బడ్జెట్లో సీతారామన్ నెరవేరుస్తారా?
మరో రెండు రోజుల్లో జూలై 23న కేంద్ర బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నారు. బడ్జెట్ సమీపిస్తున్న నేపథ్యంలో ఆశలు, అంచనాలు పెరిగిపోతున్నాయి. ఆదాయపు పన్ను చెల్లింపుదారులైతే ఈ పలు పన్ను ప్రయోజనాల్ని ఆశిస్తున్నారు. స్టాండర్డ్ డిడెక్షన్ పెంపు, పన్ను రేట్ల తగ్గింపు, సెక్షన్ 80సీ మినహాయింపుల పెంపు తదితర ప్రయోజనాల్ని కోరుకుంటున్నారు. మరి సీతారామన్ వాటిని నెరవేరుస్తారన్న అంచనాలైతే బలంగా ఉన్నాయి. ఆదాయపు పన్ను శ్లాబ్ రేట్లలో కొన్ని సర్దుబాట్లు ఉండవచ్చని ట్యాక్స్ నిపుణులు భావిస్తున్నారు. మోదీ 3.0 ప్రభుత్వం తొలి బడ్జెట్లో కొన్ని పన్ను తగ్గింపుల్ని సైతం ప్రకటించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. పన్ను చెల్లింపుదార్లు, నిపుణుల అంచనాలు ఇలా ఉన్నాయి...
ఆదాయపు పన్ను మినహాయింపు పరిమితి
ప్రస్తుతం పాత పన్ను విధానంలో రూ.5 లక్షలు , కొత్త పన్ను విధానంలో రూ.7 లక్షల పన్ను ఆదాయం వరకూ పన్ను లేదు. కానీ ఈ పరిమితిని దాటితే పన్ను లెక్కింపు పాత విధానంలో రూ.2.50 లక్షల నుంచి, కొత్త విధానంలో రూ.3 లక్షల నుంచే మొదలవుతుంది. అంటే వాస్తవానికి పన్ను మినహాయింపు రూ.2.50 లక్షలు, రూ. 3లక్షల వరకూ మాత్రమే ఉన్నది. ఆ తర్వాత రూ.5 లక్షలు, రూ.7 లక్షల వరకూ రిబేటు రూపంలో మినహాయింపు లభిస్తుంది. వచ్చే బడ్జెట్లో కొత్త పన్ను విధానంలో ఆదాయపు పన్ను మినహాయింపు పరిమితిని రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షల వరకూ పెంచవచ్చని ఇప్పటికే వార్తలు వెలువడుతున్నాయి.
ఈ మేరకు మినహాయింపు పరిమితిని రూ.5 లక్షలకు పెంచితే స్టాండర్డ్ డిడెక్షన్, 87ఏ ద్వారా లభించే రిబేటు ద్వారా రూ.8.5 లక్షల ఆదాయం వరకూ పన్ను ఉండబోదని చార్టర్డ్ అకౌంటింగ్ సంస్థ గుప్తా సచ్‌దేవ్ అండ్ కో పార్టనర్ గౌరవ్ గుంజాన్ తెలిపారు. ఈ బడ్జెట్లో గణనీయమైన పన్ను సంస్కరణల్ని తాము అంచనా వేస్తున్నామని జీఐ గ్రూప్ హోల్డింగ్ ఫైనాన్స్ డైరెక్టర్ కుల్జీత్ సింగ్ చెప్పారు. ఆదాయపు పన్ను శ్లాబ్‌ల సవరణ, బేసిక్ పన్ను మినహాయింపు పరిమితి పెంపు ప్రతిపాదనల్ని ఆశిస్తున్నామన్నారు.
