులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు.

ఏమిటీ హెచ్‌ఎస్‌ఆర్‌పీ 

2015 వరకు ఏదైనా వాహనం కొనుగోలు చేస్తే ఆర్టీఏ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ పూర్తయిన తర్వాత నెంబర్ అలాట్ అయిన వెంటనే బయట రేడియం వర్క్స్ వద్దకు వెళ్లి నంబర్ స్టిక్కరింగ్ చేయించుకునే వాళ్లు. అయితే ఈ నంబర్ ప్లేట్లకు అంత భద్రత ఉండదని భావించిన కేంద్ర ప్రభుత్వం హెచ్‌ఎస్‌ఆర్‌పీని అమల్లోకి తీసుకువచ్చారు. ఆర్టీసీ ద్వారా ఓ కాంట్రాక్టర్‌కు ఈ బాధ్యతను అప్పగించారు. బైక్‌కు రూ.245, ఫోర్ వీలర్‌కు రూ.625 ఛార్జి వసూలు చేశారు. వాహనం రిజిస్ట్రేషన్ తర్వాత కాంట్రాక్టర్ వద్దకు వెళ్తే నంబర్ ప్లేట్‌ను బిగించేవారు. హెచ్‌ఎస్‌ఆర్‌పీ ద్వారా వాహనాల ప్లేట్లకు ఏకరూపత ఉంటుందని ప్రభుత్వం భావించింది. ఈ ప్లేట్‌పై ఉండే హోలోగ్రాంలో వాహన పూర్తి సమాచారం ఉంటుంది. 

అధికారుల బాధ్యతారాహిత్యం...

2019 మార్చితో కాంట్రాక్టర్ గడువు ము గిసింది. 2019 ఏప్రిల్ 1 నుంచి డీలర్లే హెచ్‌ఎస్‌ఆర్‌పీ బిగించేలా ప్రభుత్వం నిబంధనలు తీసుకువచ్చింది. వాహనం కొన్న చోటే ప్లేట్ బిగించడం ద్వారా 100 శాతం సాధ్యమైంది. అయితే సమస్యంతా కాంట్రాక్టర్ బిగించిన కాలంలో (2015 2019 మధ్య) జరిగిన నిర్లక్ష్యమే కారణంగా తెలుస్తోంది. కాంట్రాక్టర్ బిగించకపోవడంతో వాహనదారులు సొంతంగా బయట సాధారణ ప్లేట్‌ను అమర్చుకున్నారు. ఇప్పుడు వారికి సమస్యలు ఎదురవుతున్నాయి. హెచ్‌ఎస్‌ఆర్‌పీ లేనట్లుగా ఆన్‌లైన్‌లో నమోదు కావడంతో సదరు వాహనానికి సంబంధించి ఎలాంటి ట్రాన్సాక్షన్‌కు సర్వర్ అనుమతించడంలేదు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు ఇలాంటి 6 లక్షల వాహనాలు ఉన్నాయి. దీంతో అనేక మంది ఆటో, ట్రాక్టర్లు, జేసీబీలు, కార్లు, ఇతర వాహనాల యజమా నులు ఈ సమస్యతో ఇబ్బందులు పడుతున్నారు.

వివరణ ఇచ్చేందుకు నిరాకరణ

ఈ విషయంలో అధికారులు ఏమాత్రం పట్టించుకునడం లేదు. తూతూమంత్రంగా ఓ కమిటీ వేశారు. నివేదిక అనంతరం ఫలితం మాత్రం శూన్యం. 2019 వరకు హెచ్‌ఎస్‌ఆర్‌పీ సమస్య ఉన్న వాహనాలకు సంబంధించి ఆన్‌లైన్‌లో ఉన్న లాక్‌ను తొలగించి స్లాట్ బుకింగ్ చేసేందుకు అవకాశం ఇస్తే సరిపోతుంది. అయితే ఇందుకు ఓ వ్యవస్థను ఏర్పాటు చేసి నెంబర్ ప్లేట్ల బిగింపు కార్యక్రమం చేపట్టాలనే ఆలోచన కూడా అధికారుల్లో కనిపించడం లేదు. హెచ్‌ఎస్‌ఆర్‌పీ వ్యవహారంపై ఖైరతాబాద్‌లోని రాష్ట్ర రవాణా శాఖ కార్యాలయంలో సంప్రదిస్తే కనీసం వివరణ ఇచ్చేందుకూ ఉన్నతాధికారులు ముందుకు రాకపోవడం గమనార్హం. ఇది తమకు సంబంధం లేదంటూ తప్పించుకునే ప్రయత్నం చేశారు.

