calender_icon.png 10 January, 2025 | 6:19 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కేంద్ర బడ్జెట్‌పైనే ఆశలు

14-07-2024 06:22:31 AM

  • భారీగా నిధులను ఆశిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం 
  • ఎఫ్‌ఆర్‌బీఎం చట్టం నిబంధనలతో సర్కారుకు ఇబ్బందులు 
  • బడ్జెటేతర రుణ పరిమితి పెంపు కోసం ఎదురుచూపు 
  • సంక్షేమ పథకాలకు గ్రాంట్ల పెంపుపై సందిగ్ధం?

హైదరాబాద్, జూలై 13 (విజయక్రాంతి): గత ప్రభుత్వం చేసిన రుణాలతో రాష్ట్రం అప్పుల కుప్పగా మారిందని కాంగ్రెస్ సర్కారు చెబుతోంది. దీంతో రైతు రుణమాఫీ, ఆరు గ్యారంటీలను అమలు చేయాలన్నా, అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టాలన్నా తెలంగాణ ప్రభుత్వానికి భారీ నిధులు కావాలి. ఈ క్రమంలోనే ఈనెల 23న పార్లమెంట్‌లో ప్రవేశపెట్టబోయే బడ్జెట్ రాష్ట్రం ప్రభుత్వం కోటి ఆశలు పెట్టుకుంది.

ఈ బడ్జెట్‌లో రాష్ట్రానికి కేంద్రం అధిక నిధులు కేటాయించాలని, బడ్జెటేతర రుణాలను తీసుకునేందుకు ఉన్న అడ్డంకులను తొలగించాలని ప్రభుత్వం కోరుతోంది. తెలంగాణకు సంబంధించిన ప్రతిపాదలను రేవంత్ సర్కారు సిద్ధం చేస్తోంది. రాబోయే ఐదారు రోజుల్లో  కేంద్రానికి ప్రతిపాదనలను పంపేందుకు సిద్ధమవుతోంది. ఈ క్రమంలో ఒకవైపు బడ్జెట్ అంచనాలను సిద్ధం చేయడంతో పాటు కేంద్రానికి ప్రతిపాదనలు పంపే ఉద్దేశంతోనే సీఎం రేవంత్ రెడ్డి గత మూడు రోజులుగా వివిధ శాఖలపై సమీక్షలు నిర్వహిస్తున్నారు. 

బడ్జెటేతర రుణ పరిమితిపై వెలుసుబాటు?

తెలంగాణ సర్కారు సంక్షేమ పథకాలను అమలు చేయాలంటే తప్పనిసరిగా అప్పులు చేయాల్సిందే. అయితే రాష్ట్రాలు చేసే అప్పులపై కేంద్రం కొన్ని ఆంక్షలు విధించింది. వార్షిక పద్దులో చూపించిన రుణాలు కాకుండా ఆఫ్ అప్పులు ఇష్టమొచ్చినట్లు చేయడానికి వీలులేదని స్పష్టం చేసింది. ఎఫ్‌ఆర్‌బీఎం చట్టం ప్రకారం బడ్జెటేతర రుణాలు జీడీపీలో 3 శాతం మాత్రమే ఉండాలని 2022లో కేంద్రం మార్గదర్శకాలను సవరించింది. అంతేకాకుండా రాష్ట్రప్రభుత్వ హామీతో కార్పొరేషన్ల ద్వారా తీసుకున్న బడ్జేతర రుణాలను వార్షిక పద్దులో భాగంగానే పరిగణిస్తామని ఆ మార్గదర్శకాల్లో కేంద్రం చెప్పింది. ఈ క్రమంలోనే గత ప్రభుత్వం చేసిన రూ.35వేల కోట్లను వార్షిక బడ్జెట్‌లోని రుణంగా కేంద్రం పరిగణించింది.

దీని వల్ల ఎఫ్‌ఆర్‌బీఎం చట్టం సూచించిన దానికి కంటే రాష్ట్ర అప్పులు భారీగా పెరిగిపోయాయి. ఎఫ్‌ఆర్‌బీఎం చట్టానికి లోబడి రుణాలను తీసుకుంటే కేంద్రం ప్రోత్సహాకాలను అందిస్తుంది. అయితే రాష్ట్ర అప్పులు ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితి దాటిపోవడంతో ప్రోత్సహకాలను కోల్పోవాల్సి వచ్చింది. ఫలితంగా రాష్ట్రానికి తీవ్ర నష్టం వాటిల్లింది. అయితే రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ఈ నిబంధనల్లో వెసులుబాటును కోరుతోంది. రాష్ట్రానికి నిధులు భారీగా అవసరం ఉన్న నేపథ్యంలో బడ్జెటేతర రుణాల పరిమితి పెంచి, తెలంగాణకు అండగా నిలువాలని ఇటీవల ఢిల్లీలో సీఎం రేవంత్‌రెడ్డి కేంద్ర హోంమంత్రి అమిషాను కలిసినప్పుడు కోరారు.

కేంద్రం గ్రాంట్లు, బకాయిలు విదిల్చేనా?

రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలకు కేంద్రం గ్రాంట్లను విడుదల చేస్తుంది. అయితే ఆ నిధులను ఈ బడ్జెట్‌లో పెంచాలని రాష్ట్రం కోరుతోంది. బకాయిలను కూడా విడుదల చేయాలని వేడుకుంటోంది. ఈ విషయమై ఇటీవల సీఎం, డిప్యూటీ సీఎం భట్టి.. ప్రధాని మోదీని కలిసి విన్నవించారు. అంతేకాకుండా కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం పలుమార్లు లేఖలు కూడా రాసింది. పంచాయతీరాజ్, రహదారుల అభివృద్ధికి బడ్జెట్‌లో తెలంగాణ కు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని లేఖల్లో పేర్కొంది. ముఖ్యంగా ఇందిరమ్మ ఇళ్లు, పంచాయతీల్లో రోడ్ల నిర్మాణం, హెల్త్ స్కీమ్, సాగునీటి ప్రాజెక్టులు, తాగునీటి సరఫరా పథకాల కోసం కేంద్రం నుంచి రేవంత్‌రెడ్డి సర్కారు అధిక నిధులను ఆశిస్తోంది.

మరి కేంద్రం తెలంగాణ సర్కారు ప్రతిపాదనలకు ఎంత ప్రాధాన్యం ఇస్తోందో వేచి చూడాలి. కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణ కేటాయింపులు చూశాక రాష్ట్ర పద్దును ఖరారు చేసేందుకు రేవంత్‌రెడ్డి సర్కారు సిద్ధమవుతోంది. ముఖ్యంగా కేంద్రం ప్రాధాన్యం ఇచ్చిన రంగాలకు రాష్ట్ర బడ్జెట్‌లో కేటాయింపులు తగ్గించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచా రం. కేంద్ర బడ్జెట్‌లో కేటాయింపులు సరిగా లేని రంగాలకు రాష్ట్ర పద్దులో ప్రాధాన్యం ఇవ్వాలని చూస్తోంది.