పన్ను రేట్ల తగ్గింపులు
ట్యాక్స్‌పేయర్లు కొత్త పన్ను విధానంలోకి మళ్లేందుకు ప్రోత్సాహకంగా 2023 బడ్జెట్లో ప్రవేశపెట్టిన మార్పులు అంచనాలకు అనుగుణంగా లేవని డెలాయిట్ ఇండియా పార్టనర్ దివ్యా బవేజా చెప్పారు. అందుచేత ఈ బడ్జెట్లో కొత్త పన్ను విధానంలో గరిష్ఠ పన్ను రేటును 30 శాతం నుంచి 25 శాతానికి తగ్గించే ప్రతిపాదన ఉంటుందని అంచనా వేస్తున్నామని తెలిపారు. అలాగే పాత పన్ను విధానంలో గరిష్ఠ పన్ను రేటు శ్లాబ్‌ను రూ.10 లక్షల నుంచి రూ.20 లక్షలకు పెంచే అవకాశం ఉన్నదన్నారు.
హౌస్ రెంట్ అలవెన్స్ (హెచ్‌ఆర్‌ఏ)
ఇండ్ల అద్దెలు గణనీయంగా పెరిగిన ప్రభావాన్ని తట్టుకునేందుకు హౌస్ రెంట్ అలవెన్స్ (హెచ్‌ఆర్‌ఏ) మినహాయింపు పరిమితులను పెంచాల్సిన అవసరం ఉన్నదని కైలాశ్ చాంద్ జైన్ పార్టనర్ అభిషేక్ జైన్ చెప్పారు. హెల్త్‌కేర్ వ్యయాలు కూడా బాగా పెరిగినందున, సెక్షన్ 80డీ కింద మెడికల్ ఇన్సూరెన్స్ ప్రీమియం చెల్లింపులపై డిడెక్షన్ పరిమితిని పెంచుతారన్న అంచనాలు కూడా ఉన్నాయి. ప్రస్తుతం సాధారణ పౌరులకు రూ.25,000, సీనియర్ సిటిజన్లకు లభిస్తున్న రూ. 50,000 పరిమితిని రూ.50,000, రూ.75,000కు పెంచవచ్చని అచిత్ గుప్తా అంచనా వేశారు. ఈ ప్రయోజనాల్ని కొత్త పన్ను విధానానికీ విస్తరించే అవకాశం ఉన్నదన్నారు.
స్టాండర్డ్ డిడెక్షన్
ఎటువంటి సాక్ష్యాధారాలు, డాక్యుమెంట్లు సమర్పించకుండానే పన్ను ఆదాయాన్ని తగ్గించుకోవడానికి స్టాండర్డ్ డిడెక్షన్ ఉపకరిస్తుంది. స్టాండర్డ్ డిడెక్షన్ తొలిసారిగా రూ.40,000తో 2018 బడ్జెట్లో ప్రవేశపెట్టారు. దానిని 2019 బడ్జెట్లో రూ.50,000కు పెంచారు. అప్పటి నుంచి ఈ డిడెక్షన్ మొత్తంలో మాత్రం ఎటువంటి మార్పు చేయలేదు. ప్రస్తుతం పాత పన్ను విధానంలోగానీ, కొత్త పన్ను విధానంలోగానీ స్టాండర్డ్ డిడెక్షన్ రూ.50 వేలే. ఈ పరిమితిని వచ్చే బడ్జెట్లో రూ.60,000కు పెంచవచ్చని, రూ.70,000కు సైతం పెంచే అవకాశాలు ఉన్నాయని కన్సల్టెన్సీ సంస్థ ఏక్యూబ్ వెంచర్స్ డైరెక్టర్ అశీష్ అగర్వాల్ చెప్పారు.
సెక్షన్ 80సీ మినహాయింపు
జీతభత్యాలు పొందేవారు వివిధ పన్ను ఆదా సాధనాల్లో మదుపుచేసి, సెక్షన్ 80సీ మినహాయింపుల్ని ఉపయోగించుకోవడం ద్వారా ఒక ఆర్థిక సంవత్సరంలో వారి పన్ను ఆదాయాన్ని రూ.1.50 లక్షల వరకూ తగ్గించే వెసులుబాటు ఉంటుంది. ద్రవ్యోల్బణం భారీగా పెరిగినప్పటికీ, 2014 నుంచి సెక్షన్ 80సీ పరిమితిలో మార్పు చేయలేదు. ఈ పరిమితిని పెంచితే ట్యాక్స్‌పేయర్లకు ద్రవ్యోల్బణం నుంచి ఊరట లభిస్తుందని, ఈఎల్‌ఎస్‌ఎస్, పన్ను ఆదా ఎఫ్‌డీలు, పీపీఎఫ్‌ల్లో పొదుపునకు ప్రోత్సాహం ఇచ్చినట్టవుతుందని క్లియర్‌ట్యాక్స్ సీఈవో అచిత్ గుప్తా అభిప్రాయపడ్డారు.