కమిషనర్‌ను కలిసేందుకు ప్రయత్నిస్తే ఆయన అందుబాటులోకి రాలేదు. అయితే హెచ్‌ఎస్‌ఆర్‌పీ బిగించని వాహనాలకు నంబర్ ప్లేట్లను స్థానికంగా ఉండే ఆయా కంపెనీల షోరూం డీలర్లకు అప్పగించాలనే యోచనలో అధికారులు ఉన్నా నేటికీ అది అమలు కావడం లేదని, రాష్ట్ర అధికారి పట్టించుకోవడం లేదని పేరు చెప్పేందుకు ఇష్టపడని అధికారి ఒకరు తెలిపారు. దీనిపై వాహనదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అయినా స్పందించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

క్యాన్సర్ వచ్చిందని ట్రాక్టర్ అమ్మాడు 

మా గ్రామానికే చెందిన ఓ వ్యక్తి తనకు క్యాన్సర్ రావడంతో ఆర్థిక పరిస్థితి బాగోలేక తన ట్రాక్టర్‌ను నాకు విక్రయించాడు. రూ.1 లక్ష అడ్వాన్సుగా ఇచ్చాను. అయితే ఇప్పుడు ఆ ట్రాక్టర్‌ను నా పేరిట రిజిస్ట్రేషన్ చేయించుకునేందుకు వెళ్తే హెచ్‌ఎస్‌ఆర్‌పీ నాట్ ఫిట్టెడ్ అని ఆన్‌లైన్‌లో వస్తుందని, స్లాట్ బుకింగ్‌కు అవకాశం లేదని స్థానిక ఆర్టీఏ అధికారులు చెబుతున్నారు. దాంతో బ్యాంకు అప్పు తీరినా ట్రాక్టర్ ఓనర్ పేరిట మారడంలేదు. ఇప్పుడు ఇంకా బ్యాంక్ పేరిటే ట్రాక్టర్ ఉంది. ఇప్పటికే నేను రూ.1 లక్ష ఇచ్చాను. నా పేరిట మారిస్తే తప్ప మిగతా రూ.1 లక్ష ఇచ్చే పరిస్థితి లేదు. దీంతో ఆయన ట్రాక్టర్ అమ్మినా నేను కొన్న ఉద్దేశం నెరవేరలేదు. అధికారులను ఎన్నిసార్లు అడిగినా స్పందించడం లేదు. 

 మద్దిలేటి గౌడ్, మదనాపూర్, వనపర్తి జిల్లా

అధికారులు పట్టించుకోవడంలేదు 

నేను కోస్గికి చెందిన ఓ వ్యక్తి నుంచి జేసీబీని కొన్నాను. రిజిస్ట్రేషన్ కోసం మహబూబ్‌నగర్ ఆర్టీఓ కార్యాలయానికి వెళ్తే హెచ్‌ఎస్‌ఆర్‌పీ నాట్ ఫిట్టెడ్ అని వస్తోందని, అందుకే స్లాట్ బుక్ అవ్వడం లేదని చెప్పారు. మాకు సంబంధం లేదని అక్కడి అధికారి చెప్తున్నాడు. మా వాహనానికి నంబర్ ప్లేట్ బిగించారు. కానీ ఆన్‌లైన్‌లో ఎంట్రీ చేయలేదు. ఫలితంగా మాకు ఈ సమస్య ఏర్పడింది. ఈ మెయిల్ చేయమన్నారు. చేసినా స్పందన లేదు. హైదరాబాద్‌లోని ఉన్నతాధికారులకు ఫోన్ చేస్తే కూడా పట్టించుకోవడంలేదు. ఈ సమస్య పరిష్కారానికి అధికారులు పట్టించుకోకపోవడం దుర్మార్గం. లక్షలు చెల్లించి వాహనం కొనుగోలు చేశాను. ఇప్పుడు రిజిస్ట్రేషన్ కాకుంటే నాకు బ్యాంకు లోన్ రాదు. దీని వల్ల ఆర్థికంగా మాకు ఎంతో నష్టం ఏర్పడుతోంది. 

                                                      కూర మహిపాల్‌రెడ్డి, సిద్దిపేట