ఎన్‌పీఎస్
నేషనల్ పెన్షన్ సిస్టమ్ (ఎన్‌పీఎస్)లో పొదుపును ప్రోత్సహించేదిశగా సెక్షన్ 80సీసీడీ1బీ కింద ఆదాయపు పన్ను మినహాయింపు పరిమితిని పెంచుతారని పర్సనల్ ఫైనాన్స్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈపీఎఫ్ తదితర ఇతర రిటైర్‌మెంట్ స్కీమ్‌ల తరహాలో ఎన్‌పీఎస్ మెచ్యూరిటీ విత్‌డ్రాయిల్స్‌పై పన్ను మినహాయింపు పరిమితిని పెంచవచ్చని అంచనా వేస్తున్నట్టు ట్యాక్స్2విన్ సీఈవో అభిషేక్ సోని తెలిపారు. ఎన్‌పీఎస్ ఫ్రేమ్‌వర్క్‌కు లోబడి కంట్రిబ్యూషన్ పరిమితులను పెంచుతారని, విత్‌డ్రాయిల్ ఫ్లెక్సిబిలిటీని మెరుగుపరుస్తారని భావిస్తున్నామన్నారు.
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ లాభం రూ.16,474 కోట్లు
- స్వీక్వెన్షియల్‌గా తగ్గుదల
- 1.33 శాతానికి పెరిగిన మొండి బకాయిలు
ముంబై, జూలై 20: ప్రైవేటు రంగ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కన్సాలిడేటెడ్ నికరలాభం 2024 జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో 33.17 శాతం వృద్ధిచెంది రూ. 16,474.85 కోట్లకు చేరింది. నిరుడు ఇదేకాలంలో బ్యాంక్ రూ. 12,370 కోట్ల కన్సాలిడేటెడ్ నికరలాభాన్ని ఆర్జించింది. స్టాండెలోన్ ప్రాతిపదికన నికరలాభం రూ.11,951 కోట్ల నుంచి రూ.16,174 కోట్లకు చేరింది. అయితే ఈ ఏడాది మార్చి త్రైమాసికంలో ఆర్జించిన రూ.16,511 కోట్లకంటే స్వీక్వెన్షియల్‌గా నికరలాభం 2 శాతం తగ్గింది. ఏడాది ప్రాతిపదికన బ్యాంక్ మొత్తం ఆదాయం రూ.57,816 కోట్ల నుంచి రూ. 83,701 కోట్లకు చేరింది. వడ్డీ ఆదాయం స్వీక్వెన్షియల్‌గా 2.6 శాతం పెరిగి రూ. 29,078 కోట్ల నుంచి రూ. 29,837 కోట్లకు పెరిగింది. స్థూల మొండి బకాయిలు 1.33 శాతానికి పెరిగాయి. 2024 మార్చిలో ఇవి 1.24 శాతమే. జూన్ 30 నాటికి హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ క్యాపిటల్ అడిక్వసీ రేషియో 19.33 శాతంగా ఉంది.
కోటక్ బ్యాంక్‌కు జనరల్ ఇన్సూరెన్స్ బూస్ట్
ముంబై, జూలై 20: కోటక్ మహీంద్రా బ్యాంక్ నికరలాభం స్టాండెలోన్ ప్రాతిపదికన జూన్‌తో ముగిసిన తొలి త్రైమాసికంలో 81 శాతం వృద్ధిచెంది రూ. 6,250 కోట్లకు చేరింది. నిరుడు ఇదేకాలంలో బ్యాంక్ రూ.3,452 కోట్ల స్టాండెలోన్ నికరలాభాన్ని సంపాదించింది. కోటక్ జనరల్ ఇన్సూరెన్స్‌లో 70 శాతం వాటాను జ్యురిచ్ ఇన్సూ రెన్స్ గ్రూప్‌నకు విక్రయించడంతో వచ్చిన లాభాలు కలిసినందున మొత్తంగా బ్యాంక్ నికరలాభంలో భారీ వృద్ధి సాధ్యపడింది. దీనితో వచ్చిన రూ. 2,730 కోట్లను మినహాయిస్తే కోటక్ బ్యాంక్ స్టాండెలోన్ నికర లాభం 2 శాతం వృద్ధితో రూ. 3,520 కోట్ల కు పెరిగింది. బ్యాంక్ మొత్తం ఆదాయం రూ.13,183 కోట్ల నుంచి రూ.15,675 కోట్ల కు చేరింది. వడ్డీ ఆదాయం రూ.10,500 కోట్ల నుంచి రూ.12,746 కోట్లకు పెరిగింది. స్థూల మొండి బకాయిలు మాత్రం 1.39 శాతం వద్ద స్థిరంగా ఉన్నాయి.
యూనియన్ బ్యాంక్ లాభం రూ. 3,679 కోట్లు
ముంబై, జూలై 20: ప్రభుత్వ రంగ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నికరలాభం జూన్ త్రైమాసికంలో 13.7 శాతం పెరిగి రూ. 3,679 కోట్లకు చేరింది. బ్యాంక్ నికర వడ్డీ ఆదాయం 6.5 శాతం వృద్ధితో రూ. 9,412 కోట్లకు చేరింది. నికర వడ్డీ మార్జిన్ మాత్రం 0.13 శాతం తగ్గి 3.05 శాతం వద్ద నిలిచింది. మార్జిన్ తమ గైడెన్స్ 2.83 శాతంకంటే అధికంగానే ఉన్నదని, 3 శాతం ఎగువన కొనసాగించడం సవాలుతో కూడుకున్నదని యూనియన్ బ్యాంక్ సీఈవో, ఎండీ మణిమేఖలై చెప్పారు. బ్యాంక్ వద్ద లిక్విడిటీ చట్టబద్ద రేషియోకంటే అధికంగానే రూ. 65,000 కోట్ల మేర ఉన్నదని, ఈ ఆర్థిక సంవత్సరం 11 శాతం అడ్వాన్సుల వృద్ధి, 8 శాతం డిపాజిట్ల వృద్ధి సాధిస్తామన్న గైడెన్స్‌ను సీఈవో పునరుద్ఘాటించారు. రూ.54,000 కోట్ల పెద్ద కార్పొరేట్ అడ్వాన్సులు పైప్‌లైన్‌లో ఉన్నాయని, ప్రభుత్వ రంగ కంపెనీల నుంచి డిమాండ్ అధికంగా ఉన్నదని తెలిపారు. బ్యాంక్ స్థూల ఎన్‌పీఏ రేషియో 4.54 శాతానికి పెరిగింది.
యస్ బ్యాంక్ లాభంలో భారీ వృద్ధి
ముంబై, జూలై 20: ప్రైవేటు రంగ యస్ బ్యాంక్ కేటాయింపులు తగ్గడంతో నికరలాభాన్ని భారీ పెంచుకున్నది. ఈ ఏప్రిల్ జూన్ త్రైమాసికంలో నికరలాభం 46.7 శాతం వృద్ధిచెంది రూ. 502 కోట్లకు చేరింది. బ్యాంక్ నికర వడ్డీ ఆదాయం 12.2 శాతం పెరిగి రూ. 2,000 కోట్లకు చేరింది. అయితే నికర వడ్డీ మార్జిన్ మాత్రం 2.4 శాతం వద్ద ఫ్లాట్‌గా నిలిచింది. బ్యాంకింగ్ వ్యవస్థ డిపాజిట్ల వృద్ధితో సతమతమవుతున్న తరుణం లో యస్ బ్యాంక్ డిపాజిట్లు 20 శాతం పెరిగాయి. మొండి బకాయిల రికవరీ కారణం గా కేటాయింపులు 41 శాతం తగ్గి రూ.212 కోట్లకు పరిమితమైనట్టు యస్ బ్యాంక్ తెలిపింది. బ్యాంక్ స్థూల మొండి బకాయిలు 1.7 శాతం వద్ద స్థిరంగా ఉన్నాయి.